Big Stories

Uttarakhand Tunnel Rescue : 17 రోజుల ఉత్కంఠకు తెర.. 41 మంది కార్మికులు సేఫ్..

Share this post with your friends

Uttarakhand Tunnel Rescue : 17 రోజుల పాటు టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటికి వచ్చారు. 17 రోజుల పాటు రెస్క్యూ టీమ్స్‌ రాత్రనక.. పగలనక.. చేసిన కృషి ఫలించింది. ఎట్టకేలకు నిన్న రాత్రి మృత్యు కుహరం లాంటి టన్నెల్‌ నుంచి కార్మికులు బయటికి వచ్చారు. ఒక్కో బ్యాచ్‌కు ఐదుగురు చొప్పున.. 41 మందిని బయటికి తీసుకొచ్చి వెంటనే ఆసుపత్రులకు తరలించాయి రెస్క్యూ టీమ్స్. కార్మికులు సురక్షితంగా బయటికి రావడంతో వారి కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.

నిన్న మధ్యాహ్నం నుంచి కార్మికుల రెస్క్యూకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. అత్యవసర వేళ్లలో ఉపయోగించడానికి ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా రెడీ చేశారు. కార్మికుల కోసం 41 వార్డులను కూడా ఆస్పత్రిలో సిద్దం చేశారు. ర్యాట్‌ హోల్ మైనర్లు డ్రిల్లింగ్‌ పూర్తి చేయగానే NDRF సిబ్బంది వెంటనే పైప్‌లను ఏర్పాటు చేశారు. ఆ ఎస్కేప్‌ పైప్‌ల నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. టన్నెల్‌ నుంచి బయటకు వచ్చిన కార్మికులు ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక సహాయక చర్యలను ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి స్వయంగా పర్యవేక్షించారు. టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించారు.

ర్యాట్‌హోల్‌ మైనింగ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషించారు. కార్మికులు క్షేమంగా బయటకు కావడంతో వాళ్ల కుటుంబసభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు. రెస్క్యూ సిబ్బందికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు క్షేమంగా బయటకు రావడంతో వాళ్ల కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకున్నారు.

టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుపోయారని తెలియగానే 57 మీటర్ల వరకు తవ్వి, వేయగలిగితే కూలీల వద్దకు చేరుకోవచ్చని గుర్తించిన అధికారులు ఆ దిశగా ఆపరేషన్ చేపట్టారు. అయితే కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వర్షాలు, మంచు తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడ్డంకులు సృష్టించాయి. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్‌ యంత్రంతో డ్రిల్లింగ్‌ చేపట్టగా.. 47 మీటర్లు తవ్విన తర్వాత సొరంగంలో ఇనుపపట్టీ అడ్డు రావడంతో బ్లేడు విరిగిపోయింది.

ఈ దశలో ర్యాట్‌ హోల్‌ మైనర్లను రంగంలోకి దింపారు. వీరు మాన్యువల్‌గా డ్రిల్లింగ్ చేపట్టారు. ఇదే సమయంలో టన్నెల్‌లో చిక్కుకున్న ఆగర్‌ మిషన్‌ శిథిలాలను కట్టర్‌ సాయంతో తొలగించారు. సోమవారం రాత్రి నుంచి విరామం లేకుండా తవ్వకాలు చేపట్టడంతో 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు.

డ్రిల్లింగ్‌ పని పూర్తవక ముందే అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు NDRF సిబ్బంది. డ్రిల్లింగ్‌ పూర్తవగానే కార్మికులను బయటికి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నారు. ఒక్కొక్కరిగా బయటికి తీసుకొస్తున్న కార్మికులను ముందుగా సిద్ధం చేసిన అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

చిక్కుకుపోయిన కార్మికులు బయటికి రాగానే వారికి కేంద్ర మంత్రి వి.కె.సింగ్, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ స్వాగతం పలికారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికులంతా సురక్షితంగా బయటకు రావడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కూలీల మనోధైర్యాన్ని, అహర్నిశలు శ్రమించిన సహాయక బృందాల కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కార్మికులంతా సురక్షితంగా బయటపడటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతేగాక కార్మికులకు ఫోన్ చేసి మాట్లాడారు.

కార్మికులు బయటికి రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ర్యాట్‌ హోల్ మైనింగ్ టీమ్. ఎలుకలాగా కలుగును తవ్వేసే ర్యాట్‌–హోల్‌ మైనింగ్‌ను ప్రభుత్వం నిషేధించింది. కానీ సిల్‌క్యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిందని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తెలిపింది. ఈ సొరంగంలో ర్యాట్‌–హోల్‌ మైనింగ్‌ నిపుణులు 12 మీటర్ల శిథిలాలను 24 గంటల వ్యవధిలో తవ్వేశారు. వారి కృషి వల్లే కార్మికులు త్వరగా బయటకు వచ్చారని ప్రశంసించారు.

.

.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News