Places of worship law Owaisi | దేశంలో ‘మసీదు కింద దేవాలయం’ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమలుపరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం కోర్టు గురువారం (జనవరి 2, 2025)న తెలిపింది. ఈ చట్టం ప్రకారం.. దేశంలోని అన్ని ప్రార్థనా స్థలాలను (దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు.. మొదలైనవి) ఆగస్టు 15, 1947న ఏ స్వరూపంలో ఉన్నాయో అదే స్వరూపంలోనే నిర్వహణ చేయాలి.
సుప్రీంకోర్టులో ఇప్పటికే 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమపరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటీషన్ ని కూడా మిగతా పిటీషన్లతో జోడించి ఫిబ్రవరి 17, 2025 విచారణ ప్రారంభిస్తామని తెలిపింది.
ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ లాయర్ అయిన నిజాం పాషా మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై పలు పిటీషన్లు ఉండడంతో కోర్టు తమ పిటీషన్ ని కూడా వాటితో కలిపే విచారణకు స్వీకరించిందని ఆయన చెప్పారు.
Also Read: బుర్కా ధరించకపోతే విడాకులు.. అలా కుదరదన్న హై కోర్టు
డిసెంబర్ 17, 2024న ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అడ్వకేట్ ఫుజెల్ అహ్మద్ అయ్యూబీ ద్వారా 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమలు కోసం సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.
అయితే సుప్రీం కోర్టు అంతకుముందే అంటే డిసెంబర్ 12, 2024న ఇదే తరహా పిటీషన్లను విచారణకు స్వీకరిస్తూ.. 1991 చట్టానికి వ్యతిరేకంగా లేదా మసీదులు, దర్గాల స్వరూపం మార్చాలని దాఖలైన ఎటువంటి కేసులు విచారణకు స్వీకరించవద్దు అని దేశంలోని అన్ని కోర్టులకు నిర్దేశించింది.
1991 ప్రార్థనా స్థలాల చట్టం అమలు కోసం సుప్రీ కోర్టులో మొత్తం ఆరు పిటీషన్లు దాఖలయ్యాయి. వీరిలో ఒకటి లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేవారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఒక స్పెషల్ ప్రొవిజన్స్ చట్టం. ఆగస్టు 15, 1947న దేశంలోని ప్రార్థనా స్థలాలు ఏ స్వరూపంలో ఉన్నాయో అవి అదే స్వరూపంలోనే ఉండాలని ఈ చట్టం చెబుతోంది.
అయితే గత కొన్ని నెలల్లో దేశంలోని కింది కోర్టులు, హై కోర్టులు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. మసీదు కింద హిందు కట్టడాల అవశేషాలున్నాయని.. వాటిని తిరిగి హిందువులకు అప్పగించాలని దాఖలైన పిటీషన్లలో విచారణ చేపట్టాయి. పైగా మసీదు లోపల పురావస్తు శాఖ సర్వే చేయాలని ఆదేశించాయి. ఇప్పటికే ఇలాంటివి 12 కేసులున్నాయి.
వారణాసి లోని గ్యాన్ వాపి మసీదు, ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ షాహీ మసీదు, అజ్మేర్ దర్గాల లోపల హిందూ కట్టడాలున్నట్లు పిటీషన్లు దాఖలయ్యాయి. వీటని కోర్టులు వివాదాస్పదంగా విచారణకు స్వీకరించాయి.