Vice President Race: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? పార్టీలో సీనియర్లకు బీజేపీ ఛాన్స్ ఇస్తుందా? ఎవరూ ముందుకు రావడం లేదా? లేకుంటే మిత్రులకు కమలనాథులు అప్పగిస్తారా? మరి మోదీ-షా మనసులో ఎవరున్నారు? అన్నదానిపై హస్తినలో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.
కొత్త ఉప రాష్ట్రపతి ఎవరు అన్నదానిపై బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. యాక్టివ్‌గా ఉన్న కొందరి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వారు మొగ్గు చూపలేదని తెలుస్తోంది. వారిలో ఒకరు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రెండుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. గడిచిన దశాబ్దంపాటు మోడీ ప్రభుత్వంలో తొలుత హోంమంత్రి, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉపరాష్ట్రపతి పదవిపై ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
మరొకరు బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా. ఆయన పేరు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. నడ్డా ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో రెండు శాఖలు నిర్వహస్తున్నారు. పెద్దల సభలో సభా నాయకుడిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన్ని ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయడం కష్టమేనని అంటున్నారు.
వీరితోపాటు బీహార్ సీఎం నితీష్‌కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బీహార్ శాసనసభకు రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో ఆయన పేరు బయటకు వచ్చింది. కొన్నాళ్లుగా సీఎంగా నితీశ్ కుమార్ కొనసాగుతున్నారు. వయస్సు కూడా పైబడడంతో ఆ కుర్చీని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలతోపాటు బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
ALSO READ: ఎయిరిండియా విమానంలో ఒక్కసారిగా మంటలు, ఏం జరిగింది?
త్వరలో జరగనున్న ఎన్నికల్లో జేడీయూతో కలిసి బీజేపీ బరిలోకి దిగుతోంది. ఇలాంటి సమయంలో నితీష్ సీఎం కుర్చీ వదలుకునేందుకు సిద్ధంగా లేరన్నది ఆ పార్టీ నేతల మాట. ఒకవేళ నితీష్ మొగ్గు చూపితే బీహార్ సీఎం కుర్చీ బీజేపీ డిమాండ్ చేయడం ఖాయమని అంటున్నారు. దీంతో ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు.
వీరుకాకుండా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడేళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన. గత సీఎం కేజ్రీవాల్‌తో విభేదించి నిత్యం వార్తల్లో నిలిచేవారు. మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఆయన కూడా ఓ కారణమని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో కమలనాథుల చూపు ఆయనపై పడి ఉంటుందని అంటున్నారు.
మరొకరు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఆయన పదవీకాలం ఆగస్టు మొదటి వారంతో ముగియనుంది. బీజేపీలో సీనియర్ అయిన గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే విమర్శలు, వివాదాలతో అనేకసార్లు మనోజ్ సైతం వార్తల్లో నిలిచారు.
బీజేపీ నేతల ఆలోచన మరోలా ఉందని అంటున్నారు కొందరు. ఉపరాష్ట్రపతి ఎవరు అనేది పూర్తిగా ప్రధాని మోదీపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతల మనసులో ఏముందో ఎవరికి ఎరుక.