Action Thriller on OTT: హాలీవుడ్ యాక్షన్ సినిమాలంటే వెంటనే గుర్తొచ్చే నటుల్లో లియామ్ నీసన్ ఒకరు. ఒంటరిగా శత్రువులను ఎదుర్కోవడం, ప్రాణాలకు తెగించి పోరాడటం, హై-స్పీడ్ ఛేజింగ్‌లతో ఆయన చేసే యాక్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆయన 74 ఏళ్ల వయసులో కూడా రోడ్లపై పూనకాలు తెప్పించే కార్ చేజింగ్స్ తో సరికొత్త హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘The Mongoose’ అనే ఈ సినిమాలో లియామ్ నీసన్ లీడ్ రోల్ లో నటించారు. మార్క్ వాన్సెలో దర్శకత్వం వహించిన ఈ సినిమాను Amazon MGM Studios నిర్మించింది. ఇందులో కార్ చేజింగ్ సీన్స్ లో వచ్చే విజువల్స్ హాలీవుడ్ యాక్షన్ లవర్స్ కి పక్కాగా పూనకాలు తెప్పిస్తాయి. దీని కథ ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఈ సినిమాలో హీరో పేరు ర్యాన్ (లియామ్ నీసన్). అతను ఒకప్పుడు అమెరికా సైన్యంలో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ (గ్రీన్ బెరెట్). యుద్ధ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రాణ స్నేహితుడిని కోల్పోవడంతో అతను మానసికంగా కుంగిపోతాడు. ఈ సమస్యల కారణంగా అతని కాపురం కూడా కూలిపోతుంది, భార్య తారా (మారిస్సా తోమీ)కి దూరంగా ఒంటరిగా బతుకుతుంటాడు.
ఒకరోజు తారా నుంచి హీరోకి ఫోన్ వస్తుంది. ఆమె ఆసుపత్రిలో ఉండటంతో తన వ్యక్తిగత సామాన్లు తీసుకురమ్మని కోరుతుంది. అలా ఆమె కొత్త బాయ్‌ఫ్రెండ్ టాడ్ ఇంటికి వెళ్లిన హీరోకి అక్కడ ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. టాడ్‌తో జరిగిన గొడవలో, తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో టాడ్ అనుకోకుండా చనిపోతాడు. కానీ పోలీసులు వస్తే తన గత భయానక పరిస్థితులు మళ్లీ చుట్టుముడతాయని భయపడిన హీరో, అక్కడి నుంచి పారిపోవాలని డిసైడ్ అవుతాడు. టాడ్ గ్యారేజ్‌లో ఉన్న పవర్ పుల్ ‘షెల్బీ మస్టాంగ్’ కార్ తీసుకుని రోడ్డు మీదకి వస్తాడు.
ఇక అక్కడి నుంచి అసలైన యాక్షన్ మొదలవుతుంది. హీరోని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం రంగంలోకి దిగుతుంది. కార్లు, హెలికాప్టర్లతో దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు స్టార్ట్ చేస్తారు. ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో హీరోకి అతని పాత సైనిక మిత్రులు కూడా సాయం చేయడానికి ముందుకొస్తారు. మరి పోలీసుల ఈ ఉచ్చు నుంచి ర్యాన్ ఎలా తప్పించుకున్నాడు? తన మీద పడిన తప్పుడు హత్య కేసు నుండి బయటపడ్డాడా? ఈ ప్రయాణంలో అతడికి తన పాత స్నేహితులు ఎలా అండగా నిలిచారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
ఈ సినిమాలో ర్యాన్ గా లియామ్ నీసన్ నటించగా, అతడి మాజీ భార్య తారా పాత్రలో మారిస్సా తోమీ కనిపించారు. మార్క్ వాన్సెలో దర్శకత్వం వహించగా, అల్కార్లీ, బార్ట్ రోసెన్‌బ్లాట్, యూజీన్ ముస్సో నిర్మాతలుగా వ్యవహరించారు. సుమారు 1 గంట 40 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం 2026లో విడుదలైంది. ప్రస్తుతం Amazon Prime Videoలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఆడియోల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: ఆడుకుంటుంటే చేతికి చిక్కిన 5 కోట్ల అదృష్టం… రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత… పక్కా ఫ్యామిలీ డ్రామా