పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఒక రాజకీయ నాయకుడిని కోర్టు జిల్లానుంచి బహిష్కరించారు. అయితే అతడు చాటుమాటుగా ఆ జిల్లాకు వచ్చి తన తమ్ముడి ఇంట్లో ఉండి వెళ్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. అతడికోసం మాటు వేశారు. ఒకరోజు తమ్ముడి ఇంట్లోకి వెళ్లడం చూశారు. ఆ తర్వాత కొంత సేపరిటిపోలీసులు కూడా లోపలికి వెళ్లారు. కానీ అక్కడ సదరు నాయకుడు లేడు. అన్ని రూమ్ లు వెదికారు, కానీ ఫలితం లేదు. చివరకు బెడ్ రూమ్ లో పరుపుల చాటున దాక్కున్న అతడిని బయటకు లాక్కొచ్చి మరీ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ లో జరిగింది. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు కైష్ ఖాన్ ని పోలీసులు పరుపుల చాటున దాక్కుని ఉండగా, బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు.
Samajwadi party leader & Akhilesh’s close aide Kaish Khan arrested . He was hiding on his rooftop 😂
He was facing 5 cases & land-grab charges. pic.twitter.com/IsPSTWZmVb
— Sunny Raj (@SunnyRajBJP) September 4, 2025
యూపీలో యోగీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేస్తుందనే వాదన కూడా కొంతమంది వినిపిస్తుంటారు. తాజాగా యూపీలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. కైష్ ఖాన్ సమాజ్ వాదీ పార్టీలోకీలక నాయకుడు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కి సన్నిహితుడుగా పేరుంది. సమాజ్ వాదీ పార్టీకి గతంలో ట్రెజరర్ గా కూడా పనిచేశాడు కైష్ ఖాన్. అలాంటి కీలక నాయుకుడు ఇప్పుడు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ కావడం విశేషం. పరుపుల చాటున దాక్కున్న కైష్ ఖాన్ ని పోలీసులు బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సమాజ్ వాదీ పార్టీ నేతలు పోలీసుల చర్యలపై మండిపడుతున్నారు. తమ పార్టీ నేతలను అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేయడం అన్యాయం అంటున్నారు.
కైష్ ఖాన్ పై కన్నౌజ్ జిల్లాలో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గూండా చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 10 కింద కేసులు పెట్టారు పోలీసులు. ఈ ఏడాది జనవరి 6న మున్సిపాలిటీ ప్రాంతంలోని ఒక రహదారిని అక్రమంగా ఆక్రమించి దానిపై నిర్మాణాన్ని ప్రారంభించడంతో పోలీసులు మరో కేసు పెట్టారు. దాన్ని కూల్చేశారు. ఈ కేసుల నేపథ్యంలో కైష్ ఖాన్‌ను కన్నౌజ్ జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కన్నౌజ్ జిల్లాకు ఆరు నెలల పాటు దూరంగా ఉండాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. వెంటనే జిల్లా విడిచి వెళ్లాలని సూచించారు. ఆ తర్వాత కైష్ ఖాన్ కొన్నాళలు జిల్లాకు దూరంగా ఉన్నారు. తిరిగి ఇటీవల జిల్లాలో యాక్టివ్ గా ఉండటంతో పోలీసులకు సమాచారం అందింది. సోదరుడి ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు బయటకు వస్తూ, రహస్యంగా తన స్నేహితులను కలుస్తున్నట్టు పోలీసులకు తెలిసింది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ని కూడా ఆయన రహస్యంగా కలుస్తున్నాడని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిపై నిఘా పెట్టారు. ఇంటిలోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి చూడగా పరుపుల చాటున దాక్కున్న విషయం గుర్తించారు. పరుపుల వెనక నుంచి అతడిని బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు పోలీసులు.