Rahul Gandhi: సుప్రీంకోర్టులో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది. ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
అలహాబాద్ హైకోర్టు తీర్పు..సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్
కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్, రాహుల్ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ చేసిన ఆరోపణల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే, తన వాదనను కనీసం వినకుండానే హైకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ధర్మాసనం ఆగ్రహం.. దర్యాప్తు సంస్థలపై ప్రశ్నలు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రతివాది తరఫున విచారణ విధానాన్ని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ప్రశ్నిస్తూ.. పిటిషనర్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అని, ఈ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. విచారణ సమయంలో సుప్రీంకోర్టు, రాహుల్ గాంధీ ఆస్తుల విషయంలో దర్యాప్తు సంస్థలు చూపుతున్న అతి ఉత్సాహంపై సీబీఐ న్యాయవాది ఎస్.వి. రాజును ప్రశ్నించింది. ఆరోపణల్లో తీవ్రత ఉంటే విచారణకు హైకోర్టు ఆదేశాలు ఎందుకు అవసరమయ్యాయని నిలదీసింది.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాహుల్ గాంధీ వాదన వినకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైకోర్టులో విచారణను నిలిపివేసింది. అంతేకాకుండా, అలహాబాద్ హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించవద్దని సీబీఐ, ఈడీలను ఆదేశిస్తూ.. కేసులోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Also Read: డీఎస్సీపై వైసీపీది జీరో నాలెడ్జ్.. ఆరోపణలపై క్లాస్ పీకిన నారా లోకేష్!