Comedy Mystery Series on OTT: ఓటీటీలో క్రైమ్, మిస్టరీ కథలకు మంచి ఆదరణ ఉంటుంది. అయితే వాటికి కాస్త కామెడీ, అడ్వెంచర్ కూడా తోడైతే వినోదానికి కొదవ ఉండదు. ఇప్పుడు అలాంటి కథతోనే ‘డిగ్’ (DIG) అనే కొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పార్క్స్ అండ్ రిక్రియేషన్’ వంటి సూపర్ హిట్ కామెడీ షోను అందించిన అమీ పోహ్లర్, మైఖేల్ షుర్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కలిసి ఈ సిరీస్‌ను రూపొందించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సరికొత్త కామెడీ మిస్టరీ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తూనే ఉత్కంఠలోకి తీసుకెళ్తోంది. పురావస్తు తవ్వకాల నేపథ్యంలో ఏదో ఒక అరుదైన వస్తువు దొరకడం, అది కాస్తా ప్రపంచ చరిత్రనే మార్చేసే ఒక అంతర్జాతీయ కుట్రకు దారితీయడం అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సిరీస్ తెరకెక్కింది. కామెడీతో పాటు మిస్టరీ, అడ్వెంచర్ కథలను ఇష్టపడేవాళ్ళు ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు.
గ్రీస్‌లోని ఓ పురాతన ప్రాంతంలో వేసవి కాలంలో పురావస్తు తవ్వకాలు జరుగుతుంటాయి. ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు మహిళా పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడికి వస్తారు. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య ఉంటుంది. ఈ బృందానికి నాయకత్వం వహించే ఎలిస్ (అమీ పోహ్లర్) తన ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తుంటుంది. కానీ ఆమె బాస్ నెవిల్లే (హ్యూ లారీ) మాత్రం రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన లేకుండా ఆమెకు తలనొప్పులు తెస్తుంటాడు. మరోవైపు డైలాన్ (గెరాల్డిన్ విశ్వనాథన్), క్లేర్ (ఆంటోనియా థామస్) తమ వ్యక్తిగత జీవితాల్లోని సమస్యలతో సతమతమవుతుంటారు.
ఇలా అందరి మధ్య సరదాగా సాగుతున్న సమయంలో తవ్వకాల్లో ఓ అరుదైన పురాతన వస్తువు బయటపడుతుంది. మొదట దాన్ని సాధారణ వస్తువుగానే భావించినా, దాని వెనుక ప్రపంచ చరిత్రనే మార్చేయగల రహస్యం ఉందని వారికి అర్థమవుతుంది. దీంతో ఆ వస్తువు కోసం అంతర్జాతీయ మాఫియా, స్పై ముఠాలు రంగంలోకి దిగుతాయి. అసలు ఆ వస్తువులో ఏముంది? దాన్ని సొంతం చేసుకోవడానికి మాఫియా ఎందుకు ఇంతలా ప్రయత్నిస్తోంది? ఈ వ్యవహారంలో చిక్కుకున్న నలుగురు మహిళలు ఎలా బయటపడతారు? అనే అంశాలతో కథ ముందుకు సాగుతుంది. కామెడీ సన్నివేశాల మధ్యే మిస్టరీని కొనసాగిస్తూ ఈ సిరీస్ నడుస్తుంది.
కేట్ మైయర్స్ రాసిన ‘ఎక్స్‌కవేషన్స్’ నవల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. అమీ పోహ్లర్, మైఖేల్ షుర్ క్రియేట్ చేసిన ఈ సిరీస్‌లో హ్యూ లారీతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు లీడ్ రోల్స్ లో నటించారు. రొటెన్ టొమాటోస్‌లో 88 శాతం స్కోర్ సాధించడంతో పాటు IMDbలో 7/10 రేటింగ్‌ను అందుకున్న ఈ సిరీస్, 2026 నవంబర్ 24 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 10 ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ మాత్రమే ఉన్నాయి.
Read Also: మంచు తుఫానులో లవ్ బర్డ్స్… సడెన్‌గా తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ