
Modi : ప్రధాని నరేంద్ర మోదీ తమ మన్‌కీ బాత్ కూడా వినాలని రెజ్లర్లు విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని, అతనిపై విచారణ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి రెజర్లు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ప్రధాని తమ బాధను పట్టించుకోవడం లేదంటూ రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. 4 రోజులుగా రోడ్డుపై నిద్రించారు. దేశ కుమార్తెలకు న్యాయం చేయాలని ప్రధానిని కోరారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఏడుగురు మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేముందు ప్రాథమిక విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోలీసులు బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం మంగళవారం ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించింది.
2012 నుంచి 22 వరకు దేశంలో, వెలుపలా ఎప్పుడెప్పుడు ఎలా లైంగిక వేధింపులు, బెదిరింపులకు అతను పాల్పడిందీ నిరూపించే ఆధారాలు, వీడియో రికార్డింగ్‌లు తమ వద్ద ఉన్నాయని ఫిర్యాదుదారులు కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలు చేస్తూ గతంలోనూ రెజ్లర్లు ధర్నా చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దర్యాప్తు చేస్తామని.. బాధితులకు న్యాయం చేస్తామని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ కూడా ఇచ్చారు. ఈ ఆరోపణలపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో రెజ్లర్లు శాంతించారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు మరోసారి ధర్నాకు దిగారు.
రెజ్లర్ల ఆందోళనకు మేఘాలయా మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడాతోపాటు పలువురు మద్దతు పలికారు.