Wife Maintenance Case| భర్తకు సంబంధించిన పూర్వీకుల ఆస్తిలో తనకుకూడా వాటా ఉందని భార్య ఆరోపించింది. అందువల్ల తనకు చెల్లించే భరణాన్ని పెంచాలని కోర్టును ఆశ్రయించింది. అయితే, భార్య నెలకు రూ.1.5 లక్షలకు పైగా సంపాదిస్తుండటం కూడా ఈ కేసులో కీలకంగా మారింది. ఈ అంశాలను పరిశీలించిన కర్ణాటక హైకోర్టు ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ దంపతులకు 2009 ఏప్రిల్ 13న వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికే భార్య గృహహింస చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు పెట్టారు. భర్త తనను ఓమ్ని కారు కొనివ్వాలని వేధించారని ఆమె ఆరోపించింది. ఆ డిమాండ్‌ను తిరస్కరించడంతో శారీరకంగా, మానసికంగా హింసించారని పేర్కొన్నారు.
అయితే, భర్త ఈ ఆరోపణలను ఖండించారు. విచారణ అనంతరం ట్రయల్ కోర్టు భార్యకు కొన్ని ఉపశమనాలు కల్పించింది.
భర్త ప్రతి నెలా రూ.5,000 ఇంటి అద్దె కోసం చెల్లించాలని ఆదేశించింది. అలాగే రూ.4,000 నెలవారీ భరణం ఇవ్వాలని సూచించింది. అదనంగా రూ.40,000 పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే, ఈ మొత్తం సరిపోవడం లేదని భార్య హైకోర్టును ఆశ్రయించారు.
భర్త తరఫున న్యాయవాది ప్రదీప్ వాదనలు వినిపించారు. గతంలో తన క్లయింట్ ఓ పాఠశాలను నిర్వహించేవారని తెలిపారు. అయితే, ఆ పాఠశాల మూతపడటంతో ప్రస్తుతం ఆయనకు ఉద్యోగం లేదని చెప్పారు. భార్య నెలకు రూ.1.5 లక్షలకు పైగా సంపాదిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల మరింత భరణం చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు.
తన క్లయింట్‌కు కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే ఉందని తెలిపారు. ఆ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.4.5 లక్షల రుణం తీసుకున్నారని వివరించారు. అయితే, భరణం చెల్లించకుండా ఆదేశాలను ఉల్లంఘించిన విషయాన్ని హైకోర్టు గమనించింది. ఆర్థిక ఇబ్బందులున్నాయని భర్త చెప్పినప్పటికీ, భూమిని తాకట్టు పెట్టి రూ.4.5 లక్షలు సమకూర్చుకున్నారని గుర్తించింది.
2026 మార్చి 18న రూ.10,000 చెల్లించారని ఆయన న్యాయవాది తెలిపారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించే స్థోమత లేదని వివరించారు.
భర్తకు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉందని భార్య తరఫు న్యాయవాది వాదించారు. ఆస్తుల వివరాలను భర్త పూర్తిగా వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పూర్వీకుల ఆస్తిలో భర్తకు ఎంత వాటా వస్తుందో ఇంకా ఖరారు కాలేదని హైకోర్టు గుర్తించింది. అందువల్ల ఆ ఆస్తిని అదనపు భరణానికి కారణంగా పరిగణించలేమని పేర్కొంది. అదనపు భరణం ఇవ్వడానికి సరైన కారణాలు లేవని హైకోర్టు చెప్పింది.
Also Read: ఉద్యోగులకు కొత్త కంపెనీ బంపర్ ఆఫర్.. ఏ టైమ్‌లోనైనా పనిచేయండి, ఇష్టమొచ్చినప్పుడు సెలవులు
భార్య ఆదాయం, భర్త ఉద్యోగ పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితులను కోర్టు పరిశీలించింది. భార్య ఆర్థిక వివరాలు ఆమె న్యాయపరమైన ఖర్చులను భరించగల సామర్థ్యాన్ని కూడా చూపించాయని గమనించింది. భర్త నిరుద్యోగిగా ఉన్నారన్న వాదనను భార్య వ్యతిరేకించినప్పటికీ, కోర్టు అందుబాటులో ఉన్న అంశాలను పరిశీలించింది. ఈ దంపతులకు పిల్లలు కూడా లేరు.
అందువల్ల భరణాన్ని మరింత పెంచాల్సిన అవసరం లేదని హైకోర్టు నిర్ణయించింది. భార్య దాఖలు చేసిన రివిజన్ పిటిషన్లను కొట్టివేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా కొనసాగించింది.