Chaurya Paatham: ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్ లో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా కథ లేకపోతే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. చిన్న సినిమా.. మంచి కథతో వస్తే నెత్తిన పెట్టుకుంటున్నారు. చిన్న సినిమాగా ఓటీటీలో రిలీజ్ అయ్యి.. రికార్డులు సృష్టిస్తున్న సినిమాల్లో చౌర్య పాఠం ఒకటి. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల ప్రధానపాత్రల్లో నటించిన చౌర్య పాఠం సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించగా.. త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 25 న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ లో కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
ఇక రిలీజ్ అయిన నెలరోజుల్లోనే చౌర్య పాఠం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులే ట్విస్టులు ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో విజయవంతం చేశారు. ఇక ఓటీటీలో రిలీజ్ అయినా దగ్గరనుంచి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించింది. మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ రాబట్టి చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించింది.
ఇక చౌర్య పాఠం కథ విషయానికొస్తే.. “వేదాంత్ రామ్ (ఇంద్ర రామ్) ఒక సినిమా డైరెక్టర్. ఎలాగైనా ఒక సినిమాను డైరెక్ట్ చేసి పేరు తెచ్చుకోవాలని చూస్తాడు. కానీ, చేతిలో డబ్బులు ఉండవు. దీంతో ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. ఒక చిన్న గ్రామంలో ఉన్న బ్యాంక్ లో దొంగతనం చేయాలని చూస్తాడు. దానికి అవసరమైన ప్లాన్, సహాయానికి ఫ్రెండ్స్ ను తీసుకొని ఆ గ్రామానికి వెళ్తాడు. అక్కడ సొరంగం తవ్వి.. డైరెక్ట్ గా బ్యాంక్ లోపలకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. అయితే ఆ సొరంగం బ్యాంక్ లోపలికి కాకుండా సర్పంచ్ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ వేదాంత్ కు సర్పంచ్ చీకటి బాగోతం కంటపడుతుంది. అసలు సర్పంచ్ ఎవరు.. ? పైకి దేవతలా కనిపించే ఆమె వెనుక ఉన్న క్రైమ్ ఏంటి.. ? ఆ గ్రామంలోని బ్యాంక్ లో పని చేసే అంజలి (పాయల్ రాధాకృష్ణ)తో వేదాంత్ కి ఎలా ప్రేమ కుదిరింది ?, ఈ ఇద్దరి ప్రేమ కథ ఎలా సాగింది ? చివరకు వేదాంత్ అనుకున్నది సాధించాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా మొత్తం ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. సినిమాకు హైలైట్ అంటే ఇంద్ర రామ్ నటనే అని చెప్పొచ్చు. ఒకపక్క అమాయకంగా కనిపిస్తూనే ఇంకోపక్క విలనిజం చూపించే సర్పంచ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. రాజీవ్ కనకాల కనిపించేది కొద్దిసేపే అయినా.. నవ్వులు పూయిస్తాడు. మొత్తానికి ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కు గురి చేస్తుంది అని చెప్పొచ్చు.మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.