ముంబై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను ఎట్టకేలకు జాతీయ దర్యాప్తు సంస్థ తమ అధీనంలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ఫొటోను తాజాగా విడుదల చేశారు ఎన్ఐఏ అధికారులు. అయితే ఇందులో తహవూర్ మొహం చూపించలేదు. ఎన్ఐఏ సిబ్బంది మధ్యలో ఆయన ఉండగా వెనకనుంచి తీసిన ఫొటోను మాత్రమే మీడియాకు విడుదల చేశారు.
తీహార్ జైలుకి తరలింపు..
తహవూర్ రాణా ఈరోజు మధ్యాహ్నమే అమెరికానుంచి భారత్ కి ప్రత్యేక విమానంలో వచ్చారని అనుకున్నారంతా. అయితే సాయంత్రం రాణాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. అమెరికా వెళ్లిన ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సీనియర్ అధికారుల బృందం లాస్ ఏంజెల్స్ నుంచి ప్రత్యేక విమానంలో తహవూర్ రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. విమానం నుంచి బయటకు వచ్చిన తర్వాత భారత భూభాగంలో అడుగు పెట్టిన వెంటనే అతడిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ ప్రకటించింది. విమానాశ్రయంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత పటియాలా హౌస్ కోర్టులో హాజరు పరిచి తీహార్ జైలుకి తరలించబోతున్నారు.
ఎవరీ రాణా..?
పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా. 2008 నవంబర్ లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు ఇతను ప్రధాన సూత్రధారి. పాకిస్తాన్ కి చెందిన లష్కర్ ఎ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ముంబైలో ఈ దాడులకు పాల్పడ్డారు. ఆ దాడుల్లో 166మంది మరణించగా 239మంది గాయపడ్డారు. ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు రాణా సపోర్ట్ ఉందని తర్వాత విచారణలో తేలింది. అంతే కాదు, అప్పట్లో రాణా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడారు కూడా. ఉగ్రవాదుల్ని ప్రశంసిస్తూ.. భారత ప్రజలు ఈ దాడులకు అర్హులేనని మాట్లాడారు. దీంతో ఈ దాడుల వెనక అతని హస్తం ఉందని నిర్థారణ అయింది.
తహవూర్ రాణా భారత్ లోనే కాదు, పలు ఇతర దేశాల్లో కూడా ఉగ్రవాద చర్యలకు ఊతమిచ్చాడు. దీంతో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) 2009లో చికాగోలో రాణాను అరెస్టు చేసింది. డెన్మార్క్‌లో హత్యకు కుట్ర పన్నిన కేసులో అతని నేరం నిర్థారణ అయింది. అయితే తహవూర్ రాణాని భారత్ కి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం 2020లో కోరింది. పలు అభ్యర్థనల అనంతరం.. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు గతేడాది జనవరి 25న ఆమోదం తెలిపింది. అయితే తహవూర్ రాణా భారత్ కు రావడానికి నిరాకరించాడు, కోర్టుల్లో పలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ ఫలితం లేదు. చివరిగా అతడిని భారత్ కి తీసుకొచ్చారు.
భద్రత కట్టుదిట్టం..
మోస్ట్ వాంటెడ్ తహవూద్ రాణా భారత్ కి రావడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్ననే రాణాని తీహార్ జైలుకి తరలించారంటూ వార్తలు గుప్పుమన్నాయి. పలు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ రాత్రికి అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించి ఒక ఫొటో విడుదల చేసింది. ప్రస్తుతం అతడి వయసు 64 ఏళ్లు. ముంబై దాడుల వెనక సూత్రధారులు ఇంకెవరైనా ఉన్నారా, లేదా అనే కోణంలో ఎన్ఐఏ విచారణ చేపట్టబోతోంది. తీహార్ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉన్న బ్యారక్ లో తహవూర్ రాణాను ఉంచబోతున్నారు.