BigTV English

Vande bharat Express : విశాఖ వరకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్.. ఈ ట్రైన్ ప్రత్యేకతలేంటో తెలుసా..?

Vande bharat Express : విశాఖ వరకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్.. ఈ ట్రైన్ ప్రత్యేకతలేంటో తెలుసా..?

Vande bharat Express : తెలుగు రాష్ట్రాల్లో పట్టాలు ఎక్కనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును విశాఖపట్నం వరకు పొడిగించారు. తొలుత సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మధ్య నడపాలనుకున్నారు. విజయవాడ-దువ్వాడ మధ్య ట్రాక్‌ సామర్థ్యం 130 కి.మీ గరిష్ఠ వేగానికి తాజాగా పెంచడంతో వందేభారత్‌ రైలును విశాఖ వరకు పొడిగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మార్గమధ్యంలో వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. తెలుగురాష్ట్రాల్లో ఇది తొలి వందేభారత్‌ రైలు. మొత్తం దేశంలో ఎనిమిదవది. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.


వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలివే..!
వేగవంతమైన రైళ్లు నడపాలని రైల్వేశాఖ ఎప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. 2017లో దేశీయంగానే సెమీ హైస్పీడ్‌ రైళ్లు తయారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడమే లక్ష్యంగా చెన్నైలోని ఐసీఎఫ్‌లో ‘ట్రైన్‌-18’ ప్రాజెక్టు పట్టాలెక్కింది. తొలి టెస్ట్‌ రన్‌ లో ఆ రైలు 180 కి.మీ వేగంతో ప్రయాణించింది. అయితే దేశంలోని ఏ ట్రాక్‌లూ ఆ వేగాన్ని తట్టుకునే స్థాయిలో లేకపోవడంతో ఈ రైళ్ల వేగాన్ని 130 కి.మీకు పరిమితం చేశారు.

ఈ రైలు వెలుపలి రూపు ఏరోడైనమిక్‌ డిజైన్‌తో రూపొందించారు. గరిష్టంగా 180 కి.మీ. వేగాన్ని అందుకునేలా డిజైన్‌ చేశారు. ఈ వేగాన్ని ప్రయోగదశలో మాత్రమే పరీక్షించి చూశారు. ప్రస్తుతం నిర్వహణ దశలో దాని గరిష్ట వేగ పరిమితి మాత్రం గంటకు 160 కి.మీ. మాత్రమే. ఈ గరిష్ట వేగాన్ని 140 సెకన్లలో అందుకుంటుంది. సికింద్రాబాద్‌–విశాఖ మధ్య ట్రాక్‌ వేగ పరిమితిని గంటకు 110 కి.మీ నుంచి 130 కి.మీ.కు పెంచారు. ఫుల్లీ సస్పెండెడ్‌ ట్రాక్షన్‌ మోటార్‌తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. దీంతో రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు. ఈ రైలుకు ప్రత్యేకంగా లోకోమోటివ్‌ను జత చేసే అవసరం ఉండదు. రైలులో అంతర్భాగంగానే ఇంజిన్‌ ఉంటుంది. ఎంఎంటీఎస్‌ రైలు తరహాలో లోకోపైలట్‌ కేబిన్‌లు రెండు వైపులా ఉంటాయి.


ఇందులో సీట్లను 180 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. వెడల్పాటి కిటికీ ఉన్నందున, దాని నుంచి బయటకు చూస్తూ ఉండాలనుకున్నప్పుడు సీటును కిటికీ వైపు తిప్పుకోవచ్చు. రెండు సీట్లను పరస్పరం ఎదురెదురుగా తిప్పుకుని కూర్చోవచ్చు. కోచ్‌లో 32 అంగుళాల డిజిటల్‌ స్క్రీన్‌ ఉంటుంది. అందులో ప్రయాణికులకు రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్‌ప్లే అవుతుంటాయి. ఆడియో అలర్ట్‌లు ఉంటాయి. ఈ రైలుకు ఆటోమేటిక్‌ తలుపులుంటాయి. వాటి ని­యంత్రణ లోకోపైలట్‌ వద్దే ఉంటుంది. మధ్య­లో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు. రైలు ఆగిన కొన్ని క్షణాలకు డోర్లు తెరుచు­కుంటాయి. బయలుదేరటానికి కొన్ని సెకన్ల ముందు మూసుకుంటాయి. లోపలి వైపు, బయటి వైపు సీసీటీవీ కెమెరాలుంటాయి. లోపల వైఫై సౌకర్యం ఉంటుంది. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు పరస్ప­రం ఢీకొనకుండా ‘కవచ్‌’ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో నాలుగు ఎమర్జెన్సీ లైట్లు ఉంటాయి. విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు ఏర్పడినప్పుడు ఇవి వెలుగుతాయి.

తొలి కూత ఎక్కడంటే..?
‘ట్రైన్‌-18’కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (1.0)గా నామకరణం చేశారు. 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ – వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ట్రైన్ లో 762 కిలోమీటర్ల ప్రయాణానికిగానూ ఛైర్‌కార్ సీసీ క్లాస్‌ ధరను రూ.1,440గా నిర్దేశించారు. 2022 సెప్టెంబర్‌ 30న గాంధీనగర్‌ – ముంబై మధ్య వందేభారత్‌ 2.0 ట్రైన్‌ను ప్రారంభించారు.

చార్జీలు ఎంతంటే?
వందే భారత్ రైళ్లలో సాధారణ రైలు చార్జీలతో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఉంటాయి. ఢిల్లీ-వారణాసి మధ్య (745 కిలోమీటర్లు) నడుస్తున్న వందేభారత్‌లో చైర్‌కార్‌కు కిలోమీటరుకు రూ.2.36 పైసలు, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌కు రూ.4.44 పైసలు వసూలు చేస్తున్నారు. అలాగే న్యూఢిల్లీ-కాట్రా వైష్ణోదేవి మధ్య తిరుగుతున్న రైలులో చైర్‌కార్‌కు రూ.3.15 పైసలు, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌కు రూ.5.84 చార్జీ వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలోనూ చైర్‌కారుకు కిలోమీటరుకు రూ.3.15 పైసలు, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌కు రూ.5.84 పైసలు వసూలు చేస్తారని తెలుస్తోంది. అంటే చైర్‌ కార్‌ చార్జీ దాదాపు రూ.1100, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ చార్జీ దాదాపు రూ.2000 వరకు ఉంటుంది. ఈ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 4 గంటల్లోనే చేరుకోవచ్చు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×