Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు. యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. ఈ బిల్లు ముస్లిం వ్యతిరేకమని విపక్షాల ఆరోపణ. ఏ వర్గానికి వ్యతిరేకం కాదని.. అందులోని లోటుపాట్లను సవరిస్తున్నామని కేంద్రం వాదన. ఎట్టకేలకు వక్ఫ్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం సుదీర్ఘ చర్చ మొదలైంది. ఓటింగ్ జరగనుంది.
కేంద్రమంత్రి సంచలన కామెంట్స్
వక్ఫ్ బిల్లును ప్రవేశ పెడుతూ.. మంత్రి కిరణ్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్ బోర్డు అంటోందని.. ప్రధాని మోదీ ఈ వాదనను అడ్డుకున్నారని చెప్పారు. ఢిల్లీలోని 23 కీలక స్థలాలు వక్ఫ్ సొంతమయ్యేవని.. 123 విలువైన ప్రభుత్వ ఆస్తులు ఇప్పటికే ఆ బోర్డు పరిధిలో ఉన్నాయని అన్నారు. భారతీయ రైల్వే, రక్షణ శాఖ తర్వాత.. దేశంలో మూడో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ దగ్గర ఉందని తెలిపారు. రైల్వే, డిఫెన్స్ ల్యాండ్స్ భారతీయులు అందరి కోసమని.. కానీ వక్ఫ్ భూములు మాత్రం కొందరి కోసమేనని గుర్తు చేశారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు నష్టమా?
వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదని.. మసీదుల నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని చెప్పారు. మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదని విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి రిజిజు అన్నారు. వక్ఫ్ పాలకవర్గాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, మహిళలకు ప్రాతినిధ్యం తీసుకొచ్చేలా కొత్త బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలో సుమారు 40 సవరణలు చేశామన్నారు.
Also Read : కాళ్ల బేరానికి మావోయిస్టులు.. అమిత్ షా ఒప్పుకుంటారా?
బిల్లుకు ఆమోదం వచ్చినట్టేనా?
గతేడాది ఆగస్టులోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ – జేపీసీ కి బిల్లును పంపింది. కమిటీ కొన్ని ప్రతిపాదనలతో బిల్లును ఆమోదించింది. కొత్త వక్ఫ్ బిల్లును తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందితే.. వెంటనే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఎన్డీయేకు సంఖ్యాబలం ఉండటంతో.. వక్ఫ్ బిల్లుకు దాదాపుగా పార్లమెంట్ ఆమోదం లభించినట్టేనని చెబుతున్నారు.