Maha Kumbh Mela 2025 : సనాతన ధర్మం, గంగా నదీ, మహా కుంభమేళ పై నిరాధారమైన ఆరోపణలు చేయడం అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసాల్ని కించపరచడమే అని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ అసెంబ్లీలో మాట్లాడిన యూపీ సీఎం.. ఇష్టారాజ్యంగా మాట్లాడి హిందువుల మనోభావాల్ని గాయపరచవద్దని అన్నారు. త్రివేణీ సంఘమంలో నీటిలో కోట్ల మంది స్నానాల కారణంగా ప్రమాదకర కోలిఫాం బ్యాక్టీరియా ఎక్కువగా ఉందంటూ.. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికను యూపీ సీఎం తప్పుబట్టారు. అక్కడ నీరు స్నానం చేసేందుకే కాదు, తాగేందుకు సైతం అనుకూలంగా ఉందంటూ తెలిపారు. కుంభమేళను మృత్యు మేళ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యూనల్ ఓ నివేదికను సమర్పించిన నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్.. కోట్ల మంది భక్తుల స్నానాలతో మహాకుంభ్ జరుగుతున్న నదీలోని నీరు కలుషితం అయినట్లు తెలిపింది. వివిధ ప్రాంతాల్లో అధిక స్థాయిల్లో బ్యాక్టీరియా గుర్తించినట్లుగా వెల్లడించింది. దీంతో.. దేశంలోని అనేక మీడియా సంస్థలతో పాటు నాయకులు స్పందించారు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం.. సనాతన ధర్మం, గంగామాత, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. అలా చేస్తే 56 కోట్ల మంది భక్తి శ్రద్ధలతో, పూర్తి విశ్వాసంతో చేసిన నదీ స్నానాల్ని విమర్శించినట్లేనని అన్నారు.
12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభ మేళకు కోట్ల మంది భక్తులు వస్తున్నారు. తండోపతండాలుగా వస్తున్న భక్తుల్ని నియంత్రించేందుకు, అందరికీ నదీ స్నానాల్ని చేపించేందుకు యూపీ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. భూమి మీద జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి 45 కోట్ల మంది వస్తారని తొలుత అక్కడి అధికార యంత్రాంగం అంచనా వేసింది. కానీ.. అనూహ్యంగా.. ఇప్పటికే 57 కోట్లకు పైగా భక్తులు, హిందువులు నదీ స్నానాలు ఆచరించారు. మరో వారం రోజుల పాటు కుంభమేళ జరగనుండగా.. ఇంకా కోట్లల్లో భక్తులు నదీ స్నానానికి రానున్నారు.
దీంతో పాటు ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం చేసిన విమర్శలపైగా యూపీ సీఎం స్పందించారు. మహా కుంభమేళాలో కోట్ల మంది భక్తుల రాకతో.. అనుకోని విధంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. అలాగే.. దిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో మరో 18 మంది మరణించగా… మమతా బెనర్జీ కుంభమేళ కాదు మృత్యు మేళ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో.. దేశవ్యాప్తంగా.. హిందూ సంఘాలు, సంస్థల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. చాలా మంది.. మమతను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు సముచితమో ఆలోచించుకోవాలని హితవు పలికారు.
Also Read :Sambhaji Maharaj : శివాజీ మహారాజ్ కొడుకా మజాకానా – ఈ విషయాలు తెలిస్తే రోమాలు నిక్కపొడుస్తాయ్..
కోట్ల మంది విశ్వాసలతో ముడిపడి ఉన్న మహాకుంభ్ గురించి మొదటి నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడిన యూపీ సీఎం.. ఈ శతాబ్దంలో జరుగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అనేక రకాలుగా, అనేక మంది వ్యక్తులు చేసే తప్పుడు ప్రచారాలు పట్టించుకోకుండా ఈ ప్రపంచం, ఈ దేశం మహా కుంభలో పాల్గొంటోందని అన్నారు.