Infosys techie arrested: తన ఉద్యోగ స్థాయి, విజ్ఞానం, భవిష్యత్తు అన్నదీ పక్కనబెట్టి ఏపీకి చెందిన ఓ టెకీ బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో మహిళల వాష్‌రూమ్‌లో వీడియోలు రికార్డ్ చేస్తూ దారుణంగా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ ఉద్యోగుల మధ్య భద్రతా అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏం జరిగింది..?
28 ఏళ్ల నగేష్ స్వప్నిల్ మాలి అనే వ్యక్తి, ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. అసలు తతంగానికొస్తే.. జూన్ 30న ఒక మహిళా ఉద్యోగి ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో, ఎదురుగా గోడ చుట్టూ ఏదో అనుమానాస్పదంగా కనిపించిందట. దగ్గరగా చూసిన ఆమెకి తీరని షాక్ తగిలింది.. గోడ అవతల నుండి ఎవరో ఫోన్ కెమెరాతో వీడియో తీస్తున్నారు.. వెంటనే ఆమె గట్టిగా కేకలేసింది.
సహోద్యోగులు అప్రమత్తమయ్యారు.. నిందితుడు దొరికిపోయాడు
ఆమె కేకలతో చుట్టూ ఉన్న ఉద్యోగులు వెంటనే అక్కడికి పరుగెత్తారు. ఆ గోడ అవతల నగేష్ స్వప్నిల్ ఉన్నాడని గుర్తించి, అతడిని అడ్డగించారు. మొదట ఒప్పుకోకున్నా, ఉద్యోగుల ఒత్తిడికి తాళలేక చివరికి తన తప్పు ఒప్పుకున్నాడు. తాను తప్పు చేశానంటూ క్షమాపణలు కూడా చెప్పేశాడు.
బాధితురాలు ఈ విషయాన్ని తక్షణమే ఇన్ఫోసిస్ హెచ్.ఆర్ డిపార్ట్‌మెంట్‌కు నివేదించింది. అధికార బృందం అతడి మొబైల్‌ను పరిశీలించగా అసలు ముచ్చట బయటపడింది. అతని ఫోన్‌లో 30కిపైగా మహిళల అసభ్య వీడియోలు, రికార్డింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: 40 Years once rice: 40 ఏళ్లకు ఒకసారి పండే బియ్యం.. ఇవి తింటే కొండలు పిండి చేస్తారట!
పోలీసులు రంగంలోకి..
సమాచారం అందుకున్న వెంటనే బెంగళూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతనిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి, సైబర్ క్రైం మరియు మహిళల గోప్యత ఉల్లంఘన చట్టాల కింద విచారణ ప్రారంభించారు.
భద్రతపై ఐటీ ఉద్యోగుల ఆందోళన
ఈ ఘటనతో IT కార్మికుల మధ్య తీవ్ర ఉద్విగ్నత నెలకొంది. రోజు రోజుకీ ఇటువంటి ఘటనలు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహిళా ఉద్యోగులు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలలో జరిగే ఇలాంటి చర్యలు ఉద్యోగుల గౌరవాన్ని, కంపెనీ విలువను దెబ్బతీసేలా ఉన్నాయి.
ఇన్ఫోసిస్ స్పందన
ఇన్ఫోసిస్ ప్రతినిధులు స్పందిస్తూ, ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. మేము బాధితురాలికి పూర్తి మద్దతుగా ఉన్నాం. సంబంధిత అధికారుల సహాయంతో న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే సంస్థలోని భద్రతా విధానాలను మరింత కఠినతరం చేయనున్నట్లు పేర్కొన్నారు.