Comedy Series: ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం ఏంటో తెలుసా ? వచ్చే జీతం అరకొర, చేసే పని మాత్రం అంతులేనంత. బాస్ పెట్టే టార్చర్ భరించలేక జాబ్ మానేద్దామంటే ఖర్చులు గుర్తుకొస్తాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ యూత్‌ను నవ్వించడానికి వచ్చిన లేటెస్ట్ ఇంగ్లీష్ కామెడీ సిరీస్ ‘మినిమం వేజ్’ (Minimum Wage). ఈ సిరీస్ లో ఆఫీస్ ఉద్యోగుల బదులు ఒక పిజ్జా షాప్ లో పని చేసే టీనేజర్ల కష్టాలు, అల్లరిని ప్రత్యేకంగా చూపించారు. మరి వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో కథలో తెలుసుకుందాం పదండి.
కథంతా ఒక లోకల్ పిజ్జా షాప్ చుట్టూ తిరుగుతుంది. ఈ షాప్ లో పని చేసే కుర్రాళ్లకు చదువుతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా ఉంటాయి. కానీ వీళ్లు చేసే పనులు చూస్తే మాత్రం షాప్ నడపడం కంటే గందరగోళం సృష్టించడంలోనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. కస్టమర్లకు సరైన సమయంలో ఆర్డర్లు అందించడం దగ్గర నుంచి, షాప్ లో పనులు చక్కబెట్టడం వరకు ప్రతిదీ ఒక కామెడీ ఎపిసోడ్ లా మారిపోతుంది. ఈ గ్యాంగ్‌లో గ్రేస్ కొంత బాధ్యతగా వ్యవహరించే వ్యక్తి. మిగతా వాళ్లు మాత్రం తమాషాలు, అల్లరి, వింత పనులతో షాప్ ను రచ్చ రచ్చ చేస్తుంటారు. ఏదైనా పని అప్పగిస్తే దాన్ని సరిగ్గా పూర్తి చేయడం కంటే, దాని చుట్టూ కొత్త సమస్యలు సృష్టించడమే వీళ్లకు అలవాటుగా మారుతుంది. దీంతో షాప్ లో వీళ్ళ పని మేనేజ్‌మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారుతుంది.
ఇక ఈ పిజ్జా షాప్ యజమాని మిస్టర్ సిల్వెస్టర్ ఎంట్రీతో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారతాయి. షాప్ నడుస్తున్న తీరు చూసి దాన్ని కొనసాగించాలా, లేక అమ్మేయాలా అనే ఆలోచనలో పడతాడు. దీంతో ఉద్యోగులు తమ పనితీరుతో యజమానిని మెప్పించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు. కానీ వాళ్ల ప్రవర్తన చూస్తే పరిస్థితి మెరుగుపడటం కంటే మరింత గందరగోళంగా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ క్రమంలో షాప్‌లో జరిగే వింత సంఘటనలు, ఉద్యోగుల మధ్య గొడవలు, కస్టమర్లతో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు నవ్వులు పూయిస్తాయి. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో సమస్య చుట్టూ కథ సాగుతుంది. ఉద్యోగం అంటే బాధ్యతగా పని చేయడం పక్కన పెడితే, ఈ కుర్రాళ్లకు పని మధ్యలో అల్లరి చేయడమే అసలు పని అన్నట్లుంటుంది. మరి చివరికి ఆ షాప్ గతి ఏమైంది ? అన్నది తెలియాలంటే సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.
‘మినిమం వేజ్’ ఇంగ్లీష్ కామెడీ సిరీస్. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్‌లో 14 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి కూడా తక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం కేటాయించకుండా సులభంగా చూడవచ్చు. తెలుగులో డబ్బింగ్ లేదు. సిరీస్ ను జెరెమీ గారెలిక్ (Jeremy Garelick), విల్ ఫెల్ప్స్ (Will Phelps) రూపొందించారు. ఇందులో ఎయిడన్ మిచో (Aidan Micho), గ్రేస్ రైటర్ (Grace Reiter), హైడ్ హీలీ (Hyde Healy), జూలియా డిసీజేర్ (Julia DiCesare), ల్యూక్ బర్క్ (Luke Burke), ర్యాన్ మిచో (Ryan Micho), టామీ ఆర్మ్‌స్ట్రాంగ్ (Tommy Armstrong) తదితరులు నటించారు. తేలికపాటి కామెడీతో సాగే మంచి టైమ్ పాస్ సిరీస్ ఇది.
Read Also: నవ్వినా అవుట్… భయపడినా అవుట్… హాలోవీన్ హంగామాలో అన్‌స్టాపబుల్ కామెడీ