ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీఎస్టీ వడ్డింపులు భారీగా పెంచిన ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పుడు ఆ వడ్డింపులను కాస్త తగ్గించడం మరింత ఆసక్తికర పరిణామం. అయితే ఈ తగ్గింపుల క్రెడిట్ ని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. సగటు భారతీయుడిపై ప్రేమతోనే ఈ తగ్గింపులు జరిగినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. అంతర్జాతీయ వాణిజ్యరంగంలో వస్తున్న ఒడిదొడుకుల్ని ఎదుర్కోడానికి, భారత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది బహిరంగ రహస్యం. ఇక జీఎస్టీ తగ్గింపుల తర్వాత ఆ విషయానికి ఎక్కడలేని ప్రచారం కల్పిస్తున్నారు ఎన్డీఏ నేతలు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడారు.
#Exclusive | Unless we engage sincerely, no matter how much you talk about the issues, it takes time to build a relationship with the Chinese. Market access has not been realised yet. India's fiscal map is fine: FM @nsitharaman#indiachinarelationship | @18RahulJoshi pic.twitter.com/1A9t5kP5D1
— News18 (@CNNnews18) September 5, 2025
కేంద్రానికీ భారమే..
జీఎస్టీ సంస్కరణల వల్ల వివిధ రాష్ట్రాలు తాము నష్టపోతున్నామని పేర్కొన్నాయి. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి సంస్కరణ వల్ల రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఆదాయంలో కొంత కోత ఉంటుందని చెప్పారు. అయితే తమ ప్రభుత్వానికి పౌరుల అవసరాలే ప్రథమ ప్రాధాన్యమని ఆమె చెప్పారు. ముందు పౌరుల ప్రాధామ్యాలు, ఆ తర్వాత ఆదాయం ఆదాయం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. అయితే జీఎస్టీ విషయంలో భారీ వడ్డింపులు కూడా తమ ప్రభుత్వ హయాంలోన జరిగాయన్ని విషయాన్ని మాత్రం ఆమె దాటవేశారు. ఇక అమెరికా టారిఫ్‌ల వల్ల ఎగుమతిదారులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై కూడా కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో ఎగుమతిదారులకు మరిన్ని వెసులుబాట్లను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది.
అది ఇప్పుడే కాదు..
పెట్రోల్, డీజిల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఆ ఒక్కటీ అడగొద్దని అంటున్నారు మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని ఆమె మరోసారి స్పష్టం చేశారు.
ఒకేపన్ను కుదరదు..
మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని చెప్పిన నిర్మలా సీతారామన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని చెప్పారు. ప్రతిపక్షాలు ఒకే దేశం ఒకే పన్నుకోసం చేస్తున్న డిమాండ్లను ఆమె తోసిపుచ్చారు. వన్ నేషన్- వన్ ట్యాక్స్ మంచి ఆలోచనే కానీ, ఇప్పటికిప్పుడు అది ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. అభివృద్ధిలో వైవిధ్యాలు ఉన్నప్పుడు వన్ ట్యాక్స్ విషయం సరికాదని తెలిపారామె. మెర్సిడెస్ బెంజ్ కారుకి, హవాయి చెప్పులకు ఒకే పన్ను రేటు విధించగలమా? అని ప్రశ్నించారు. ఇలాంటి పన్నువిధంపులకు మన దేశ ఆర్థిక వ్యవస్థ సరిపోదని తెలిపారు.
ప్రతిపక్షాలపై విసుర్లు..
అభివృద్ధి చెందిన రంగాలు అధిక పన్నులను కట్టగలుగుతాయని, అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న, చెందని రంగాలపై అదే తరహా పన్ను భారం అవుతుందని అన్నారామె. మన దేశం కూడా అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చెందినప్పుడు దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం సాధ్యమవుతుందని చెప్పారు. ఇక జీఎస్టీని ఒకప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ ఎగతాళి చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు సంస్కరణల తర్వాత దాన్ని తమ గొప్పదనంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వాలు అత్యధికంగా ఆదాయపు పన్ను విధించాయని, సంస్కరణలు తీసుకొచ్చి ఆదాయపు పన్ను శ్లాబులను మార్చింది తామేనని చెప్పుకొచ్చారు మంత్రి నిర్మలా సీతారామన్.