UBER – Auto Drivers : ఆన్ లైన్ రైడ్ బుకింగ్ సౌకర్యాన్ని అందించే ఉబర్.. డ్రైవర్ల కోసం సరికొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు కస్టమర్లు బుకింగ్ చేసుకునే ప్రతీ రైడ్ పై నిర్దేశిత శాతం కమీషన్ ను మినహాయించుకుంటోంది. కిలోమీటర్ల లెక్కన డబ్బులు వసూలు చేస్తూ.. అందులోనే తన సర్వీస్ ఛార్జీలను ఉపసంహరించుకుని, మిగతా డబ్బుల్ని డైవర్ల ఖాతాలోకి జమ చేస్తుంటుంది. ఇలా.. ప్రతీ రైడ్ పై సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుండడం వల్ల డైవర్ల ఆదాయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉబర్ సరికొత్త పథకాన్ని అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటి నుంచి ఇండియాలోని ఆటో డ్రైవర్ల కోసం సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) ఆధారిత జీరో కమిషన్ మోడల్‌ను అనుసరించనుంది. ఈ విషయాన్ని ఉబర్ తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది.
నూతన విధానంలో ఆటో డ్రైవర్లు ప్రతి ట్రిప్‌కు సంస్థకు కమీషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరి ఉబర్ ఆదాయం మాటేమిటి అంటారు.. అందుకు సంస్థ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే.. నిర్దేశిత రుసుములు చెల్లించి.. ప్లాన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ లో ప్రత్యర్థిగా ఉన్న రాపిడో ఏడాది క్రితం నుంచే అమలు చేస్తోంది. ర్యాపిడో వినియోగిస్తూ.. సర్వీసులు అందిస్తున్న డ్రైవర్లు ప్రతీ రైడ్ కు సంస్థకు కమీషన్ చెల్లించడం లేదు. ఇలా.. తన డ్రైవర్ల నుంచి మంచి డిమాండ్ అందుకుంటున్న నేపథ్యంలో.. ఉబర్ సైతం ఈ విధానానికి ఏడాది తర్వాత మొగ్గు చూపింది. సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఆధారిత మోడల్‌ను ఆటోలకు విస్తరిస్తూ.. యాప్‌లో నోటిఫికేషన్ సూచిస్తోంది. ఎన్నో ఏళ్లుగా డ్రైవర్ల నుంచి అనేక సమ్మెలను ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ మార్పులు జరుగుతున్నాయి.
కస్టమర్లకు ఏవైనా సమస్యలు ఎదురైతే..
వినియోగదారులు, ఆటో డ్రైవర్ల మధ్య అనేక విషయాల్లో విభేదాలు వస్తుండగా.. వాటన్నంటికీ సంస్థకు తెలుపుతున్న వినియోగదారులు, సంస్థ సేవలపై విమర్శలు చేస్తున్నారు. అంటే.. ఏవరైనా డ్రైవర్ రైడింగ్ క్యాన్సిల్ చేసినా, వస్తానని చెప్పిన సమయానికి రాకపోయినా, డబ్బుల విషయంలో బేరాలు ఆడినా.. సంస్థే బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రస్తుత విధానంలో ఈ విషయాల్లోనూ తన బాధ్యతల్ని తగ్గించుకునేందుకు ఉబర్ సిద్ధమైంది. ఇప్పటి నుంచి తన యాప్ లో కేవలం రైడ్ కి ఛార్జీలను మాత్రమే సూచిస్తుందని, డ్రైవర్/ రైడర్ తో కస్టమర్లు చర్చించి ఛార్జ్ ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే.. ఇకపై కస్టమర్లు డ్రైవర్‌కు నేరుగా నగదు రూపంలో లేదా UPI ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. Uber యాప్ లేదా Uber క్రెడిట్‌ల ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలవ్వదు అని సంస్థ తెలిపింది. అలాగే.. క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు/ఇంటిగ్రేటెడ్ UPI చెల్లింపులు వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించలేరని అన్నది.
ఇప్పటి వరకు కస్టమర్ల చెల్లింపుల నుంచి సంస్థకు నిర్దేశిత పర్సైంటేజ్ వెళుతుండేది.. ఇకపై మొత్తం చెల్లింపులు 100% నేరుగా డ్రైవర్‌కు వెళ్తాయని ఉబర్ తెలిపింది. దీంతో.. డ్రైవర్ వైపు నుంచి రైడ్ రద్దులకు లేదా ఏ సమయంలోనైనా రవాణా సేవలను అందించడానికి నిరాకరించే డ్రైవర్లకు ఉబర్ బాధ్యత వహించదని తెలిపింది. ఉబర్ ఇకపై రైడ్‌లను నియంత్రించడం లేదు కాబట్టి, ఆటో ట్రిప్‌లకు కస్టమర్ల నుంచి లేదా డ్రైవర్ల నుంచి ఎటువంటి GST వసూలు చేయదని వెల్లడించింది.
Also Read : Tesla’s EV In India : టెస్లా కారు వచ్చేస్తోంది – ప్రారంభ ధర ఎంతో తెలుసా.?
అయితే, రైడ్ సమయంలో భద్రతా సమస్యలను యాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఉబెర్ గత ఏప్రిల్‌లో ఆటో రిక్షా డ్రైవర్ల కోసం ఇటువంటి సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్రణాళిక పైలట్ వెర్షన్‌ను ప్రారంభించింది. ఇది చెన్నై, కొచ్చి, విశాఖపట్నం నుంచి ప్రారంభమైన ఆరు నగరాల్లో అమలైంది. ఉబెర్ కూడా రైడర్లను స్వతంత్ర డ్రైవర్ భాగస్వాములతో అనుసంధానించే సాంకేతిక వేదికగా మాత్రమే పనిచేస్తుందని మరియు ఎటువంటి రవాణా సేవలను అందించదని ఒక డిస్క్లైమర్ జారీ చేసింది. రైడ్‌ల అమలు, పూర్తి లేదా నాణ్యతపై కూడా దీనికి ఇకపై నియంత్రణ ఉండదని స్పష్టం చేసింది.