Thalapathy Vijay Nirmala Sitharaman| ప్రముఖ సంఘసంస్కర్త పెరియార్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు మరియు విజయ్ తీవ్రంగా ఖండించారు. ఏళ్లు గడిచినా ఆయన పేరు వాడకుండా ఉండలేని విధంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని విజయ్ ప్రతిస్పందించారు.
తమిళ భాషను అవమానించిన వ్యక్తికి పూలమాలలు వేస్తున్నారని పరోక్షంగా పెరియార్‌ను ప్రస్తావిస్తూ రాజ్యసభలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన విజయ్, సమాజంలోని సాంఘిక దురాచారాలను పారదోలడానికి పెరియార్ చేసిన కృషిని కొనియాడారు. ‘‘బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. కులం పేరిట జరిగిన అకృత్యాలను ఖండించారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోవచ్చు. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు ఉండాలని మనం ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలను ఆయన వంద సంవత్సరాల క్రితమే ప్రచారం చేసి, ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పెరియార్ తమిళ భాషను అవమానించారని కేంద్ర మంత్రి నిజంగానే బాధపడ్డారా..? మీరు (ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్) నిజంగా బాధపడి ఉంటే.. కొత్త విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని మాపై రుద్దడం ఆపేస్తారా..? పెరియార్ గురించి ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే.. అవి వివాదాస్పదం అవుతాయి. తమిళనాడు ప్రజల మనసులో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను తమిళలు ఎంతలా గౌరవిస్తున్నారో అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు’’ అని విజయ్ అన్నారు.
Also Read: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు హిందువులను దోచుకుంటున్నాయి.. దిగ్విజయ్ సింగ్ మండిపాటు
జాతీయ విద్యా విధానంలోని (ఎన్‌ఈపీ-2020) త్రిభాషా సూత్రంపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కొత్త విధానంలో భాగంగా మూడు భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో రెండు భారతీయ భాషలుండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం ఈ సూత్రాన్ని తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ నేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తిప్పికొట్టారు. విద్యార్థుల చదువుకునే హక్కును హరించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విద్యా విధానాల అమలు విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
ఎన్‌ఈపీ-2020లోని కీలక అంశాలను, ముఖ్యంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద అందించాల్సిన రూ.573 కోట్లను నిలిపేసింది. ఎన్‌ఈపీ మార్గదర్శకాలు అమలు చేస్తేనే కేంద్రం తన వాటా నిధులు అందిస్తుందని విధాన నిబంధనలు చెబుతున్నాయి. ఇలా కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం సాగుతున్న సమయంలో, నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలను తెచ్చిపెట్టాయి.
నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే…
జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా నిబంధనపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ సందర్భంగా, డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. తమిళ భాషను అవమానించిన వ్యక్తిని (పెరియార్‌ను ఉద్దేశించి) దేవుడిగా చూసే విధానం సరికాదని, ఆయన్ని గౌరవించడం డీఎంకే పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆమె అన్నారు. తమిళ భాషను తక్కువ చేసిన ఓ వ్యక్తిని (పెరియార్‌ను ఉద్దేశించి) తమ నాయకుడిగా కొందరు కొనియాడడం సరైంది కాదని ఆర్థిక మంత్రి సీతారామన్ అభిప్రాయపడ్డారు.