BigTV English

Bihar Voter List: బీహార్ ఓటర్ లిస్ట్ తగాదాలో టీడీపీ వైఖరి

Bihar Voter List: బీహార్ ఓటర్ లిస్ట్ తగాదాలో టీడీపీ వైఖరి

Bihar Voter List: బిహార్ శాసనసభ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు, భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల నమగ్ర సవరణ జాబితా ప్రక్రియ, జాతీయ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఈ ప్రక్రియ అవసరమని బీజేపీ గట్టిగా సమర్థిస్తుండగా, ఇది తమ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకున్న “వెనుకదారి – నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ – (ఎన్ఆర్‌సి) అమలు చేయడమే ” అని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సంక్లిష్ట రాజకీయ నేపథ్యంలో, ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన తెలుగు దేశం పార్టీ జోక్యం చేసుకోవడం, ఈ వివాదానికి కొత్త కోణాన్ని జోడించడమే కాకుండా, మోదీ 3.0 సంకీర్ణ ప్రభుత్వంలోని అంతర్గత సమీకరణాలను సూక్ష్మంగా చూపిస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (SCS) ఇవ్వలేదన్న కారణంతో 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు, 2024 ఎన్నికలకు ముందు తిరిగి కూటమిలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ బంధానికి కొత్త బలాన్నిచ్చాయి. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో, 16 మంది ఎంపీలున్న టీడీపీ, ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకమైన మిత్రపక్షంగా అవతరించింది. బిహార్ ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వివాదం జాతీయ విధానాలపై తెలుగుదేశం ముద్ర పడటానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది.

బీజేపీ సమర్థిస్తున్న బీహార్ ఓటర్ల జాబితా సవరణ పై , మిత్రపక్షమైన టీడీపీ పార్టీ ఆశ్చర్యకరంగా భిన్నమైన వైఖరిని ప్రదర్శించింది. లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలోని ప్రతినిధి బృందం, ఎన్నికల సంఘాన్ని కలిసి, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళనలను అధికారికంగా తెలియజేశారు. వారి అభ్యంతరాలు ప్రతిపక్షాల వాదనలకు దగ్గరగా ఉండటం గమనార్హం. టీడీపీ ప్రధానంగా నాలుగు కీలక అంశాలను లేవనెత్తింది. ఎస్ఐఆర్ ఉద్దేశ్యం కేవలం ఓటర్ల జాబితా సవరణకే పరిమితం కావాలని, దీనికి పౌరసత్వ నిర్ధారణతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన ప్రకటన చేయాలని టీడీపీ ప్రతినిధులు కోరారు.


ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు ఇలాంటి పెద్ద ప్రక్రియలను చేపట్టరాదని, బిహార్ ఎన్నికల ముందు దీనిని నిర్వహించడం సమస్యాత్మకం కాగలదని వివరించారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్నవారిని తిరిగి తమ అర్హతను నిరూపించుకోమనడం సరికాదని, వారి పేరును తొలగించాలనుకుంటే, ఆ రుజువు భారం ఎన్నికల అధికారిపైనే ఉండాలని సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ వివరించారు. సరైన కారణాలు, నోటీసులు లేకుండా ఓటర్ల పేర్లను తొలగించకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఎస్ఐఆర్‌పై తెలుగుదేశం పార్టీ వైఖరి కేవలం బిహార్ రాష్ట్రానికే పరిమితమైనది కాదు. ఇది ఒక లోతైన రాజకీయ వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ 3.0లో తాము కేవలం సంఖ్యాబలానికి పరిమితం కాదని, విధానపరమైన నిర్ణయాల్లో తమకు స్వతంత్ర వైఖరి ఉందని చాటిచెప్పడానికి టీడీపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశంపై ఒక నిర్మాణాత్మకమైన, సూత్రప్రాయమైన వైఖరి తీసుకోవడం ద్వారా, టిడిపి తన స్వతంత్ర వైఖరిని బీజేపీకి గుర్తుచేస్తోంది.

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి, బీజేపీకి కూడా ఒక రాజకీయ వెసులుబాటును కల్పించింది. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గినట్లు కాకుండా, ఒక మిత్రపక్షం యొక్క “హేతుబద్ధమైన సూచనలను” మన్నించినట్లుగా ఈ ప్రక్రియలో మార్పులు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. బీజేపీ బహిరంగంగా ఓటర్ల జాబితా సవరణను సమర్థించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల నుండి, చివరికి సొంత మద్దతుదారుల నుండి కూడా వ్యతిరేకత వస్తోందని అంతర్గత సర్వేలు సూచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ జోక్యం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

తెలుగులో తమ్ముడు “తమ్ముడే – పేకాట పేకాటే” అని ఒక సామెత వుంది. వ్యవహారాలకు అనుబంధాలు అడ్డు పడకూడదన్న నిర్మొహమాట తత్వాన్ని సూచించటానికి ఈ సామెతను చెప్తూ వుంటారు. బిహార్ ఓటర్ల సవరణ వివాదంలో చంద్రబాబు ఈతత్వాన్నే మృదువుగా చూపించి తెలుగుదేశం పార్టీ సూత్రబద్ధతను ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఓర్పు, సహనం, సంయమనం సంకీర్ణ రాజకీయాలకు ప్రాణసమానం. సూత్రబద్ధత, చురుకుతనం, సమయజ్ఞత ఆత్మతో సమానమని, ఇవన్నీ కలిసి ప్రజాస్వామిక విలువల్ని పెంచుతాయని బిహార్ ఓటర్ల జాబితా వివాదంలో తెలుగుదేశం వైఖరి చెప్తోంది.

Also Read: అంతుపట్టని రాజగోపాల్ స్ట్రాటజీ.. ఏడాదిన్నర అయినా దక్కని మంత్రి పదవి

ఈ వైఖరి, భారతదేశ సంకీర్ణ రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ప్రాంతీయ పార్టీలు కేవలం తమ రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం కాకుండా, జాతీయ విధానాలను ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతున్నాయనడానికి ఇది ఒక సంకేతం. ఇది ఎన్డీఏ 3.0 ప్రభుత్వంలో బీజేపీకి ఒక హెచ్చరిక అదే సమయంలో, సంప్రదింపుల ద్వారా పాలన సాగించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే ఒక కీలకమైన మలుపు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×