Lawho Gouranger Naam Rey OTT: ఆధ్యాత్మిక చరిత్రలో శ్రీ చైతన్య మహాప్రభు పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తితో పాటు హరినామ సంకీర్తన ద్వారా భక్తి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఆయన జీవితం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది. అయితే ఆయన చివరి రోజులు, పూరీలో అదృశ్యమైన ఘటన చుట్టూ ఇప్పటికీ ఎన్నో ఆసక్తికరమైన చర్చలు ఉన్నాయి. ఈ చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని మూడు కాలాల కథలతో ముడిపెట్టి తెరకెక్కించిన బెంగాలీ పీరియడ్ డ్రామా ‘లహో గౌరాంగేర్ నామ్ రే’ (Lawho Gouranger Naam Rey) ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ SonyLIVలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు సృజిత్ ముఖర్జీ రూపొందించిన ఈ చిత్రం చరిత్ర, భక్తి, నాటకరంగం, మిస్టరీని కలిపి చూపిస్తుంది. ఈ వీకెండ్‌లో కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఒక పవిత్రమైన, స్ఫూర్తిదాయక మాస్టర్ పీస్ ఇది.
ఈ సినిమా కథ మూడు వేర్వేరు కాలాల్లో సాగుతుంది. మొదటి కథ 15వ శతాబ్దానికి చెందినది. ఇందులో చైతన్య మహాప్రభు ఆధ్యాత్మిక ప్రయాణం, పూరీ జగన్నాథ ఆలయంతో ఆయనకున్న అనుబంధం, చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆయన అదృశ్యం వెనుక అసలు నిజం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఆయన శిష్యుడు నిత్యానంద ప్రయత్నిస్తుంటాడు. రెండో కథ 19వ శతాబ్దం నాటి బెంగాల్‌లో సాగుతుంది. ప్రముఖ రంగస్థల నటి నటి బినోదిని, నాటకరంగ ప్రముఖుడు గిరీష్ చంద్ర ఘోష్ జీవితాలతో ఈ భాగం ముడిపడి ఉంటుంది. రంగస్థలంపై చైతన్య మహాప్రభు పాత్రను పోషించే క్రమంలో బినోదిని ఆయన భక్తి, ఆధ్యాత్మికతలో ఎలా లీనమైంది? ఆ కాలంలో నాటకరంగంలో మహిళలు ఎదుర్కొన్న వివక్ష, అవమానాలు ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అనేది ఈ కథలో చూపిస్తారు.
ఇక మూడో కథ ప్రస్తుత కాలంలో సాగుతుంది. రాయ్ అనే యువ దర్శకురాలు చైతన్య మహాప్రభు అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధన చేస్తూ ఆయన జీవితంపై సినిమా తీయాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ప్రముఖ నటుడు పార్థసారథిని ఎంపిక చేస్తుంది. అయితే ఈ సినిమా నిర్మాణం ముందుకు వెళ్లే కొద్దీ చైతన్య మహాప్రభు గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆమె ప్రయత్నం కొత్త చిక్కులకు దారితీస్తుంది. ఈ మూడు కాలాల్లోని వ్యక్తుల జీవితాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడ్డాయి? చైతన్య మహాప్రభు అదృశ్యం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆయన ఆధ్యాత్మిక వారసత్వం శతాబ్దాలు దాటినా మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది? అనేదే ఈ సినిమా స్టోరీ.
సృజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిబ్యజ్యోతి దత్తా చైతన్య మహాప్రభుగా, సుభశ్రీ గంగూలీ నటి బినోదినిగా, జిష్ణు సేన్‌గుప్తా నిత్యానందగా, బ్రత్య బసు గిరీష్ చంద్ర ఘోష్‌గా, ఇంద్రనీల్ సేన్‌గుప్తా పార్థసారథిగా, ఇషా సాహా రాయ్‌గా నటించారు. శ్రికాంత్ మోహతా, రాణా సర్కార్ నిర్మించారు. ఇంద్రదీప్ దాస్‌గుప్తా, కబీర్ సుమన్ తదితరులు సంగీతానికి సహకరించారు. 2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు 2 గంటల 9 నిమిషాల నిడివి కలిగి ఉంది. 2026 నవంబర్ 15 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ బెంగాలీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.