Supreme Court Notice to Election Commission: ఒక నిర్దిష్ట నియోజక వర్గంలో నోటా(NOTA)కు అత్యధికంగా ఓట్లు పోలైతే వాటిని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 26(శుక్రవారం)న సుప్రీంకోర్టు భారత ఎన్నికల కమిషన్ (EC)కు నోటీసు జారీ చేసింది.
రచయిత, ప్రేరణాత్మక వక్త శివ్ ఖేరా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్), నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని పేర్కొంటూ నిబంధనలను రూపొందించాలని కోరింది. నోటా “కల్పిత అభ్యర్థి”గా సరైన, సమర్థవంతమైన ప్రచారాన్ని నిర్ధారించడానికి నిబంధనలను రూపొందించాలని పిల్ కోరింది.
ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ, సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎటువంటి ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థి విజేతగా ప్రకటించిన సందర్భాన్ని ఉదహరించారు. సూరత్‌లో వేరే అభ్యర్థి లేనందున.. అందరూ ఒకే అభ్యర్థి కోసం వెళ్ళవలసి వచ్చిందని పిటిషనర్ అన్నారు. ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ, ఓటరుకు నోటా ఆప్షన్ ఉంది కాబట్టి ఎన్నికలు జరగాలని పిటిషనర్ అన్నారు.
“ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో నోటా ఎంపిక అనేది మన ఎన్నికల వ్యవస్థలో ఓటరుకు ఉన్న తిరస్కరించే హక్కు. ప్రస్తుత కాలంలో పౌరులు తిరస్కరించే హక్కుగా నోటాను పరిగణిస్తారు” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోటా ఆలోచన, ఉద్దేశమని పిటిషనర్ పేర్కొన్నారు. ఒక నియోజకవర్గంలో దాదాపు అన్ని అభ్యర్థుల క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సందర్భాలు చూస్తూనే ఉన్నామని.. అప్పుడు ఓటరు చేతిలో నోటా ఒక శక్తివంతమైన ఆయుధమని పిటిషన్‌లో తెలిపారు.
Also Read: వీవీప్యాట్, ఈవీఎంల క్రాస్ వెరిఫికేషన్ పిటిషన్ కొట్టివేత..
ఎన్నికల సంఘం నోటాను చెల్లుబాటయ్యే అభ్యర్థిగా పరిగణించడంలో విఫలమైందని.. ప్రజాస్వామ్య పాలనలో నోటా చాలా అవసరమని.. వాస్తవానికి నోటా చెల్లుబాటయ్యే ఎంపిక అని ఖేరా దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిల్‌పై నోటీసు జారీ చేస్తూ, “ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినది కూడా. దీనిపై ఎన్నికల సంఘం ఏమి చెబుతుందో చూద్దాం” అని పేర్కొంది.