Big Stories

Bangaluru: చీర విప్పి.. ఐదుగురి ప్రాణాలు కాపాడి.. ఆమెకు వందనం

bangaluru floods

Bangaluru: ఆమెకు వందనం. ఐదుగురి ప్రాణాలు కాపాడిన ఆ వనితకు వందనం. వారంతా ఆపదలో ఉన్నారని తెలిసి.. తాను మహిళనే విషయం మరిచి.. అందరిముందే కట్టుకున్న చీరను విప్పేసింది. వరదలో చిక్కుకుపోయి ప్రాణాలతో పోరాడుతున్న ఆ బాధితులకు ఆసరాగా అందించింది. ఆ మహిళ ఇచ్చిన చీరతోనే ఏకంగా ఐదుగురి ప్రాణాలు నిలిచాయి. వరద నీరు వారిని మింగేయకుండా.. ఆమె చీర వారధిగా నిలిచింది. అందుకే, ఆమెకు సెల్యూట్.

- Advertisement -

బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరం వరద మయంగా మారింది. ఆదివారం అండర్‌ పాస్‌లో తన్నుకొచ్చిన నీటిలో మునిగి ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భానురేఖ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలోనే మరో ఐదుగురూ మృత్యువాత పడాల్సింది. కానీ, ఓ మహిళ చేసిన సాహసం వారిని కాపాడింది. భానురేఖను మాత్రం కాపాడలేకపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…

- Advertisement -

స్థానిక కేఆర్‌ కూడలిలోని అండర్‌ పాస్‌ దగ్గర ఏదో అలజడిని గుర్తించింది అటుగా వెళ్తున్న ఓ మహిళ(42). చూస్తే ఓ కారు వరద నీటిలో చిక్కుకుంది. అందులో ప్యాసింజర్లు ఉన్నారు. కొందరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆ నీటిలోని వారిని బయటకు లాగాలంటే తాడు అవసరమైంది. చుట్టుపక్కల తాడు, కర్రలాంటి వేవీ లేవు. ఆ సమయంలో ఆ మహిళ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. తాను కట్టుకున్న చీరను విప్పి.. బాధితులను రక్షించేందుకు సహకరించింది. ఆ చీరను ఓ ఇనుప చువ్వకు కట్టి.. మరోక చివరను బాధితులకు అందించారు. వారు ఆ చీర సహాయంతో ఒక్కొక్కరుగా ఒడ్డుకు రాగలిగారు. అంతలోనే రక్షణ బృందాలు అక్కడికి చేరుకొని.. వారిని రెస్క్యూ చేశారు. ఆ ఐదుగురు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారంటే.. అప్పుడు ఆ మహిళ అందించిన చీరే కారణం.

ఆమె చూపించిన తెగువకు అక్కడి వారంతా అవాక్కయ్యారు. అంతలోనే తేరుకొని ఆమెను అభినందించారు. అక్కడే ఉన్న మరో మహిళ తన చున్నీని ఆమెకు అందించింది. మరో వ్యక్తి తన చొక్కాను విప్పి ఆ మహిళకు ఇచ్చాడు. ఇలా అంతా ఆమె గౌరవాన్ని నిలిపారు. ఫోటో, వివరాలు లేకున్నా.. ఆ సాహస వనితను అభినందించకుండా ఉండలేం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News