Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్ అంశంలో ఫారం 6పై ఎలాంటి తీర్పు ఇవ్వలేదని స్పష్టం చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపయోగిస్తున్న ఫారం-6 లోని మార్పులను అత్యున్నత న్యాయస్థానం ఆమోదించిందంటూ ఈసీ చేసిన ప్రకటనలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. దరఖాస్తులో ఈ మార్పులు ఎవరు చేశారో రికార్డులను పరిశీలించి తేలుస్తామని పేర్కొంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం సోమవారం బీహార్ ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫారం-6కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఎన్నికల సంఘం పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై చర్యలకు ఆదేశించాలని కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ.. కొత్త ఫారం 6పై ఎలాంటి న్యాయ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. బీహార్ ఎస్‌ఐఆర్ వ్యవహారంపై గతంలో విచారణ జరిపినప్పుడు కొత్త ఫారం-6 అంశం తమ ముందుకు రాలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే బీహార్ ఎస్‌ఐఆర్ అంశంలో మే నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఫారం 6ను ఎస్‌ఐఆర్ ధ్రువీకరణ ప్రక్రియకు మార్గదర్శకంగా పేర్కొంది. 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం రూపొందించిన ఫారం 6, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(2) కింద చేపట్టే ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియకు అనుగుణంగా ఉండాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న ఎన్నికల సంఘం ఓ ప్రకటనను విడుదల చేస్తూ బీహార్ ఎస్‌ఐఆర్ కు సంబంధించి 2026 మేలో ఇచ్చిన తీర్పులో ఫారం-6లోని ప్రకటనను సుప్రీంకోర్టు సమర్థించినట్లు పేర్కొంది.
Also Read: ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్!
దాంతో కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వ్యక్తులు గతంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాలతో తమకు ఉన్న సంబంధాన్ని వివరించే అదనపు డిక్లరేషన్ను సమర్పించాల్సి వచ్చింది. తాము, తమ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు గత ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాల్లో నమోదై ఉన్నారా? అన్న వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండా ఫారం 6 దరఖాస్తులను సమర్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పులపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read: సీఎం రేవంత్ వ్యూహానికి తట్టుకోలేకపోతున్నారా.. సిరిసిల్ల, సిద్దిపేటలో మారుతున్న పొలిటికల్ సీన్?