Jyoti Malhotra : యూట్యూబర్ జ్యోతి యవ్వారం మామూలుగా లేదు. అరెస్ట్ అయ్యాక ఆమె అరాచకాలు ఒక్కోటీ బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఆమెకు ఏ రేంజ్‌లో రాచమర్యాదలు లభించాయో వెల్లడవుతున్నాయి. విమానంలో ఫస్ట్ క్లాస్ టికెట్‌తో పాక్‌లో అడుగుపెట్టింది జ్యోతి మల్హోత్రా. వెళ్లగానే ఆమెకు రెడ్ కార్పెట్ వెల్‌కమ్ ఇచ్చారని తెలుస్తోంది. పాక్ ఎంబసీ అధికారి డానిష్ సూచనలతో అక్కడి అధికారులు జ్యోతిని హైప్రొఫైట్ పర్సన్‌గా ట్రీట్ చేశారట. 10 రోజులు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారట. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకూ.. ఆ టూర్ అంతా ఐఎస్ఐ కనుసన్నల్లో, పటిష్టమైన భద్రతతో కొనసాగిందని తెలుస్తోంది. అందుకు తగ్గ వీడియో ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి.
అంత మంది గన్‌మెన్స్ ఎందుకు?
క్యాలమ్ మిల్ అనే స్కాటిష్ యూట్యూబర్ అప్‌లోడ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అందులో జ్యోతి మల్హోత్రా పాక్ టూర్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. లాహోర్‌లోని అనార్కలి బజార్‌లో షూట్ చేసిన వీడియో అది. అందులో, జ్యోతి మరికొందరు టూరిస్టులు ముందు నడుస్తుండగా.. వారికి ఏకే 47 గన్స్‌తో ఉన్న ఆరుగురు భద్రతా సిబ్బంది సెక్యూరిటీగా ఉన్నారు. కొందరు గార్డ్స్ జాకెట్స్ వేసుకుని ఉండగా.. వాటిపై ‘నో ఫియర్’ అని కొటేషన్ రాసుంది. అంటే వాళ్లు హై ట్రైన్డ్ గార్డ్స్ అని తెలుస్తోంది. ఆమెకు అన్ని తుపాకులతో, అంత టైట్ సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఏముందంటూ ఆ స్కాటిష్ యూట్యూబర్ సైతం అనుమానం వ్యక్తం చేయడం ఆసక్తికరం. అత్యంత పటిష్ట భధ్రత మధ్య జ్యోతి పాక్ పర్యటన కొనసాగిందని ఆ వీడియోను బట్టి తెలుస్తోంది.
పాకిస్తాన్ గ్రేట్..?
తనను షూట్ చేస్తున్న స్కాటిష్ యూట్యూబర్‌ను జ్యోతి పలకరించింది. మీరు పాకిస్తాన్ రావడం ఇదే ఫస్ట్ టైమా? అంటూ అడిగింది. కాదు, తాను ఇప్పటికి ఐదుసార్లు పాక్‌కు వచ్చానని అతను చెబుతున్నాడు. మీకు పాకిస్తాన్ పర్యటన ఎలా అనిపించింది? అంటూ జ్యోతి మల్హోత్రాను ఆ యూట్యూబర్ ప్రశ్నిస్తే.. ‘గ్రేట్’ అంటూ ఆన్సర్ ఇచ్చిందామె. ఇదంతా ఆ వీడియోలో రికార్డ్ అయింది.
లగ్జరీ లైఫ్‌స్టైల్..
ఆ వీడియో చూస్తే అనేక డౌట్స్. జ్యోతి అండ్ టీమ్‌కు ఏకే 47 గన్స్‌తో ఆరుగురు కాపలాగా ఉన్నారంటే.. ఆమె పర్యటనకు పాక్ ఎంతటి ప్రాధాన్యం ఇచ్చిందో తెలుస్తోంది. ఐఎస్‌ఐ అంటే ఆ దేశ అత్యున్నత సైనిక విభాగం. వారి ఆదేశాలతోనే జ్యోతికి అంతటి సెక్యూరిటీ ఇచ్చారని అంటున్నారు. అంటే, పాక్ పెద్దలతో జ్యోతికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేగా అర్థం. ఇప్పటికే దేశ సైనిక స్థావరాల సమాచారం పాక్ ఏజెన్సీలకు జ్యోతి మల్హోత్రా అందించిందనే ఆరోపణలో ఆమెను అరెస్ట్ చేశారు హర్యానా పోలీసులు. గూఢాచారం కేసులో విచారిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు.
చైనాకూ సీక్రెట్స్ అమ్మేశారా?
జ్యోతి లగ్జరీ లైఫ్‌స్టైల్ లీడ్ చేసినట్టు గుర్తించారు. ఎక్కడికైనా ఫ్లైట్‌లో ఫస్ట్ క్లాస్‌లోనే ప్రయాణించేది. లగ్జరీ స్టార్ హోటల్స్‌లోనే ఉండేది. ఖరీదైన రెస్టారెంట్స్‌లోనే తినేది. అయితే, ఇందతా తాను స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్‌తో వెళ్లానని జ్యోతి చెబుతున్నా.. ఆ స్పాన్సర్ చేసింది కూడా పాక్ ఐఎస్ఐ వాళ్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ట్రిప్ ఆసాంతం ఆమెకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ లభించిందని తెలుస్తోంది. పాక్ తర్వాత జ్యోతి చైనా సైతం వెళ్లారు. అక్కడ కూడా ఆమె లగ్జరీ కార్లలో ప్రయాణించిందని.. ఖరీదైన జ్యువెల్లరీ షాపుల్లో షాపింగ్ చేసిందని తెలుస్తోంది. ట్రెవెలర్ ముసుగులో జ్యోతి మల్హోత్రా చేసిన దేశద్రోహం ఇంకా చాలానే ఉందని భావిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.