Sindoor Baby: పాక్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ రోజునే.. బీహార్‌లోని తీహార్ జిల్లాలో ఓ చిన్నారి జన్మించింది. దీంతో ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు సిందూర్ అనే పేరు పెట్టారు. అయితే పాపకు సిందూర్ అంటే అర్ధం ఇప్పుడే తెలియకపోయినా.. ఆమె పెరిగి పెద్దైన తర్వాత ఆ పేరుకు అర్దం తెలుసుకుంటుందని.. ఆ పాప పేరెంట్స్ సంతోషంతో తెలియజేశారు. దేశభక్తి చాటుకున్న ఆ తల్లిదండ్రులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్.. ఈ పేరు వెనకున్న అర్ధమేంటి?
ఆపరేషన్ సిందూర్.. ఈ పేరు వెనకున్న అర్ధమేంటి? సిందూరాన్ని హైలెట్ చేయడంలో ఉన్న మర్మమేంటి? ఈ పేరే ప్రత్యేకించి ఈ ఆపరేషన్ కి ప్రధాని మోడీ ఎందుకు పెట్టినట్టు? ఈ ఆపరేషన్‌కి హైందవ సంప్రదాయానికి ఉన్న సంబంధమేంటి? మన మహిళా మూర్తులకు సింధూరం ఎందుకంత ప్రత్యేకం? అలాంటి సిందూరాన్ని తమ ఆపరేషన్‌కి పేరుగా ఎందుకు పెట్టుకున్నారు? దీని వెనక దాగిన అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మే 6వ తేదీ
అర్ధరాత్రి 1. 05 గం. నుంచి 1. 30గం. వరకూ
దాడి సాగింది.. 25 నిమిషాలు మాత్రమే అయినా..
24 మిస్సైళ్లతో పీవోజేకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన భీకర దాడిగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.
మొత్తం తొమ్మిది స్థావరాలు..
లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్.. తో సంబంధమున్న పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మృతి.. దీని పేరు ఆపరేషన్ సిందూర్..
ఈ పేరే పెట్టడానికి గల కారణం..
ఈ ఆపరేషన్ కి ఈ పేరే పెట్టడానికి గల కారణం.. ఇదిగో హిమాన్షు. ఆమె తన కాళ్ల పారాణి అయినా ఆరక ముందే.. తన భర్తను కోల్పోయిన విధం.. భారతదేశం మొత్తాన్ని నిలువునా ఒణికించేసింది. పట్టుమని పది రోజులు కూడా నిలవని దాంపత్యం. తన భర్త భౌతిక కాయం ముందు ఆమె విలపిస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించి వేసింది.
ఇదిగో ఈ హిమాన్షు దీన గాథే..
తనే పాపం చేసింది? పెళ్లి చేసుకుని హనీమూన్ లో భాగంగా కాశ్మీర్ కి వెళ్లడమే నేరమైందా? అంత మాత్రానికే తన భర్తను కోల్పోవాలా? కాశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందీ.. పర్యాటక స్వర్గధామం అన్నారే. మీ మాటలను నమ్మి వచ్చినందుకు ఇదేనా శాస్తి? అంటూ ఆమె చేసిన మౌన రోదన.. ఈ ప్రపంచం మొత్తాన్ని కలచి వేసింది. ఆమె కార్చిన కన్నీళ్లు వేసిన ప్రశ్నలకు బదులు చెప్పాలనుకుంది భారత ప్రభుత్వం.
ప్రపంచాన్ని కదిలించిన హిమాన్షు మౌన రోదన
మరీ ముఖ్యంగా ఆమె దీనంగా రోదిస్తోన్న దృశ్యం భారత ప్రధానిని కదిలించింది. ఇంత పెద్ద సైనిక శక్తి కలిగి ఉండి.. ఇంత భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తూ.. ఏటా కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు కేవలం రక్షణకే ఖర్చు చేస్తూ.. మన జీడీపీలో సుమారు రెండు శాతం.. మన బడ్జెట్ లో అటు ఇటుగా 14 శాతం కేవలం సైనిక అవసరాలకే ఖర్చు పెడుతోంది ఇందుకోసమా? మనల్ని నమ్మి మన దేశంలో భాగమైన ఒక ప్రాంతానికి తన భర్తతో సహా వెళ్లిన ఒక నవ వధువు.. తిరిగి తాను ఒంటరి కావడమే కాకుండా.. అతడు శవపేటికలో తిరిగి రావడమా? అత్యంత బాధాకరం.. ఈ జాతి యావత్తూ సమాధానం చెప్పి తీరాల్సిన హృదయ విదారక దృశ్యం.
మోడీ గుండెలకు తాకిన హిమాన్షు సెల్యూట్
అంత దైన్యంలోనూ ఆ నవ వధువు జైహింద్ అంటూ చేసిన ఆ సెల్యూట్ ఒక్కసారిగా మోడీ గుండెలకు తాకింది. ఆమె దేశ భక్తికి ఆయన పూర్తిగా చలించి పోయారు. కలకంటి కంట కన్నీరొలికించిన కఠిన మానవుల పని పట్టి తీరాల్సిందేనని అప్పుడే గట్టిగా నిర్ణయించారు.
తననూ, తన కుమారుడ్నీ చంపేయమని
మరో దీనగాథ.. తన భర్తను చంపిన ఉగ్రవాదితో ఆ బాధిత మహిళ.. తననూ, తన కుమారుడ్ని కూడా చంపేయమని ప్రాధేయ పడింది. తన భర్త లేని జీవితం తాము గడపలేమని ఆ కఠినాత్ముడితో చెప్పుకుని బాధ పడింది. వెళ్లి మీ మోడీతో చెప్పుకోండి. ఇదీ ఆ ఉగ్రవాది నుంచి కఠువుగా వినవచ్చిన సమాధానం.. ఇది కూడా జాతి మొత్తాన్ని తీవ్రంగా ఆలోచింప చేసింది. ఆమె స్వయంగా చెప్పుకోకున్నా.. మోడీ చెవికి స్పష్టంగా వినిపించింది.
26 మంది భారతీయ మహిళల సింధూరం చెదిరిన రోజు
ఇలా ఒకరిద్దరు కాదు ఏక మొత్తంగా 26 మంది భారతీయ మహిళల సిందూరం చెదిరిన రోజది. భారతీయ సంప్రదాయంలో ఐదో తనం మరేదో కాదు వారి భర్త. అందుకు చిహ్నం వారు నుదుటున దాల్చే సిందూరం. అలాంటి సిందూరాలను కోల్పోయిన ఆ మహిళామణులకు తగిన న్యాయం జరగాలంటే చేయాల్సిందేంటి? అన్న ఆలోచన మన భారత సైన్యాన్ని క్షణ క్షణం ఆలోచింప చేసింది.
మన నారీమణి యుద్ధ భేరి మోగిస్తే..
దానికి తోడు మన భారతదేశాన్ని భారతమాతగా అభివర్ణించుకుంటాం. అలాంటి భారత మాతను ప్రతి స్త్రీరూపంలో దర్శించుకుంటాం. మరి వారి శక్తియుక్తులు, సామర్ధ్యాలను.. ముష్కర మూకలకు తెలియ చేయవద్దా? మన నారీ మణి ఒక్కసారి యుద్ధ భేరి మోగిస్తే ఎలా ఉంటుందో ఆ దుష్ట దుర్మార్గులకు, రక్త పిపాసులకు తెలియ చేయవద్దా? అందుకే ఈ ఆపరేషన్ కి సిందూర్ అంటూ నామకరణం చేసింది.
భారతీయ మహిళల జోలికి వస్తే..
దాని ఫలితమే మే ఆరవ తేదీ అర్ధరాత్రి మన నారీమణి శక్తి సామర్ధ్యాలను తెలియ చేసేలా భారత సైన్యం ఉగ్ర మూకలు తలదాచుకున్న చోట్లను వెతికి మరీ భస్మీ పటలం చేసింది. భారీ ఎత్తున ఉగ్రమూకలను నామ రూపాల్లేకుండా చేసింది. ఒకప్పుడు తమ పేరు చెబితే భారతీయులు నిలువెల్లా ఒణికిపోవాలని ఆశించిన ఉగ్రవాదులకు.. వచ్చే రోజుల్లో భారతీయ మహిళల జోలికొస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వంలో విధ్వంసం సృష్టించి.. ఇక్కడ ప్రతి మహిళా ఒక ఆదిపరాశక్తేనంటూ నిరూపించింది.
న్యాయం జరిగిందన్న భారత సైన్యం
ఒక రకంగా చెబితే.. మే ఆరు భారతదేశానికి మరో విజయదశమి. స్త్రీ మూర్తి మరో మారు ఉగ్రరూపం చూసిన రోజు. మీరు మా మహిళల పుస్తెల తాళ్లు తెంచితే.. మేం మీ ఉగ్రవాదుల పుచ్చె పగలగొడతాం అంటూ అదే మహిళా శక్తి ద్వారా నిరూపించిన విధానికి తార్కాణం. అందుకే రక్షణ మంత్రి భారత్ మాతాకీ జై అన్నారు. మన సైన్యం న్యాయం జరిగిందంటూ సగర్వ ప్రటన చేసింది.
ఆ ఇద్దరు వీర నారీమణులెవరు? వారి విజయగాథలేంటి?
కంటికి కన్ను. పంటికి పన్ను.. కాదు మన సిద్ధాంతం. కానీ, వారికంటూ తగిన శాస్తి చేయకుంటే ఆగదు ఈ దురాగతం. అందుకే.. వారు చూపిన దారిలో వారినే మట్టు పెట్టడం. ఇదీ ఆపరేషన్ సిందూర్ మెయిన్ టార్గెట్. మన దేశపు మహిళలకు అత్యంత కీలకమైన సిందూరాన్ని తుదముట్టించడానికి వచ్చిన వారిని సైతం అదే సిందూరం ధరించే మహిళా మణుల చేత హతమార్చడం.. ఇదే సాధ్యం చేశారీ ఆపరేషన్లో. ఈ ఆపరేషన్ మొత్తానికి సారధ్యం వహించిన ఆ ఇద్దరు వీర నారీమణులెవరు? వారి విజయగాథలేంటి?
మా మహిళా మణులు చాలు మీకు బదులివ్వడానికి
ప్రపంచ నడిబొడ్డున చేరి బిచ్చమెత్తాల్సి వస్తుంది జాగ్రత్త!మమ్మల్ని నేరుగా ఢీ కొట్టే దమ్ము లేక.. చాటు నుంచి వచ్చి.. హిందూ, ముస్లిం మతస్తులను వేరు చేసి.. వారిలోనూ హిందూ పురుషులను మాత్రమే హతమార్చి.. తద్వారా మా ఇంటి ఆడపడుచుల ఆయువు పట్టు మీద కొట్టడానికి ఎంత ధైర్యం.. అలాంటి మీకు తగిన సమాధానం మా మహిళా మణులే చెబుతారన్న దానికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్.
ఇది ఝాన్సీరాణిని కన్న నేల..
ఇది ఝాన్సీ రాణిని కన్న నేల. ఎందరో వీర శివాజీలను తయారు చేసిన జిజియ వంటి నారీమణుల పురిటి గడ్డ. ఇందిరాగాంధీ వంటి మహిళా నేతలు ఏలిన భూమి. ఈ భూమి వీరనారీమణిత్వానికి పెట్టింది పేరు. ఇక్కడి మహిళలు.. ప్రత్యర్ధులెవరైనా సరే ఎదురు తిరగడం.. ఈ మట్టి పుట్టినప్పటి నుంచీ ఉంది. అదే చేసి చూపింది మన మహిళా శక్తి ఈ ఆపరేషన్ ద్వారా.
గరిట తిప్పిన చేత్తోనే గన్ను చేపట్టగలం
మా పిల్లల చేత బలపం దిద్దిన చేతులతోనే బాణం పట్టగలం. వంటింట గరిట తిప్పిన చేత్తోనే గన్ను చేపట్టగలం. దెబ్బకు దెబ్బ తీయగలం. ధీటుగ దాడులు చేసి చూపగలం. రొమ్ము విరిచి ఎంతటి శతృవైనా సరే.. ఎదురొడ్డి నిలవగలం.. వారిని అమాంతం కబళించగలం.. అన్న స్త్రీ తెగువకు తార్కాణం ఈ ఆపరేషన్ సిందూర్.
ఆనాడు శివుడు పార్వతమ్మకు దిద్దిన సిందూరమే స్ఫూర్తి
ఆనాడు శివుడు మా పార్వతమ్మ నుదుట దిద్దిన సిందూరమే మాకు స్ఫూర్తి.. యుద్ధానికి వెళ్లే వీరులకు మేము దిద్దే సిందూరాలే మా విశ్వ విఖ్యాతి.. అంటూ మన మహిళా మణులు.. పాకీయుల పీచమణిచి, వారి ఉగ్రవాద స్థావరాల దుమ్ము దులిపిన దృశ్యం ఆపరేషన్ సిందూర్. ఈ ఆపరేషన్ కి ఇద్దరు వీరనారీమణులు నేతృత్వం వహించగా.. వారు వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ ఒకరు కాగా.. కల్నల్ సోఫియా ఖురేషీ మరొకరు.
వింగ్ కమాండర్ వ్యామికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ
ఎవరీ వ్యోమికా సింగ్ అని చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎంతో అనుభవమున్న చాపర్ పైలట్. NCC లో శిక్షణ తీసుకుంటున్నపుడే.. భారత సైన్యంలో చేరాలని నిర్ణయించారు వ్యోమికా. ఇంజినీరింగ్ చదువుతూనే పర్మినెంట్ కమిషన్ ద్వారా 2019లోఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయినయ్యారు. సిందూర్ ఆపరేషన్ గురించి ఆమె చెబుతూ.. ఇది ఉగ్రవాద శిబిరాలపై జరుగుతున్న దాడి కావడం వల్ల తాము పాకిస్థాన్ సైనికులపై దాడి చేయడం లేదనీ.. ఒక వేళ పాకిస్థాన్ సైన్యమే కనుక తమకు అడ్డు తగిలి ఉంటే, వారి పని కూడా పట్టి ఉండేవారమని అన్నారామె. అందుకు తాము సదా సిద్ధమేనంటూ గర్జించారు వ్యోమిక.
కల్నల్ సోఫియా ఖురేషీ.. ఇండియన్ ఆర్మీలో మోస్ట్ సీనియర్
ఇక కల్నల్ సోఫియా ఖురేషీ విషయానికి వస్తే.. ఇండియన్ ఆర్మీలో మోస్ట్ సీనియర్. ఇండియన్ ఆర్మీలోని కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ వింగ్ కి నేతృత్వం వహిస్తున్నారు. ఇతర దేశాలతో కలిపి భారత సైన్యం చేసే మిలటరీ సామర్ధ్య పరీక్షల్లో నాయకత్వం వహించిన తొట్ట తొలి మహిళా అధికారి సోఫియా. సిందూర్ ఆపరేషన్ గురించి వివరిస్తూ.. పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్టులను అనుసరించి తాము 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించామనీ.. పాక్ సైన్యంపై ఎక్కడా దాడి చేయలేదని అన్నారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అంతం చేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అన్నారామె.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ముందుందు అసలు సినిమా..
ఎక్కడ ఏమి చేయకూడదో అదే చేసింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం. దానికి దీటుగా బదులిస్తోంది మన మహిళా శక్తి సామర్ధ్యం. పాతిక మంది మహిళలను బలహీన పరచాలని చూస్తే అనంతమైన భారతీయ నారీ శక్తి విరుచుకుపడుతుంది. ఉగ్రవాదం అన్న పదం పలకడానికే భయం కలిగేలాంటి వాతావరణం కల్పిస్తుంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ముందుందు అసలు సినిమా.
ప్రపంచ నడిబొడ్డున చేరి బిచ్చమెత్తాల్సి వస్తుంది జాగ్రత్త!
ఆమె దయతలచడం వల్ల మాత్రమే మీరీ మాత్రమైనా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆమె మీ ఉగ్రవాదంపై కన్నెర్ర చేస్తే.. మీరు మీ స్థావరాలు, మీ వెన్ను దన్నుగా ఉన్న మీ ఆర్మీ ప్రభుత్వం.. మొత్తం ప్రపంచ నడిబొడ్డున చేరి బిచ్చమెత్తుకోవల్సి వస్తుంది ఖబడ్దార్ అన్నది ఈ ఆపరేషన్ సిందూర్ ద్వారా మన మహిళా శక్తి వినిపిస్తోన్న వార్ సైరన్.