World’s Most Luxurious Sleeper Trains: రాత్రిపూట రైలు ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే కాదు. సౌకర్యవంతమైన బెర్త్ లో నిద్రపోతూ, ఉదయం కొత్త ప్రదేశంలో మేల్కొనే అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని దేశాల్లో స్లీపర్ రైళ్లను విలాసవంతమైన హోటల్ రేంజ్ లో తీర్చిదిద్దారు. అలాంటి వాటిలో టాప్ ట్రైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
లండన్ నుంచి స్కాట్లాండ్‌లోని ఇన్వర్‌నెస్ వరకు నడిచే కాలెడోనియన్ స్లీపర్ సుమారు 500 మైళ్ల దూరాన్ని 12 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. మార్గంలో లోచ్ లోమండ్, లోచ్ నెస్, రానోక్ మూర్ లాంటి అందమైన ప్రాంతాలు కనిపిస్తాయి. సాధారణ సీట్ల ధర సుమారు రూ.6,400 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రీమియం క్యాబిన్ ధర రూ.72,700 వరకు ఉంటుంది.
భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన రైలు ప్రయాణాల్లో మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణిస్తుంది. డీలక్స్ క్యాబిన్ ధర సుమారు రూ.3.8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రెసిడెన్షియల్ సూట్ కోసం ఒక్కో ప్రయాణికుడికి సుమారు రూ.25.7 లక్షల వరకు ఖర్చవుతుంది.
హెల్సింకి నుంచి రోవానియెమి వరకు నడిచే శాంటా క్లాజ్ ఎక్స్‌ప్రెస్ లాప్‌లాండ్ వెళ్లాలనుకునే వారికి ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. డబుల్ డెక్కర్ రైలులో సీట్లతో పాటు స్లీపర్ క్యాబిన్లు కూడా ఉంటాయి. వై ఫై, పవర్ సాకెట్లు, కొన్ని క్యాబిన్లలో ప్రత్యేక షవర్, టాయిలెట్ సౌకర్యాలు ఉన్నాయి. టికెట్లు సుమారు రూ.7,200 నుంచి ప్రారంభమవుతాయి.
పారిస్ నుంచి వెనిస్‌తో పాటు వియన్నా, ప్రేగ్ వంటి నగరాలకు కూడా ఈ ప్రసిద్ధ విలాసవంతమైన రైలు సేవలు అందిస్తుంది. 1920ల కాలం నాటి క్యారేజీలను ప్రత్యేకంగా తయారు చేశారు. గ్రాండ్ సూట్లలో ప్రైవేట్ బాత్రూమ్, అదనపు స్థలం, 24 గంటల బట్లర్ సర్వీస్ లాంటి సౌకర్యాలు ఉంటాయి. పారిస్–ఇస్తాంబుల్ ప్రత్యేక ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి సుమారు రూ.25.4 లక్షలు ఖర్చవుతుంది.
స్కాట్లాండ్ హైలాండ్స్ మధ్య ప్రయాణించే రాయల్ స్కాట్స్ మన్ పూర్తిగా విలాసవంతమైన అనుభూతిపై దృష్టి పెడుతుంది. ఇందులో 18 స్లీపర్ క్యాబిన్లు, రెండు డైనింగ్ కార్లు, స్పా లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలులో చిన్న ప్రయాణాల ధర ఒక్కో వ్యక్తికి సుమారు రూ.5.7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
పెరూలోని కుస్కో నుంచి టిటికాకా సరస్సు మీదుగా అరేక్విపా వరకు వెళ్లే బెల్మాండ్ ఆండియన్ ఎక్స్ ప్లోరర్ కూడా విలాసవంతమైన స్లీపర్ రైళ్లలో ఒకటి. క్యాబిన్లలో టాయిలెట్, షవర్ సౌకర్యాలు ఉంటాయి. రెండు డైనింగ్ కార్లలో స్థానిక ఫుడ్స్ తో పాటు ప్రత్యేక వంటకాలు అందిస్తారు. టికెట్లు సుమారు రూ.3.2 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
అడిలైడ్ నుంచి డార్విన్ వరకు నడిచే ది ఘాన్ ప్రపంచంలోని పొడవైన రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ రైలు ప్రయాణం నాలుగు పగళ్లు, మూడు రాత్రులు సాగుతుంది. ఒక్కో ప్రయాణికుడికి ధర సుమారు రూ.2.8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో ఆస్ట్రేలియా అవుట్ బ్యాక్ అందాలను చూడొచ్చు.
జపాన్‌లోని క్యుషు ద్వీపంలో నడిచే సెవెన్ స్టార్స్ రైలు హోటల్ తరహా సౌకర్యాలను అందిస్తుంది. విశాలమైన సూట్లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్, కాక్‌టెయిల్ బార్, లైవ్ పియానో లాంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. సాధారణ రైలు ప్రయాణానికి భిన్నంగా, ఇది పూర్తిస్థాయి విలాసవంతమైన అనుభవాన్ని అందించే రైలుగా పేరుపొందింది.
ప్రిటోరియా నుంచి కేప్ టౌన్ వరకు నడిచే బ్లూ ట్రైన్ కూడా లగ్జరీ రైలు ప్రయాణానికి ప్రసిద్ధి. డీలక్స్ సూట్లలో పూర్తి స్థాయి బాత్‌టబ్‌లు, భోజనం, పానీయాలు, బట్లర్ సర్వీసులు లాంటి సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణంలో సవన్నాలు, పర్వత ప్రాంతాల అందాలను ఆస్వాదించవచ్చు.
యూరప్‌లో తక్కువ ఖర్చుతో రాత్రి రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి నైట్‌జెట్, యూరోపియన్ స్లీపర్ మంచి ఆప్షన్స్. వియన్నా, ఆమ్‌స్టర్‌డామ్, బ్రస్సెల్స్, బెర్లిన్ వంటి నగరాలను ఇవి కలుపుతున్నాయి. నైట్ జెట్ లో కొన్ని సీటింగ్ టికెట్లు సుమారు రూ.3,800 నుంచి, కూచెట్, మినీ క్యాబిన్ టికెట్లు సుమారు రూ.7,000 నుంచి లభిస్తాయి. స్లీపర్ బెర్త్ ధర సుమారు రూ.11,400 నుంచి ప్రారంభమవుతుంది.
Read Also: రైల్లో వాష్ రూమ్ ఉపయోగిస్తున్నారా? ఈ 6 హైజీన్ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!