Reality Documentary Series on OTT: సెలబ్రిటీల జీవితం అనగానే మనకు లగ్జరీ కార్లు, ఖరీదైన ఇళ్లు, విదేశీ పర్యటనలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కుటుంబ మూలాలను వెతుక్కుంటూ వెళ్లి, తమ పూర్వీకుల వారసత్వాన్ని తిరిగి గుర్తు చేసుకోవాలని ఒక స్టార్ నటి ప్రయత్నిస్తుంది. అందులోనూ వంట చేయడమే రాని ఒక హాలీవుడ్ సెలబ్రిటీ రెస్టారెంట్ నడపాలని నిర్ణయించుకుంటుంది. వంట రాని ఈ గ్లోబల్ స్టార్, ఒక కమర్షియల్ కిచెన్ లోకి దూరి వంటలు నేర్చుకుంటూ పడ్డ పాట్లు ఇందులో చాలా హిలేరియస్‌గా చూపెట్టారు. ప్రొఫెషనల్ చెఫ్స్ ఇచ్చే గైడెన్స్ ని తట్టుకుంటూ, కస్టమర్ల ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ ఆమె చేసిన ఈ రియాలిటీ జర్నీ ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది. అలాగే ఇన్స్పైర్ చేస్తుంది. ఈ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందిన రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్ పేరు ‘Awkwafina: The Unlikely Cook’. గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి, కమెడియన్ ఆక్వాఫినా అసలు పేరు నోరా లమ్. తన కుటుంబానికి ఉన్న రెస్టారెంట్ వారసత్వాన్ని తిరిగి వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆమె చేపట్టిన ప్రయాణమే ఈ సిరీస్. మరి ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటో తెలుసుకుందాం పదండి.
న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ ప్రాంతంలో ఒకప్పుడు ఆక్వాఫినా కుటుంబానికి చెందిన Lum’s అనే ప్రసిద్ధ కాంటోనీస్ చైనీస్ రెస్టారెంట్ ఉండేది. ఆమె ముత్తాత ప్రారంభించిన ఈ రెస్టారెంట్ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. అయితే కాలక్రమంలో ఆ రెస్టారెంట్ మూతపడిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబ వారసత్వాన్ని తిరిగి గుర్తుచేసుకోవాలని ఆక్వాఫినా నిర్ణయించుకుంటుంది. ఇక్కడే ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. రెస్టారెంట్ గురించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, ఆమెకు అసలు వంట చేయడం రాదు. కనీసం చిన్న పాటి వంటకాలు తయారు చేయడంలోనూ అనుభవం లేని ఆమె, ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారేందుకు సిద్ధమవుతుంది.
ఈ క్రమంలో ఆక్వాఫినా దేశవ్యాప్తంగా ప్రయాణిస్తూ వంటల్లోని మెళకువలు నేర్చుకుంటుంది. ఆ తర్వాత కమెడియన్ జిమ్మీ ఓ. యాంగ్‌తో కలిసి టెక్సాస్ వెళ్లి అక్కడి ప్రసిద్ధ బార్బెక్యూ వంటకాల గురించి తెలుసుకుంటుంది. ప్రముఖ చెఫ్స్ రాయ్ చోయ్, మార్టిన్ యాన్ దగ్గర కూడా వంటల్లోని ప్రత్యేకతలను నేర్చుకుంటుంది. అంతేకాదు హవాయిలో తన అమ్మమ్మ రెస్టారెంట్‌పై ప్రభావం చూపిన టికీ సంస్కృతిని అన్వేషిస్తుంది. లాస్ ఏంజెలెస్‌లోని చైనాటౌన్ రెస్టారెంట్‌లో పనిచేస్తూ కిచెన్‌లోనే కాకుండా సర్వింగ్ విభాగంలోనూ ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవిస్తుంది.
ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగిన ఆమె, చివరకు తన కుటుంబ రెస్టారెంట్ వారసత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక పాప్-అప్ రెస్టారెంట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. అయితే వంటకాల ఎంపిక, మెనూ తయారీ, కిచెన్ నిర్వహణ, అతిథులకు వడ్డించడం వంటి పనులన్నీ అంత సులభంగా సాగవు. ముఖ్యంగా ప్రారంభోత్సవం రోజున తన అమ్మమ్మను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడంతో ఆమెపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఆఖరి నిమిషంలో ఎదురయ్యే సమస్యలను ఆక్వాఫినా ఎలా అధిగమించింది? తన కుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా వంటకాలను సిద్ధం చేయగలిగిందా? అనేది మిగతా ఎపిసోడ్స్‌లో చూడాలి.
ఇది ఫిక్షనల్ సినిమా కాదు. ఆక్వాఫినా తన నిజ జీవితంలో చేపట్టిన వంటల ప్రయాణాన్ని చూపించే ఎనిమిది ఎపిసోడ్ల రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్. ఇందులో ఆక్వాఫినాతో పాటు జిమ్మీ ఓ. యాంగ్, రాయ్ చోయ్, మార్టిన్ యాన్ వంటి ప్రముఖులు కనిపిస్తారు. Twofour సంస్థ నిర్మించగా, ఆక్వాఫినా కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నుంచి 35 నిమిషాల నిడివితో ఉంటుంది. 2026 నవంబర్ 6న Apple TV+లో మొదటి రెండు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. మిగతా ఎపిసోడ్లు వారానికొకటి చొప్పున విడుదల కానున్నాయి. వీకెండ్ లో ఒక మంచి లైట్ హార్టెడ్ అండ్ మోటివేషనల్ రియాలిటీ షో చూడాలనుకుంటే ఆపిల్ టీవీ ప్లస్ లో దీన్ని తప్పకుండా వాచ్ చేయండి.
Read Also: బలవంతంగా పెళ్లి… వాయిస్ మెసేజ్‌తో కుప్పకూలిన సంసారం… హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ