
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా రెండు రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువయింది. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిపోవడంతో జనం వణికిపోతున్నారు. బజార్‌హత్నూర్, నేరడిగొండ, అర్లి, గుడిహత్నూర్, నార్నూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలో దట్టంగా పొగమంచు అలుముకోవడంతో..జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో చలి పంజా విసురుతోంది. చింతపల్లి 13.3, అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి డిసెంబర్ 1 నాటికి తుఫాన్‌గా ఏర్పాడనుంది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.
రెండు రోజులు వాయువ్యంగా పయనించి తుఫాన్‌గా బలపడి.. ఆ తరువాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని వచ్చే డిసెంబర్ 4 నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. డిసెంబర్ 5 నాటికి ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర తుఫాన్‌గా దాటుతుందని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. తీరం దాటిన తరువాత తీవ్ర తుఫాన్ బలహీనపడుతుందని తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడనున్నట్లు పేర్కొన్నారు వాతావరణశాఖ అధికారులు.