Elon Musk Gifts PM Modi : అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో మస్క్ తన కుటుంబ సభ్యులతో పాటుగా హాజరవ్వగా, అతని ముగ్గురు పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకు ముందు ట్రంప్ తో సమావేశంలో ఎలాన్ మస్క్ చిన్న కుమారుడు.. చలాకీగా వైట్ హౌస్ లో తిరుగుతూ సందడి చేశారు. మామూలుగానే చిన్నారులు కనిపిస్తే ముద్దు చేసే ప్రధాని మోదీ.. మస్క్ పిల్లలతోనూ సరదాగా మాట్లాడారు. వారి పిల్లలకు ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. ఎలాన్ మస్క్ సైతం.. భారత ప్రధానికి ఓ అరుదైన, చారిత్రక వస్తువును కానుకగా అందజేశారు. దీంతో.. ఇప్పుడు చాలా మంది మస్క్ పిల్లలకు మోదీ ఎలాంటి బహుమతి అందించారనే విషయమై ఆసక్తిగా ఉన్నారు. అలాగే.. ప్రధాని అందుకున్న కానుక ప్రత్యేకత ఏంటి అని ఆరా తీస్తున్నారు. మరి.. వాటి విశేషాలు ఏంటో.. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్‌లోని బ్లెయిర్ హౌస్‌లో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌లను కలిశారు. మిస్టర్ మస్క్.. తన ముగ్గురు పిల్లలు, భార్య శివోన్ జిలిస్‌తో కలిసి ప్రధాని మోదీకి ఒక బహుమతిని అందజేశారు. ఆ బహుమతి సాధారణమైనది కాదు, దానికి ఓ చరిత్ర ఉంది అంటున్నారు. అందుకే.. ఈ బహుమతి చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్ పాలనలో ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE)ని పర్యవేక్షించే బాధ్యతల్లో ఉన్న ఎలాన్ మస్క్.. గతేడాది అక్టోబర్‌లో SpaceX స్టార్‌షిప్ టెస్ట్ ఫ్లైట్-5లోని హీట్‌షీల్డ్ భాగాన్ని అందజేశారు. ఈ రాకెట్ కు ఓ ప్రత్యేక ఉంది. ఇప్పటి వరకు ప్రయోగిస్తున్న రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్లడం, దాని విడిభాగాలు.. తిరిగి భూబాగంలోకి వచ్చి కాలిపోవడం లేదా సముద్రాల్లో పడిపోతుంటాయి. కానీ.. స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ పునర్వినియోగ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇందులో ఓ సారి వినియోగించిన రాకెట్ ను మళ్లీ తిరిగి వాడుకోవచ్చు. అంటే.. ఆ రాకెట్ సురక్షితంగా ప్రయోగించిన స్థలం వద్దకే వచ్చేయాలి. అలా.. స్పేస్ ఎక్స్ ప్రయోగించి, విజయం సాధించిన తొలి రాకెట్లో ఓ భాగమే ఈ కానుక.
పునర్వినియోగ వాహకనౌక ద్వారా భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలను మరింత సమర్థవంతంగా, ఆర్థికంగా తక్కువ ధరల్లో చేయడానికి ఉద్దేశించింది. అలా.. ఈ స్టార్ షిప్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది. దీనిపై.. “స్టార్‌షిప్ ఫ్లైట్ టెస్ట్ 5. అక్టోబర్ 13, 2024” అనే పదాలను ముద్రించారు. దీనిపై స్పందించి స్పేస్‌ఎక్స్.. ఈ బహుమతి స్టార్‌షిప్‌లోని సిరామిక్ హీట్‌షీల్డ్ టైల్ అని తెలిపింది. దీనిని అంతరిక్ష నౌక భూమికి తిరిగి వచ్చేటప్పుడు భూమి వాతావరణంలోకి పునః ప్రవేశించే సమయంలో ఎదురయ్యే తీవ్ర వేడి నుంచి రక్షించ కల్పించేందుకు రూపొందించారని తెలిపింది.
పిల్లలకు ప్రధాని బహుమతులు
చిన్నారులు ఎక్కడ కనిపించినా వారితో ఆప్యాయంగా కలిసిపోయే ప్రధాని మోదీ.. మస్క్ పిల్లలకు మూడు భారతీయ క్లాసిక్ పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. వీటిలో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన “ది క్రెసెంట్ మూన్”, ది గ్రేట్ ఆర్కే నారాయణ్ కలెక్షన్, పండిట్ విష్ణు శర్మ రచించిన పంచ తంత్రం పుస్తకాలు ఉన్నాయి. మన దేశ విజ్ఞానంతో పాటు పిల్లలకి చదువుపై, కథలతో జ్ఞానాన్ని అందించిన విధానం ఈ పుస్తకాల ద్వారా అందుతుంది. ఎన్నో ఏళ్ల క్రితమే నీతి కథల ద్వారా ఎలా విద్యను అందించారో.. ఈ పంచతంత్రం కథలు గొప్ప ఉదాహరణగా నిలుస్తాయంటూ మంచి అభిప్రాయం ఉంది. ఈ బహుమతుల్ని అందుకున్న మస్క్ పిల్లలు ఆనందంగా వాటిని స్వీకరించారు. ప్రధాన మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన చిత్రాలలో మస్క్ పిల్లలు.. ఈ పుస్తకాలను ఇష్టంతో చూస్తున్నట్లుగా ఉంది. వాషింగ్టన్ డీసీలో ఎలోన్ మస్క్ తో చాలా మంచి సమావేశం జరిగింది.
Also Read : ట్రంప్‌తో చర్చలు సఫలమేనా? మోదీ ఏం సాధించారు.. ప్రవాసులు ఇక సేఫేనా?
మోదీ – ఎలాన్ మస్క్ భేటీపై ప్రధాని మోదీ స్పందించారు. అంతరిక్షం, ఆటోమొబైల్, సాంకేతికత, ఆవిష్కరణ వంటి అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపారు. సంస్కరణల దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ను మరింత ముందుకు తీసుకెళ్లడం గురించి తాను మాట్లాడాను అంటూ ప్రధాని X లో ఒక పోస్ట్‌లో రాశారు. మిస్టర్ ఎలోన్ మస్క్ కుటుంబాన్ని కలవడం, విస్తృత శ్రేణి విషయాల గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.