OTT Movie : ఈ మధ్య ఓటిటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ తో మొదలుపెట్టి, అన్ని ఇండస్ట్రీల నుంచి వస్తున్న ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. థియేటర్లలో సందడి చేశాక, ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చింది. ఒక యూనివర్సిటీలో జరిగే వరుసహత్యలతో ఈ స్టోరీ నడుస్తుంది. ఒక గ్రిప్పింగ్ స్టోరీ తో చివరి వరకు ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే …
నాలుగు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ తమిళ థ్రిల్లర్ మూవీ పేరు ‘డి బ్లాక్’ (D block). 2022లో విడుదలైన ఈ మూవీకి, నూతన దర్శకుడు విజయ్ కుమార్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. MNM ఫిలింస్ బ్యానర్‌పై సినిమాటోగ్రాఫర్ అరవింద్ సింగ్, ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అరవింద్, అరుళ్నితి ప్రధాన పాత్రల్లో నటించగా, పళనియప్పన్, చరణ్‌దీప్, తలైవాసల్ విజయ్, రమేష్ ఖన్నా, ఉమా రియాజ్ ఖాన్ సహాయక పాత్రల్లో నటించారు. ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజీలోని D బ్లాక్ అనే గర్ల్స్ హాస్టల్‌లో జరిగే డెత్ మిస్టరీల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 2022, జూలై, 1 న థియేటర్‌లలో విడుదలైంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనితీరుకు ఈ మూవీ ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా డిసెంబర్ 2022 లో అదే పేరుతో హిందీ డబ్బింగ్ వెర్షన్ లో విడుదలైంది. ఈ సినిమా ఈ టివి విన్ (etv win) తెలుగు లో, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) తమిళ్ లో, జీ 5 (ZEE5), హాట్ స్టార్ (Hotstar) ఇతర భాషలలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
కోయంబత్తూరులోని ఒక మారుమూల ప్రాంతంలో, దట్టమైన అడవిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అక్కడ విద్యార్థులకు, రాత్రి వేళల్లో క్యాంపస్ బయటకు వెళ్లకూడదని హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. కాలేజ్ అడవి ప్రాంతంలో ఉన్నందున, అడవిలో వన్యమృగాలు సంచరిస్తాయని జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఇలా ఉండగా అరుల్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి కాలేజ్ లో చేరతాడు. ఒక రోజు D బ్లాక్‌లోని గర్ల్స్ హాస్టల్‌లో ఒక విద్యార్థిని స్వాతి, బాత్రూంలో ఒక వింత ఆకారాన్ని చూసి భయపడుతుంది. తర్వాత ఆమె హాస్టల్ టెర్రస్‌పై దాడికి గురై, మరుసటి రోజు మృతదేహంగా కనిపిస్తుంది. ఆమె తలపై చిరుతపులి గాట్లు ఉన్నట్లు కనిపిస్తాయి. కాలేజీ యాజమాన్యం దీనిని జంతువు దాడిగా కప్పిపుచ్చడానికి, పోలీసులకు లంచం కూడా ఇస్తుంది. అయితే అరుల్‌కి ఒక సీనియర్ విద్యార్థిని మాయ, గతంలో కూడా ఇలాంటి మరణాలు జరిగాయని చెబుతుంది. ఆమె చూపించిన ఒక డ్రాయింగ్, చనిపోయిన స్వాతి గీసిన చిత్రంతో సరిపోలడంతో అనుమానాలు మొదలవుతాయి.
అరుల్ అతని స్నేహితులు, మాయ కలిసి ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తారు. మొత్తం ఎనిమిది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయారని కనిపెడతారు. ఆ తరువాత వారు కాలేజ్ లో గతంలో పనిచేసిన ఒక సెక్యూరిటీ గార్డ్ ద్వారా కలి అనే వ్యక్తి గురించి తెలుసుకుంటారు. కలి చిన్నతనంలో మానసిక రోగిగా ఉండేవాడు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపిన చరిత్ర కూడా అతనికి ఉంది. అతను D బ్లాక్ ను కడుతున్నప్పుడు అక్కడ పనిచేసేవాడు. గర్ల్స్ బాత్రూమ్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడతాడు. కాలేజీ విద్యార్థులచే దాడికి గురై, ఆ తర్వాత పోలీసుల నుండి కూడా తప్పించుకుంటాడు. అప్పటి నుండి, అతను D బ్లాక్‌లో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుంటాడు. చివరికి అరుల్, అతని స్నేహితులు ఆ సైకోని కనిపెడతారా ? అతన్ని ఎలా పట్టుకుంటారు ? అనేది ఈ మూవీని చూసి తెలుసుకోండి.