Corporate Scandal Documentary : ఒక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోతే… పైలట్ తప్పిదమో, వాతావరణ సమస్యో అనుకోవచ్చు. కానీ ఒకే విమాన మోడల్‌కు చెందిన రెండు విమానాలు కొన్ని నెలల వ్యవధిలోనే ప్రమాదానికి గురై 346 మంది ప్రాణాలు కోల్పోతే ? అసలు తప్పు ఎక్కడ జరిగింది ? విమానంలో ఉన్న సాఫ్ట్‌వేర్ వ్యవస్థే ప్రమాదానికి కారణమైందా ? పైలట్లకు కీలకమైన సమాచారం తెలియకుండా పోయిందా ? భద్రత కంటే కంపెనీ లాభాలకు ప్రాధాన్యం ఇచ్చారా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ‘డౌన్‌ఫాల్ ది కేస్ ఎగైనెస్ట్ బోయింగ్’ (Freefall A Reckoning for Boeing). మరి 737 MAX విమానాల వెనుక జరిగిన అసలు కథేంటి ? అన్నది ఇప్పుడు చూద్దాం.
ఇది కల్పిత కథ కాదు. బోయింగ్ 737 MAXకు సంబంధించిన రెండు ఘోర విమాన ప్రమాదాల వెనుక జరిగిన పరిణామాలను పరిశీలించే నిజ జీవిత డాక్యుమెంటరీ. మార్కెట్‌లో పోటీ పెరగడంతో తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాలను త్వరగా తీసుకురావాల్సిన ఒత్తిడి బోయింగ్‌పై పెరిగింది. అందులో భాగంగానే 737 మ్యాక్స్ అభివృద్ధి జరిగింది. కొత్త ఇంజిన్ల వల్ల విమానంలో కొన్ని మార్పులు రావడంతో MCAS అనే ఆటోమేటెడ్ ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థను ఉపయోగించారు. కొన్ని పరిస్థితుల్లో విమానం ముక్కును కిందికి తిప్పేలా ఇది పని చేస్తుంది. సమస్య ఏంటంటే… ఈ వ్యవస్థ గురించి పైలట్లకు ఎంతవరకు సమాచారం అందింది ? అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఎలా వాడాలో వాళ్ళకి పూర్తిగా తెలుసా ? అనే ప్రశ్నలు తర్వాత కీలకంగా మారాయి.
2018 అక్టోబర్‌లో లయన్ ఎయిర్ ఫ్లైట్ 610 ప్రమాదానికి గురైంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఇండోనేషియాలో కూలిపోవడంతో అందులో ఉన్న 189 మంది మరణించారు. ఆ ప్రమాదం తర్వాత ప్రపంచం పూర్తిగా కోలుకోకముందే 2019 మార్చిలో మరో విషాదం జరిగింది. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 302 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే మోడల్ విమానాలు… రెండు ప్రమాదాలు… కొన్ని నెలల వ్యవధిలోనే… మొత్తం 346 మరణాలు. దీంతో ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి.
దర్యాప్తులు సాగుతున్న కొద్దీ MCAS వ్యవస్థపై దృష్టి పడింది. సెన్సార్ నుంచి తప్పు సమాచారం అందినప్పుడు, విమానాన్ని పదేపదే కిందికి నెట్టే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పరిశీలించారు. ఇదే సమయంలో బోయింగ్ మాజీ ఉద్యోగులు, విమానయాన నిపుణులు, జర్నలిస్టులు, బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా ఈ డాక్యుమెంటరీలో కీలకంగా మారతాయి. కేవలం సాంకేతిక లోపాలే కాదు… కార్పొరేట్ ఒత్తిడి, భద్రతా నిర్ణయాలు, నియంత్రణ సంస్థల పర్యవేక్షణ, పైలట్లకు అందిన సమాచారం వంటి అంశాలపై కూడా డాక్యుమెంటరీ ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రమాదాల తర్వాత 737 మ్యాక్స్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయడం, దర్యాప్తులు జరగడం, బాధిత కుటుంబాలు న్యాయం కోసం పోరాడటం వంటి పరిణామాలను కూడా చూపిస్తుంది. అసలు ఈ ప్రమాదాలు ఎలా జరిగాయి ? కారణం ఏంటి ? అనేది తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీని చూడాల్సిందే.
బోయింగ్‌పై ఆరోపణలు మాత్రమే కాకుండా… ప్రమాదాలకు ముందు తీసుకున్న నిర్ణయాలను, మాజీ ఉద్యోగుల అనుభవాలను, నిపుణుల విశ్లేషణను, బాధిత కుటుంబాల వేదనను కలిపి చూపించడం దీని ప్రత్యేకత. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. ఒరిజినల్ ఆడియో ఇంగ్లీష్‌లో ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ లేదు. విమానయానం, నిజ జీవిత ప్రమాదాలు, కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న కథలు ఇష్టపడేవారికి ఇది తప్పకుండా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
Read Also: తల్లిదండ్రుల ప్రేమకథ వెనుక ఎయిడ్స్ విషాదం… ఈ అమ్మాయి తెలుసుకున్న నిజం కదిలిస్తుంది మావా