Republic Day : ఏటా జనవరి 26న జరిగే మన గణతంత్ర దినోత్సవానికి ఓ దేశాధినేత అతిథిగా రావడం ఆనవాయితీ. అమెరికా అధ్యక్షుడి హోదాలో బరాక్ ఒబామా(అమెరికా) మొదలు నెల్సన్ మండేలా(దక్షిణాఫ్రికా), పుతిన్(రష్యా), షింజో అబే(జపాన్) వంటి హేమాహేమీలెందరో ఈ వేడుకలకు అతిథులుగా గతంలో హాజరయ్యారు. తీవ్ర ఉద్రిక్తలున్న వేళ కూడా మన దాయాది పాకిస్థాన్ నుంచి, పొరుగునున్న చైనా నుంచి కూడా ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరైన చరిత్ర ఉంది.
2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అతిథిగా హాజరుకానున్నారు. కాగా.. ఫ్రాన్స్ నుంచి జాక్వెస్ షిరాక్ 1976లో ఫ్రాన్స్ ప్రధానిగా, 1998లో ఆ దేశ అధ్యక్షుడి హోదాలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇక.. 1950లో జరిగిన తొలి రిపబ్లిక్ వేడుకలకు నాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో హాజరయ్యారు. ఈయన, నెహ్రూ కలిసి అలీనోద్యమ సంస్థ ‘నామ్’ను స్థాపించారు. నాటి గణతంత్ర వేడుకలు దిల్లీలోని ఇర్విన్ స్టేడియంలో జరిగాయి.
1955 నాటి రిపబ్లిక్ పెరేడ్‌కు పాక్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన విందులో పాల్గొన్న గులాం మహమ్మద్.. ఇరు దేశాలు కలిసి, తమ సమస్యలను పరిష్కరించుకోగలవని ఆకాంక్షించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ మిలిటరీ లీడర్ యె జియాన్‌యింగ్ 1958 జనవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ ఏడాది రిపబ్లిక్ వేడుకలకు అతిథిగా ఆయన హాజరయ్యారు. చైనా తరపున ఈ వేడుకలకు హాజరైన ఏకైక వ్యక్తి ఆయనే.
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ ఇద్దరు వేర్వేరుగా మన రిపబ్లిక్ పెరేడ్‌లో అతిథులుగా పాల్గొన్నారు. 1959లో ప్రిన్స్ ఫిలిప్ పాల్గొనగా.. 1961లో క్వీన్ ఎలిజబెత్‌కు ఆతిథ్యం ఇచ్చాం. వేర్వేరుగా రిపబ్లిక్ డే ఆతిథ్యం స్వీకరించిన జంట వీరే.
1965లో గుజరాత్‌లోని కచ్ వద్ద భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఆ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్‌కు పాకిస్థాన్ ఆహారశాఖ మంత్రి రాణా అబ్దుల్ హమీద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. పెరేడ్ జరిగిన కొన్ని నెలలకే పాక్‌తో యుద్ధం వచ్చింది.
భూటాన్ పాలకులు జిగ్మే డోర్జి వాంగ్‌చుక్(1954), జిగ్మే సింగే వాంగ్‌చుక్ (1984, 2005), జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్‌చుక్ (2013)లో గణతంత్ర దినోత్సవ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన తండ్రి, కుమారుడు, మనమడు వీరే.
అయితే..1966 జనవరి 11న ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో ఆ ఏడాది రిపబ్లిక్ పెరేడ్‌ను నిర్వహించలేదు. అలాగే.. కొవిడ్ కారణంగా 2021, 2022 విదేశీ అతిథిని ఆహ్వానించలేదు.
1956, 1968, 1974 నాటి రిపబ్లిక్ పెరేడ్‌లకు ఇద్దరేసి అతిథులను ఆహ్వానించగా, 2018 రిపబ్లిక్ డే పెరేడ్‌కు ముఖ్య అతిథులుగా 10 దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. కంబోడియా, మలేసియా, సింగపూర్, వియత్నాం,లావోస్, థాయ్‌లాండ్ ప్రధానులు, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ అధ్యక్షులు, మయన్మార్ నుంచి ఆంగ్ సాంగ్ సూచీ, బ్రూనై సుల్తాన్ ఈ వేడుకలకు హాజరయ్యారు.