Bulldozer Justice| ప్రభుత్వ అధికారులకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే హక్కు లేదని సుప్రీం కోర్టు బుధవారం ఒక కీలక తీర్పులో తెలిపింది. విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా తేల్చేయడం.. ఒక వ్యక్తి నేరం చేస్తే.. అతడి కుటుంబాన్ని కూడా శిక్షించేందుకు చట్టం అంగీకరించదని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం మండిపడింది. సుప్రీం కోర్టులో మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బుల్డోజర్ జస్టిస్ పేరుతో ఇళ్లను కూల్చివేయడానికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత కోర్టులో అధిక సంఖ్యలో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారణ చేసిన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరిస్తూ.. కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది.
జస్టిస్ గవై, జస్టిస్ విశ్వనాథన్ ఈ పిటీషన్ల విచరాణ సమయంలో తీర్పు వెలువరిస్తూ.. చేసిన వ్యాఖ్యలు ఇవే..
– ఏదైనా నేరంలో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి నివాసాన్ని కూల్చివేసే హక్కు అధికార యంత్రాంగానికి లేదు. రాజ్యాంగంలోని సెపరేషన్ ఆఫ్ పవర్స్ కు ఇది విరుద్ధం. ఎవరైనా ప్రభుత్వ అధికారి సరైన అనుమతులు లేకుండా విచారణ ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి ఇంటిని కూల్చేస్తే.. అది నియమాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఒక నిందితుడిని దోషిగా తేల్చే హక్కు ఒక ప్రభుత్వ అధికారికి లేదు. ఆ నిందితుడిని శిక్షించేందుకు అతడు నివాసముంటున్న ఇంటిని కూల్చేసే అధికారం ఎవరికీ లేదు.
– ఇల్లు కలిగి ఉండడం ప్రతి వ్యక్తి మౌలిక అధికారాలలో ఒకటి. అందువల్ల సదరు వ్యక్తి ఏదైనా నేరంలో నిందితుడిగా ఉన్నా.. దోషిగా తేలినా.. అతడిని శిక్షించేందుకు చట్ట విచారణ పూర్తి కాకుండా కోర్టు అనుమతి లేకుండా అతడి ఇంటి కూల్చేయడానికి ప్రభుత్వ అధికారులకు ఎటువంటి హక్కు లేదు. ఒకవేళ ఇలా చేస్తే. ఇది క్రిమినల్ జస్టిస్ కి విరుద్ధం. నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి నేరం చేశాడని కోర్టు విచారణ ప్రక్రియ ప్రకారం జరగాల్సిందే. విచారణ నిష్పాక్షిక పూర్తికాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేం.
Also Read: సోషల్ మీడియాలో కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై నిషేధం.. కోర్టులో పార్న్ వీడియో ప్రసారం..
– ఒకే తరహా చేసిన నిరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులలో కొందరి ఇళ్లు మాత్రమే కూల్చివేయడం.. మరికొందరిపై చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలను కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి వచ్చింది. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ.. అధికారులు కేవలం కొందరిని శిక్షించడానికే ఇదంతా చేస్తున్నట్లు నమ్ముతున్నాం. అంతే తప్ప న్యాయం కోసం కాదు. ఒక ఇల్లు కూల్చి వేస్తే.. అందులో ఒక నిందితుడు మాత్రమే కాదు.. అతని కుటుంబ సభ్యులు కూడా నివసిస్తుంటారు. వారంతా ఏ పాపం ఎరుగని వారు. రాత్రికి రాత్రి ఇళ్లు కూల్చేస్తే.. మహిళలు, పిల్లలు నడిరోడ్డుపై ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ ఏదైనా నేరంలో నిందితుడు దోషిగా తేలినా అతడి ఇంటిని కూల్చేసే హక్కు ఎవ్వరికీ లేదు.
– ఒక వేళ ఇల్లు కూల్చడానికి అన్ని అనుమతులు ఉన్నా.. అందులో నివసించే వారికి 15 రోజులు లేదా స్థానిక చట్టాల ప్రకారం కనీస గడువు తప్పనిసరిగా ఇవ్వాలి. బుల్డోజర్ జస్టిస్ పేరుతో నిందితుల ఇల్లు కూల్చేయడం వెనుక ఉన్న రాజకీయ కారణాలను కోర్టు ఖండిస్తోంది. అధికారులు.. నియమాలను పాటిస్తూ.. చట్ట ప్రకారమే చర్యలు చేపట్టాలి. నిబంధనలకు అతిక్రమించి ఇళ్ల కూలిస్తే.. బాధితులకు నష్టపరిహారం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.