Chandrababu Naidu: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నిలవడానికి ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బిహార్ సీఎం నితీశ్ కుమార్ చెరో భుజం అందించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వీరిద్దరూ కింగ్ మేకర్ల అవతారమెత్తారు. ప్రతిపక్ష ఇండియా కూటమి వైపు మళ్లితే బంపర్ ఆఫర్‌లతో వారికి స్వాగతం లభించేదేమో! కానీ, వారు కూటమి ధర్మాన్ని మరవలేదు. బీజేపీతోనే కొనసాగారు. ఫలితంగా నరేంద్ర మోదీ మూడోసారి.. నరేంద్ర మోదీ అనే నేను అంటూ ప్రధానిగా ప్రమాణం చేయగలిగారు. అలాంటి వారిద్దరిని బీజేపీ ప్రభుత్వం తేలికగా చూసే ఛాన్సే లేదు. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్లు ఉన్నాయి. బిహార్ పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తింది కూడా. కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్‌ను యాక్సెప్ట్ చేయలేదు. కానీ, ఈ కింగ్ మేకర్లిద్దరినీ కేంద్ర బడ్జెట్‌లో వారి రాష్ట్రాలకు వరాలు ప్రసాదించి ప్రసన్నం చేసుకుంది.
బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రెండు రాష్ట్రాలకు వరాలు ప్రకటించారు. ఏపీ రాష్ట్ర ప్రధాన డిమాండ్లలలో ఒకటైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉంటామని, ఇందుకోసం నిధులు విడుదల చేస్తామని నిర్మల ప్రకటించారు. ఏపీ పునర్విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, ఇందులో ప్రకటించిన హామీల అమలుకు కృషి చేస్తామని వివరించారు. అలాగే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 15 వేల కోట్లు ఏపీకి విడుదల చేస్తామని తెలిపారు. దీంతో అమరావతికి మహర్దశ రానుందని తెలుస్తున్నది. మరిన్ని నిధులను వచ్చే సంవత్సరాల్లో కేటాయిస్తామని చెప్పారు. ఇతర ఏజెన్సీల ద్వారా ప్రత్యేక నిధులు అందించడానికి సహకరిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో ఇది కీలకమైన రోజు అని, రాష్ట్ర అభివృద్ధి మార్గంలో ముఖ్యమైన మలుపు అని వివరించారు.
Also Read: కొత్త ట్యాక్స్ విధానంతో బెనిఫిట్స్ ఎవరికి?
ఇక బిహార్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో పలు రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 26 వేల కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. అలాగే.. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులు, మెడికల్ కాలేజీలు, స్పోర్ట్స్ ఫెసిలిటీలు ఏర్పాటు చేసే ప్రణాళికలను పేర్కొన్నారు. అలాగే.. భగల్‌పూర్‌లో 2,400 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లు ఉన్నదని టీడీపీకే. టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలుచుకోగా.. జేడీయూ 12 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అయితే, కేంద్ర బడ్జెట్‌లో మాత్రం నిధులు ఏపీ కంటే బిహార్‌కే ఎక్కువ కేటాయించడం గమనార్హం. ఇతర మార్గాల్లో సహకారాలు అందిస్తామని చెప్పినప్పటికీ ఏపీకి రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించగా.. బిహార్‌కు రూ. 26 వేల కోట్లు కేటాయించింది.