OTT Movies: ‘యానిమల్’ మూవీలో విలన్‌గా మెప్పించిన బాబీ డియోల్.. ఆ మూవీ కంటే ముందే మరో నెగటివ్ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతడు నటించిన వెబ్ సీరిస్.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండ్ అవుతూనే ఉంది. భక్తి ముసుగులో రాసలీలలు చేసే బాబాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించే ఈ వెబ్ సీరిస్.. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి చూడటం మొదలుపెడితే.. అస్సలు వదిలిపెట్టలేరు. ఇప్పటికే మూడు సీజన్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో మొదటి సీజన్‌లో స్టోరీ గురించి ముందుగా తెలుసుకోండి.
ఆశ్రమ్ సీజన్ 1 కథ ఇది:
కాశీపూర్ అనే నగరంలో జరిగే బాబా నీరాలా (బాబీ డియోల్) ఒక ఆశ్రమాన్ని నడుపుతాడు. బయటకు అణగారిన వర్గాలకు, పేదలకు సహాయం చేసే మంచి బాబాలా కనిపిస్తాడు. కానీ, అతడి ఆశ్రమం.. అత్యాచారాలు, హత్యలు, డ్రగ్స్, ఓటు బ్యాంకు రాజకీయాలకు కేంద్రంగా ఉంటుంది. బాబా నీరాలాకు రైట్ హ్యాండ్‌గా ఉండే భోపా స్వామి (చందన్ రాయ్ సన్యాల్) ఈ అక్రమ కార్యకలాపాల బాధ్యతలు చూసుకుంటాడు.
అసలు కథ మొదలయ్యేది ఇక్కడే..
అణగారిన కులానికి చెందిన యువ రెజ్లర్ పమ్మీ(ఆదితి పోహంకర్)ని అంటరాని దానిలా చూస్తుంటారు. దీంతో ఆమె సమాజంపై కోపం పెంచుకుంటుంది. అసహన స్థితికి చేరకుంటుంది. అలాంటి సమయంలో బాబా నీరాలా ఆమెను రక్షిస్తాడు. దీంతో ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌ను వదిలేసి, బాబా ఆశ్రమంలో సాధ్విగా చేరుతుంది.
ఆ శవం ఎవరిది?
ముఖ్యమంత్రి సుందర్‌లాల్ (అనిల్ రస్తోగీ) కాశీపూర్ సమీపంలోని అడవిలో మిశ్రా గ్లోబల్ అనే కార్పొరేట్ సంస్థకు అక్రమంగా భూమి కేటాయిస్తాడు. అక్కడ నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఓ శవం బయటపడుతుంది. దీంతో అక్కడి సబ్-ఇన్స్పెక్టర్ ఉజాగర్ సింగ్ (దర్శన్ కుమార్) ఈ కేసును విచారిస్తాడు. మొదట్లో ఉజాగర్‌కు తన జాబ్‌పై ఆసక్తి ఉండదు. కానీ, ఈ కేసును మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. ఆ శవానికి, ఆశ్రమానికి ఏదో సంబంధం ఉందనే కోణంలో విచారణ చేపడతాడు.
శుద్ధీకరణ్ పేరుతో అరాచకాలు
బాబా నీరాలా తన భక్తులను శుద్ధికరణ్ అనే బలవంతపు ఆచారాన్ని అలవాటు చేస్తాడు. దీంతో వారు తమ సంపదను ఆశ్రమానికి రాసిస్తారు. సత్తి (రాజీవ్ సిద్ధార్థ) అనే భక్తుడు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తాడు. ఈ సందర్భంగా సత్తి తన భార్య బబితా (త్రిధా చౌదరి)ని పరిచయం చేస్తాడు. బాబా నీరాలా బబితాపై కన్నేస్తాడు. ఓ రోజు ఆమెను తన ప్రైవేట్ గదికి పిలిపించుకుంటాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి బలవంతంగా ఆ పని చేస్తాడు.
ప్రభుత్వానికి మద్దతు.. వేగంగా దర్యాప్తు
రాష్ట్ర ఎన్నికల సమయంలో హుకుం సింగ్ (సచిన్ ష్రాఫ్), ముఖ్యమంత్రి సుందర్‌లాల్ కలిసి బాబా నీరాలా సాయం కోరుతారు. అతడి భక్తుల ఓట్లన్ని తమకు పడేందుకు మద్దతు ఇవ్వాలని అడుగుతారు. దీంతో నీరాలా వాళ్లతో ఒప్పందాలు చేసుకుని తన పవర్‌ను మరింత పెంచుకుంటాడు. మరోవైపు ఉజాగర్ సింగ్ ఆశ్రమంలోని రహస్యాలను బయటపెట్టడానికి దర్యాప్తు కొనసాగిస్తాడు. అతడి స్నేహితుడు ఎస్.పి. ధండా (విక్రమ్ కొచ్చర్) సహాయంతో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తాడు. అయితే, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి కారణంగా దర్యాప్తును ఆపాలని ఆదేశం వస్తుంది. అయినా ఉజాగర్ ఆశ్రమం రహస్యాలను బయటపెట్టడానికి ట్రై చేస్తాడు. మరి, ఆ తర్వాత ఏమవుతుంది? ఉజాగర్ సింగ్ ప్రయత్నం ఫలిస్తుందా? బాబా రహస్యాలు బయటపడతాయా? రెజ్లర్ షమ్మీకి బాబా గురించి నిజాలు తెలిశాక ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఈ వెబ్ సీరిస్‌ను చూడండి. ప్రస్తుతం MX ప్లేయర్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
Also Read: OTT Movie: ప్రియుడిని చంపి తినేసే అమ్మాయి.. తల్లి బాటలో కూతురు, ఈ మూవీ చూశాక నిద్రపట్టదు