Hindi Comedy Series: ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి అనుకోకుండా భారీగా లాటరీ తగిలితే ఎలా ఉంటుంది… ఆ ఆలోచన పోలా అదిరిపోలా ? కానీ ఆ డబ్బుతో వాళ్లు పడే తిప్పలు, చుట్టుపక్కల వాళ్ల రియాక్షన్స్ సంగతేంటి… ఇదే కాన్సెప్ట్ తో నవ్వుల పువ్వులు పూయించే సిరీస్ ‘ధిండోరా’ (Dhindora). ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్ (Bhuvan Bam) సృష్టించి, నటించిన ఈ హిందీ కామెడీ సిరీస్ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ క్లీన్ ఫ్యామిలీ డ్రామాను చూసి ఏ ఓటీటీలో చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు ? అన్నది తెలుసుకుందాం.
ఢిల్లీలో నివసించే ఒక మిడిల్ క్లాస్ కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భువన్, అతని తండ్రి బబ్లూ, తల్లి జానకి ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలాగే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. కుటుంబంలో డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, చిన్న చిన్న గొడవలు మామూలుగానే ఉంటాయి. అయితే బబ్లూ జీకి అనుకోకుండా లాటరీ తగలడంతో వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. కానీ లాటరీ రూపంలో వచ్చిన అదృష్టం ఆ కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వాల్సింది పోయి కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.
డబ్బు చేతికి వస్తుందనే ఆశతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు రకరకాలుగా ప్రవర్తించడం మొదలుపెడతారు. అయితే ఈ లాటరీ వ్యవహారం అనుకున్నంత ఈజీగా ఉండదు. బబ్లూ జీకి జరిగిన ప్రమాదం, దాని తర్వాత ఎదురయ్యే పరిస్థితులు కథను ఊహించని మలుపు తిప్పుతాయి. లాటరీ టికెట్ కు సంబంధించిన గందరగోళం కుటుంబాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది. మరి ఇంతకీ ఆ ఫ్యామిలీకి లాటరీ వల్ల కలిగిన ఇబ్బందులు ఏంటి ? చివరకు ఏమైంది ? అన్నది తెరపై చూడాల్సిందే.
‘ధిండోరా’ హిందీ కామెడీ-డ్రామా సిరీస్. భువన్ బామ్ సృష్టించిన ఈ సిరీస్‌కు హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించారు. 2021లో యూట్యూబ్‌లో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సిరీస్ మొదటి సీజన్… అక్టోబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో హిందీలోనే ఉంది. ఐఎమ్‌డీబీలో 8.8 రేటింగ్ సాధించిన ఈ సిరీస్‌లో భువన్ బామ్ ఒకటి కాదు, ఏకంగా పది విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను నవ్విస్తారు.
ఈ సిరీస్‌లో భువన్‌తో పాటు బబ్లూ జీ, జానకి జీ, టిటు మామ (Titu Mama), బాంచో (Bancho), సమీర్ ఫుడ్డీ (Sameer Fuddi), డిటెక్టివ్ మంగ్లూ (Detective Mangloo), మిస్టర్ హోలా (Mr. Hola), బబ్లీ సర్ (Bubbly Sir), లఖన్ ఛత్రివాలా (Lakhan Chhatriwala) వంటి పలు పాత్రల్లో నటించారు. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, మాట తీరు, హావభావాలు చూపిస్తూ కామెడీని పండించారు. ఒకే నటుడు ఇన్ని విభిన్న పాత్రలు పోషించడం ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ. డాక్టర్ తారా (Dr. Tara) పాత్రలో గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) కనిపిస్తారు. జీహూషు అహ్లువాలియా (Jeeveshu Ahluwalia), రాజేశ్ తైలాంగ్ (Rajesh Tailang), ఇష్టియాక్ ఖాన్ (Ishtiyak Khan), అరుణ్ కుష్వాహా (Arun Kushwaha), బద్రి చవాన్ (Badri Chavan), అనూప్ సోని (Anup Soni) తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. అనూప్ సోని ఈ సిరీస్‌లో తన పేరుతోనే కనిపించడం మరో ప్రత్యేకత.