ఢిల్లీలో మెర్సిడెస్-బెంజ్ ML350 కారుని కేవలం రూ. 2.5 లక్షలకు అమ్మివేశాడు ఓ యజమాని. ఆ కారుని అతను 2015లో రూ. 84లక్షలకు కొన్నాడు. చివరకు దాన్ని రెండున్నర లక్షలకు కూడా ఎవరూ కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా ఎలాగోలా ఓ పార్టీని పట్టుకుని తన కారుని వదిలించుకున్నాడు. ఇంతకీ ఆ కారుని ఎందుకలా తక్కువరేటుకి అమ్మేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది..? మీరే చూడండి.
నిబంధనలతో తిప్పలు..
జులై-1 నుంచి ఢిల్లీలో కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అమ్మకాలు నిలిపివేశారు. దీనికోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. వాహనాల మ్యాన్యుఫ్యాక్చరింగ్ తేదీలు గుర్తించేందుకు కూడా ఓ సాఫ్ట్ వేర్ ని అప్ డేట్ చేసింది. అంటే, ఢిల్లీలో 15 ఏళ్ల క్రితం కొన్న పెట్రోల్ కారు, లేదా 10 ఏళ్ల క్రితం కొన్న డీజిల్ కారుని మనం నడపడం చాలా కష్టం అన్నమాట. పొరపాటున ఇతర మార్గాల ద్వారా పెట్రోల్ తీసుకొచ్చి వాటిలో పోసి రోడ్లపైకి తీసుకొచ్చినా అధికారులు చలానా వేసి తీసేసుకుంటారు, దాన్ని తిరిగి ఇవ్వడానికి సవాలక్ష కండిషన్లు పెడతారు. అంటే పాత కార్లను మెయింటెన్ చేయడం ఢిల్లీ వాసులకు తలకు మించిన భారం. అందుకే మనసు చంపుకొని మరీ వాటిని తెగనమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో వరుణ్ విజ్ కూడా ఒకరు.
ఇష్టం లేకపోయినా తప్పదు..
2015లో రూ. 84 లక్షలకు వరుణ్ విజ్ లగ్జరీ SUV మెర్సిడెస్-బెంజ్ ML350ని కొనుగోలు చేశారు. ఆ కారుతో అతనికి చాలా అనుబంధం ఉంది. తన కొడుకుని హాస్టల్ నుంచి తీసుకు రావడానికి ఆ కారునే వాడేవాడినని గుర్తు చేసుకుంటున్నారు వరుణ్ విజ్. వీకెండ్స్ లో ఆ కారులోనే వారి కుటుంబం ఏడెనిమిది గంటలు లాంగ్ డ్రైవ్ కి వెళ్లేది. ఇప్పటి వరకు ఎప్పుడూ అది బ్రేక్ డౌన్ కాలేదంటున్నారు. టైర్లు మార్చడంతోపాటు చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించి ఫుల్ కండిషన్ లో ఆ కారుని వాడుతున్నాడు. ఇప్పటి వరకు కేవలం 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ఆ బెంజ్ కారు తిరిగింది. పదేళ్లుగా అది తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉందని అంటున్నారాయన. అలాంటి కుటుంబ సభ్యుడిని ప్రభుత్వ నిబంధనల కారణంగా తాను కోల్పోతున్నట్టు తెలిపారు. తనే కాదు, ఢిల్లీలో తనలాంటి వారు చాలామంది ఉన్నారని చెబుతున్నాడు వరుణ్ విజ్. పదేళ్లు దాటిన డీజిల్ కార్లు వాడేవారు వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట. సెకండ్ హ్యాండ్ లో అమ్మేద్దామనుకుంటే కొనేవారు కరువయ్యారని చెబుతున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల వారు ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేద. ఇతర ప్రాంతాల వారు కావాలనే తక్కువ రేటుకి అడుగుతున్నారు. దీంతో ఢిల్లీలో పాత కార్ల ఓనర్లు నష్టానికే వాటిని అమ్మేస్తున్నారు.
ఇప్పుడేం చేయాలి..?
వరుణ్ విజ్ లాంటి వారు ఈ నిబంధనలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే పదేళ్లకే కారు మార్చాలంటే చాలా కష్టం అని వారు అంటున్నారు. ఇప్పుడు వారి ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనం. ప్రస్తుతం వరుణ్ విజ్ రూ.62 లక్షలు పెట్టి ఒక ఈవీ కారు కొన్నాడు. ఈవీల విషయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకు రాదని నమ్మకంగా చెబుతున్నాడు వరుణ్. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఈ కారుని కనీసం 20 ఏళ్లు వాడతానని అంటున్నాడు.