Japanese Anime Series OTT : చూడటానికి అమాయకపు విద్యార్థిలా కనిపించే ఓ కుర్రాడు… తనలో ప్రపంచాన్నే ఎదిరించగల శక్తి దాచుకున్నాడని తెలిస్తే ఎలా ఉంటుంది ? మాంత్రిక శక్తులు ఉన్నవాళ్లకే ఎక్కువ గుర్తింపు ఇచ్చే అకాడమీలో సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిగా అడుగు పెట్టిన అతడిని మొదట చాలామంది తక్కువగా అంచనా వేస్తారు. కానీ అతడి అసలు సామర్థ్యం బయట పడితే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. ఫాంటసీ, మాంత్రిక పోరాటాలు, స్నేహాలు, కొత్త ప్రమాదాలతో సాగే ఈ జపనీస్ యానిమే సిరీస్ పేరే ‘ది ఐస్‌బ్లేడ్ సోర్సరర్ షల్ రూల్ ద వరల్డ్’ (The Iceblade Sorcerer Shall Rule the World). తాజాగా ఈ సిరీస్ రెండో సీజన్ తో తిరిగి వచ్చింది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలోస్ట్రీమింగ్ అవుతోంది అంటే ?
రే వైట్ ఆర్నాల్డ్ అకాడమీ ఆఫ్ సోర్సరీలో చేరిన తొలి సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థి. అక్కడ చదివే చాలామంది విద్యార్థులు శక్తివంతమైన మాంత్రిక కుటుంబాల నుంచి వచ్చినవారే. అలాంటి చోట రేకు మొదట్లో తగిన గుర్తింపు దక్కదు. అతడి నేపథ్యాన్ని చూసి కొందరు చిన్నచూపు చూస్తారు. అయితే రే వెనుక ఉన్న అసలు రహస్యం వాళ్లకు తెలియదు. అతడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మాంత్రికుల్లో ఒకడు. ఐస్‌బ్లేడ్ సోర్సరర్ గా అతడికి ఉన్న సామర్థ్యం చాలా గొప్పది.
అకాడమీలో చదువు, స్నేహాలు, పోటీలు సాగుతున్నప్పటికీ రే జీవితం అంత సులభంగా ఉండదు. తన శక్తిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడంతో పాటు ఇతర విద్యార్థులతో కలిసి మెలిసి ఉండాలి. అమెలియా రోజ్, ఎలిసా గ్రిఫిత్స్, రెబెక్కా బ్రాడ్లీ వంటి సహవిద్యార్థులతో ఏర్పడే అనుబంధాలు అతడి ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మాంత్రిక శిక్షణతో పాటు యువతకు ఎదురయ్యే వ్యక్తిగత సమస్యలు కూడా అతడి జీవితంలో భాగమవుతాయి.
రెండో సీజన్ లో రే, అతడి స్నేహితుల ముందుకు మరిన్ని సవాళ్లు వస్తాయి. ప్రత్యర్థి పాఠశాలల మధ్య జరిగే మ్యాజిక్స్ వార్ పోటీలు కథలో కీలకంగా మారతాయి. అదే సమయంలో మరింత ప్రమాదకరమైన ముప్పు వారిని చుట్టుముడుతుంది. తన శక్తిని నిరూపించుకోవడమే కాకుండా, స్నేహితులను కాపాడుకోవడానికి రే ఏం చేస్తాడు ? కొత్త ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటాడు ? అతడి శక్తి ఎంత వరకు బయట పడుతుంది ? అనేవి ఈ సీజన్‌లో ఆసక్తి పెంచే అంశాలు.
ఈ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమైంది. ఇండియాలో Sony LIVలో అందుబాటులో ఉంది. కానీ తెలుగులో లేదు. ఫాంటసీ, మాంత్రిక పోరాటాలు, శక్తివంతమైన హీరోల కథలు ఇష్టపడేవారు ఈ యానిమేను డోంట్ మిస్.