
Aditya-L1 Mission : సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమవుతోంది. లాంచింగ్ రిహార్సల్స్ పూర్తయ్యాయి. రాకెట్ లోని అంతర్గత చెక్కింగ్స్ కూడా పూర్తి చేశామని ఇస్రో తాజాగా ప్రకటించింది. లాంచింగ్ ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపింది.
ఆదిత్య ఎల్-1ను ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోట నుంచి ఇస్రో చేపడుతుంది. PSLV-C57 రాకెట్ నింగిలోకి దూసుకెళుతుంది. సూర్యుడి అధ్యయనం కోసం ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని పరిశోధించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, పలు దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. ప్రయోగాన్ని వీక్షించేందుకు సామాన్యులకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఆగస్టు 29న మధ్యాహ్నం 12 గంటలకు ఇస్రో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.
ఆదిత్య ఎల్-1 లో శాటిలైట్ బరువు 1500 కిలోలు ఉంటుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలో ఆదిత్య ఎల్-1ను ప్రవేశపెడతారు. దీంతో గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది.
ఆదిత్య-ఎల్ 1లో ఏడు పేలోడ్లను అమర్చారు. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ , సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్‌లు అందులో ఉన్నాయి.
సూర్యుడి నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేలా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి పొరలు ఫొటోస్పియర్, క్రోమో స్పియర్ వెలుపల ఉండే కరోనాపై శోధన చేస్తాయి. ఆదిత్య ఎల్-1లోని 4 పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా 3 పరికరాలు సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలను శోధిస్తాయి.