Modi Manipur Tour: మణిపూర్ లో మారణహోమం జరిగిన 29 నెలలు, 870 రోజుల మౌనం తర్వాత ప్రధాని మోడీ అక్కడ పర్యటిస్తుండడం కీలకంగా మారుతోంది. సెప్టెంబర్ 13న పర్యటిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. జాతుల మధ్య వైరంలో 260 మందికి పైగా చనిపోయారు. 60 వేల మంది వలస వెళ్లారు. చాలా దారుణాలు జరిగాయి. మరి మోడీ పర్యటన ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతోంది.
మణిపూర్‌లో ప్రధాని మోడీ పర్యటన
కీ, పెన్ను, వాటర్ బాటిల్, బ్యాగ్, హ్యాండ్ ఖర్చీఫ్, గొడుగు, లైటర్, అగ్గిపెట్టె, గుడ్డ ముక్క, షార్ప్ ఆబ్జెక్ట్.. ఇవన్నీ బ్యాన్. అదేంటి.. చేతి ఖర్చీఫ్ కూడా ఉండొద్దా? ఎక్కడ ఈ బ్యాన్ అనుకుంటున్నారా.. మణిపూర్ లో. అవును మీరు విన్నది నిజమే. 2023లో మణిపూర్ అల్లర్ల తర్వాత ఇన్నాళ్లకు వెళ్తున్న ప్రధాని మోడీ సభకు వెళ్లే వారికి ఈ బ్యాన్ వర్తిస్తుంది. భద్రతా చర్యలు అలా ఉన్నాయ్ మరి. ఎందుకంటే మణిపూర్ కుకీలు, మొయిటీల జాతుల మధ్య వైరంతో యుద్ధభూమిగా మారిన రోజులున్నాయ్. ఇప్పుడు ప్రధాని వెళ్తుండడంతో భద్రతా చర్యలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
కుకీలు, మొయిటీలను సంతృప్తి పరిచేలా చర్యలు
ప్రధాని మోడీ మణిపూర్ పర్యటనలో అటు కుకీలు.. ఇటు మొయిటీలు ఇద్దరినీ సంతృప్తి పరిచేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఎలా అంటే.. కుకీలు ఎక్కువగా ఉంటే చుర్ చాంద్ పూర్ లో పర్యటన, బహిరంగ సభ ఉంది. అలాగే మొయిటీలు ఎక్కువగా ఉండే ఇంఫాల్ లోని కంగ్లా ఫోర్ట్ లో శంకుస్థాపనలు, బహిరంగ సభ పెట్టారు. సో రెండు వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నాం.. అందరి అభివృద్దే ముఖ్యం అన్న సందేశాన్ని ఇచ్చేలా టూర్ ను సెట్ చేశారు. 1,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అలాగే 7,300 కోట్ల విలువైన మరిన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
చుర్ చాంద్ పూర్ జిల్లాలో ఎయిర్‌గన్‌లపై బ్యాన్
ఎన్ బిరేన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా తర్వాత ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. చుర్ చాంద్ పూర్ పీఎస్ గ్రౌండ్ లో జరిగే సభకు హాజరయ్యే ప్రజలు కీ, పెన్ను, వాటర్ బాటిల్, బ్యాగ్, ఖర్చీఫ్, గొడుగు, లైటర్, అగ్గిపెట్టె, గుడ్డ ముక్క, పదునైన వస్తువులు తీసుకురావొద్దని ఆదేశాలు వెళ్లాయి. ప్రధానమంత్రి పేరు ప్రస్తావించకుండానే మరో నోటిఫికేషన్‌లో 12 ఏళ్లలోపు పిల్లలను, అనారోగ్య వ్యక్తులను వేదిక వద్దకు తీసుకురావద్దని సూచించారు. మోడీ పర్యటనతో చుర్ చాంద్‌పూర్ జిల్లాలో ఎయిర్ గన్‌లను నిషేధించారు. ఇంఫాల్‌లోని 237 ఎకరాల కాంగ్లా ఫోర్ట్, అలాగే చుర్ చాంద్ పూర్ పీస్ గ్రౌండ్ చుట్టూ కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించారు. బారికేడ్లు పెట్టారు.
శాంతిస్థాపనకు మార్గం ఏర్పడుతుందన్న ఆశ
ప్రధాని పర్యటనను కుకీ, మొయిటీ గ్రూపులు స్వాగతిస్తున్నాయి. తమకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాయి. మణిపూర్‌కు హింసాత్మక ఘర్షణల చరిత్ర ఉందని, ఇలాంటి సమయంలో ప్రధాని వచ్చి పీస్ మెసేజ్ ఇస్తారన్న ఆశాభావంతో మరికొందరు ఉన్నారు. ఒక భవిష్యత్ కు మార్గం ఏర్పడుతుందన్న భావనతో కుకీ మొయిటీలున్నారు. ప్రధానిని స్వాగతించే కార్యక్రమంలో స్థానిక సంప్రదాయ నృత్యాలు వద్దని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. శాంతి ప్రక్రియకు కేంద్రం సిద్ధంగా ఉందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. SoO ఒప్పందం పునరుద్ధరణ, NH-02పై ఫ్రీ మూవ్‌మెంట్ ఇచ్చారు. ప్రధాని ప్రారంభించబోయే ఈ ప్రాజెక్టులు ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచుతాయంటున్నారు.
అల్లర్ల బాధితులతో మాట్లాడనున్న మోడీ
ప్రధాని మొదట చుర్ చాంద్ పూర్ వెళ్తారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని, ఇంఫాల్ వస్తారు. అల్లర్లలో బాధితులై వలస వెళ్లిన వారితో మాట్లాడుతారు. వారి సమస్యలను వింటారంటున్నారు. మణిపూర్ ను భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్ర బిందువుగా, ఆగ్నేయాసియాకు గేట్‌వేగా చూస్తోంది. ప్రధాని మోడీ పర్యటనతో రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు, వేగవంతమైన అభివృద్ధికి రూట్ క్లియర్ చేస్తుందని ఆశిస్తున్నారు. పరస్పర విశ్వాసం పెరగడం, దాటి అభివృద్ధి దిశగా అడుగులు పడాలని కోరుకుంటున్నారు. 2023 మే నుంచి కుకీ, మెయిటీ జాతుల ఘర్షణ తర్వాత ప్రధాని మోడీ మణిపూర్ వెళ్లకపోవడంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేశాయి. ఇన్నాళ్లకు వెళ్తుండడం 2026 ఎలక్షన్‌కు ముందు BJP ఇమేజ్ బూస్టప్ కోసమే అంటున్నాయి. మరి మోడీ పర్యటనతో ఏం జరగబోతోంది?
ఇన్నాళ్లు మణిపూర్ ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్న
రైట్ ఇదీ ప్రధాని మోడీ మణిపూర్ లో అల్లర్ల తర్వాత రెండేళ్ల క్రితం మాట్లాడిన మాట. పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు గానీ.. మణిపూర్ వెళ్లే సాహసం చేయలేకపోయారన్న వెర్షన్ ను విపక్షాలు వినిపిస్తూ వచ్చాయి. ఇన్నాళ్లకు ప్రధాని మోడీ పర్యటన సాధ్యమైంది. అయితే మణిపూర్ ప్రజలు 29 నెలలు ఎదురుచూశారని, 3 గంటల పర్యటనతో ఏమి సాధిస్తారని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తోంది. మణిపూర్ కు ఇది అవమానమని, పొలిటికల్ స్టంట్ గా చెబుతున్నారు. మణిపూర్ లో అల్లర్లు జరిగిన తర్వాత రాహుల్ గాంధీ 2023 జూన్, 2024 జూలై, అదే ఏడాది నవంబర్ లో పర్యటించి వచ్చారు. వారికి ధైర్యం చెప్పారు. ఇప్పుడు ప్రధాని వెళ్తుండడంతో 29 నెలల మౌనం తర్వాత ఇప్పుడు వచ్చి ఏమి సాధిస్తారన్న పాయింట్ ను వినిపిస్తున్నారు. 2024 నవంబర్ లో మళ్లీ హింస చెలరేగినప్పుడైనా మోడీ వచ్చి ఉండాల్సిందని, కానీ అలా జరగలేదన్నారు. మణిపూర్‌లో మోడీ మదర్ ఇండియాను కిల్ చేశారని గతంలో పార్లమెంట్ లో రాహుల్ ఫైర్ అయ్యారు. ఎన్నో విదేశీ టూర్లకు వెళ్లిన మోడీ.. మణిపూర్ కు వెళ్లకపోవడంపై ఖర్గే కూడా గతంలో రియాక్ట్ అయ్యారు.
Also Read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. దూసుకెళ్లిన ట్రక్కు.. స్పాట్‌లోనే 29 మంది
రాష్ట్రపతి పాలన తర్వాత తగ్గిన హింస
2024 జులైలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యాక పార్లమెంట్‌లో జస్టిస్ ఫర్ మణిపూర్ స్లోగన్‌లు ఇచ్చారు. మోడీ కూడా వెళ్లాలన్నారు. సో ప్రస్తుతానికైతే మోడీ పర్యటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన తర్వాత హింస తగ్గింది. దీంతో పర్యటనకు మార్గం సుగమం అవడంతో వెళ్తున్నారంటున్నారు. ఇప్పుడు మోడీ టూర్ పీస్ ఇనిషియేటివ్ అలాగే డెవలప్ మెంట్ డ్రైవ్ గా బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ పర్యటన తర్వాత మణిపూర్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం కూడా జోరందుకుంటోంది. మొత్తంగా సామాన్య ప్రజలు, రిలీఫ్ క్యాంపుల్లో ఉండే వారు, పట్టణాల్లో నివసించే వారు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారంటున్నారు. మరి ఆ దిశగా ప్రధాని మోడీ పర్యటన ఎలాంటి పునాది వేస్తుందన్నది చూడాలి.
Story By Vidya Sagar, Bigtv