Madras HC : పెళ్లైన తర్వాత మహిళలు రహస్యంగా పోర్న్ చూడడం, స్వీయ ఆనందాన్ని పొందడాన్ని తప్పుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తుల్ని బట్టి, వారి ఆలోచనలు, ప్రవర్తనలు ఉంటాయని.. శృంగార కోరికలు ఉన్నంత మాత్రాన దానిని క్రూరత్వంగా భావించలేమంటూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఓ పిటిషన్ విచారణ సందర్భంగా తీర్పు వెలువరించింది. పిటిషనర్ ఆరోపిస్తున్నట్లుగా.. తన భార్య నిత్యం అశ్లీల చిత్రాలను చూస్తుంటే.. దానిని మహిళల లైంగిక స్వయంప్రతిపత్తిగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
భార్య నుంచి విడాకులు కావాలంటూ తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. దానిని విచారించిన న్యాయమూర్తి.. విడాకుల అభ్యర్థనను తిరస్కరిస్తూ గత ఫిబ్రవరి 6న ఇచ్చిన ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో.. తన పిటిషన్ పై విచారణ జరిపి, విడాకులు మంజూరు చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు సైతం పిటిషనర్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. అశ్లీల చిత్రాలను సీక్రెట్ గా చూడడం, స్వీయ ఆనందాన్ని పొందడం తన భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించలేమంటూ.. జి.ఆర్. స్వామినాథన్, ఆర్. పూర్ణిమల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏదైనా చట్టవిరుద్ధంగా జరగనంత వరకు.. ప్రతీ వ్యక్తి తనను తాను వ్యక్తీకరించుకునే హక్కును తిరస్కరించలేమన్న మద్రాస్ హైకోర్టు.. స్వీయ ఆనందం నిషిద్ధం కాదని గుర్తు చేసింది. పురుషులలో హస్తప్రయోగం సాధారణ విషయమని అంగీకరించినప్పుడు.. మహిళల విషయంలో ఎందుకు వ్యతిరేకించాలని ప్రశ్నించింది. స్వీయ సుఖాన్ని పొందాలనుకోవడాన్ని… భర్తపై క్రూరత్వంగా ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. వివాహం తర్వాత.. పురుషుడికి, స్త్రీ జీవిత భాగస్వామి అవుతుంది కానీ.. తన వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ చెబుతున్నట్లుగా.. ఇది హిందూ వివాహ చట్టం – 1955 ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదని తెల్చి చెప్పారు.
హిందూ జంట విడాకులకు ఎప్పుడు దాఖలు చేయవచ్చు?
హిందూ వివాహ చట్టం, 1955 లోని సెక్షన్ 13 ప్రకారం, భర్త లేదా భార్య ఏడు కారణాలలో ఏదైనా ఒకదానిపై వివాహాన్ని రద్దు చేయమని పిటిషన్ దాఖలు చేయవచ్చు. వాటిలో వ్యభిచారం, క్రూరత్వం, కనీసం రెండు సంవత్సరాల పాటు తన భాగస్వామిని విడిచిపెట్టడం, మరొక మతంలోకి మారడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం, అంటు వ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉన్న సందర్భాల్లో విడాకులు కోరవచ్చు.
ఇద్దరు హిందువుల మధ్య వివాహం రద్దు చేసుకోవాలనుకుంటే.. జీవిత భాగస్వామి ఏదైనా మతపరమైన కార్యక్రమంలోని, విధానంలోకి వెళ్లడం ద్వారా సామాజిక జీవితాన్ని త్యజించడం, లేదా ఏడేళ్ల పాటు జీవించి ఉన్న దాఖలాలు లేనప్పుడు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా.. ప్రస్తుత కేసులో భర్త రెండు ప్రధాన కారణాల వల్ల విడాకులు కోరాడు. మొదటిది భార్య క్రూరంగా ప్రవర్తించడం, రెండోది ఆమె లైంగికంగా సంక్రమించే వ్యాధితో బాధపడుతుందనే ఆరోపణ.
ఈ వాదనను నిరూపించుకునేందుకు ఆమె విచ్చలవిడగా ఖర్చు చేస్తుందని భర్త తెలిపారు. అలాగే.. ఆమె రహస్యంగా అశ్లీల చిత్రాలను చూస్తోందని, అందుకు ఆమె బానిసలా మారిందని ఆరోపించాడు. అలాగే.. తరచుగా హస్తప్రయోగానికి పాల్పడేదని, ఇంటి పనులు చేయడానికి నిరాకరించిస్తూ, అత్తమామలతో దురుసుగా ప్రవర్తింస్తుందని కోర్టుకు తెలిపాడు. అలాగే.. ఆమె సుదీర్ఘంగా ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతుందని ఆరోపించాడు.
కోర్టు ఏం తీర్పు ఇచ్చింది
భార్య లైంగికంగా సంక్రమించే వ్యాధితో బాధపడుతుందనే ఆరోపణను ప్రస్తావిస్తూ.. అతని ఆరోపణను నిరూపించడానికి అటువంటి వైద్య నివేదికలు సమర్పించలేదని, దాంతో.. ఆ ఆరోపణను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఆ వాదన అబద్ధమని అభిప్రాయపడింది. భర్త చేసిన ఆరోపణల్లో ఒకటి భార్య తన అత్తమామలతో దురుసుగా ప్రవర్తించిందనేది, కానీ తన వాదనకు మద్దతుగా తల్లిదండ్రుల సాక్ష్యాలను అందించడంలో అతను విఫలమయ్యాడని కోర్టు పేర్కొంది. అప్పీలుదారు చేసిన ఆరోపణల్లో ఏదీ నిరూపించలేదని, కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.
Also Read : Karnataka on Education: విద్యార్థులకు ఇక ‘శృంగార’ పాఠాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
భార్య అశ్లీల చిత్రాలు చూస్తున్నదనే ఆరోపణను ధృవీకరించలేకపోయినా అందులో నిజం లేకపోతే భర్త అలాంటి వాదన చేయడని భర్త తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. భర్త తన వాదనలకు మద్దతుగా భార్య ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు ఇవ్వలేదని కోర్టు గుర్తు చేసింది. ఏదైనా డిజిటల్ రూపంలో ఉన్నప్పుడు.. ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఫోన్ పంపాల్సిన అవసరం కూడా లేదన్న కోర్టు.. సర్వీస్ ప్రొవైడర్ల నుండి వివరాలు సేకరించడం సులభమేనని తెలిపింది.