Mahabharat Ek Dharmayudh on OTT: భారతీయ ఇతిహాసాలకు ఎప్పటికీ తరగని క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మన పురాణ గాథలను విజువల్ వండర్స్‌గా తెరకెక్కిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. గతేడాది తొలి సీజన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇండియాస్ ఫస్ట్ ఏఐ-పవర్డ్ మైథలాజికల్ సిరీస్ ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ (Mahabharat: Ek Dharmayudh) ఇప్పుడు మరింత భారీ స్థాయిలో, గూస్‌బంప్స్ తెప్పించే ఘట్టాలతో రెండో సీజన్‌తో (Season 2) డిజిటల్ తెరపైకి వచ్చేసింది. మొదటి సీజన్ 10 ఎపిసోడ్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఈ రెండవ సీజన్‌ను ఏకంగా 25 ఎపిసోడ్లతో ఏఐ విజువల్స్‌తో ఈ సిరీస్‌ను అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. తొలి సీజన్‌లో కురువంశం ఆరంభం నుంచి పాండవులు, కౌరవుల బాల్యం వరకు చూపించగా, ఈ కొత్త సీజన్‌లో అసలైన మలుపులు, రసవత్తరమైన ఘట్టాలు మొదలయ్యాయి. ఈ సారి సీజన్ 2లో ఏయే ఘట్టాలను చూపించారో, ఈ సిరీస్‌ను ఏయే భాషల్లో చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండో సీజన్ కథంతా లక్క ఇంటి అగ్నిప్రమాదం తర్వాతి పరిణామాల నుంచి అత్యంత ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. ఆ ప్రమాదంలో పాండవులు చనిపోయారని భావించి ద్వారకలో బలరాముడు తీవ్ర దుఃఖంలో మునిగిపోగా, శ్రీకృష్ణుడు మాత్రం పాండవులు క్షేమంగానే ఉన్నారని గ్రహిస్తాడు. మరోవైపు ప్రాణాలతో బయటపడిన పాండవులు దట్టమైన అడవుల్లో అజ్ఞాతంగా ప్రయాణిస్తుండగా, అక్కడ భయంకరమైన రాక్షసుల బారిన పడతారు. ఈ క్రమంలో రాక్షస రాజు హిడింబాసురుడితో భీముడు చేసే భీకర పోరాటం, హిడింబితో భీముడి వివాహం, అద్భుత శక్తులతో కూడిన వీరుడు ఘటోత్కచుడి జననం వంటి సన్నివేశాలు ఏఐ విజువల్స్‌లో గూస్‌బంప్స్ తెప్పించేలా తెరకెక్కించారు.
అంతేకాకుండా పాండవుల జీవితాలను పూర్తిగా మలుపు తిప్పే ద్రౌపది వస్త్రాపహరణం వంటి భావోద్వేగభరితమైన ఘట్టాలను కూడా ఈ సీజన్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. అధర్మం పెచ్చుమీరిన ప్రతిసారీ ధర్మాన్ని కాపాడేందుకు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు ఇచ్చే అభయం, కౌరవులు-పాండవుల మధ్య ముదిరిన వైరం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. పురాణ కథనానికి ఏఐ గ్రాఫిక్స్ తోడవడంతో ప్రతి ఎపిసోడ్ ఒక విజువల్ ట్రీట్‌లా సాగుతుంది. మన పురాణ గాధలు భావి తరానికి అందించడంలో ఈ సిరీస్ లు కూడా ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ (Mahabharat: Ek Dharmayudh) ఏఐ పవర్డ్ మైథలాజికల్ సిరీస్ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో నేటి నుంచే (2026 నవంబర్ 24) స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 25 ఎపిసోడ్లు ఉన్న ఈ రెండో సీజన్ భారతీయ ప్రేక్షకులందరినీ అలరించేలా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత రోహిత్ జైసింగ్ వైద్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను కలెక్టివ్ స్టూడియోస్ హిస్టరీవర్స్, గ్యాలరీ5 (Galleri5) సంస్థలు అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించాయి.