
Uttarakhand Tunnel collapse : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో కూలిన నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సొరంగ మార్గంలో 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్‌గావ్ వరకు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. నిన్న రాత్రి టన్నెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారికి బయటకు వచ్చేందుకు మార్గం లేకుండా పోయింది.
ఘటనా స్థలంలో NDRF, SDRF టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే టన్నెల్‌కు సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి సొరంగంలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. కార్మికులను బయటకు క్షేమంగా తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు. కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని.. కానీ వారిని బయటికి తీసుకొచ్చేందుకు రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఛార్ ధామ్ రోడ్డు ప్రాజెక్ట్‌లో భాగంగా.. ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరకాశీలోని సిల్యారా- దండోల్గావ్ను ఈ టన్నెల్ కనెక్ట్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే.. ఉత్తరకాశీ నుంచి యమునోత్రి దూరం 26కిలో మీటర్ల దూరం తగ్గుతుంది.