Dacoit Hindi OTT Release : అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించినంత వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి వీక్షణాదరణను పొందుతోంది. ఇప్పుడు హిందీ వెర్షన్ ‘డెకాయిట్ : ఏక్ ప్రేమ్ కథ’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో Dacoit : Ek Prem Katha జూన్ 5 నుంచి ఈ మూవీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. దక్షిణ భారత భాషల్లో ఓటీటీలో ఇప్పటికే విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం హిందీలో కూడా ఫ్యాన్స్‌ను ఆకర్షించే అవకాశం ఉంది. 8 వారాల థియేట్రికల్ విండో పూర్తి చేసిన తర్వాత హిందీ వెర్షన్ ఓటీటీలోకి రాబోతోంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో ప్రేమ, ప్రతీకారం, సస్పెన్స్ అన్నీ అంశాలు కలగలిపి ఉంటాయి. దళిత యువకుడు హిందూపురానికి చెందిన హరిదాస్ అలియాస్ హరి (అడివి శేష్). సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయితో గాఢంగా ప్రేమలో పడతాడు. కానీ ఇద్దరి మధ్య ఉన్న కుల – అంతస్థుల భేదాల వల్ల సరస్వతి కుటుంబ సభ్యులు వీళ్ళ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆ సమయంలో సరస్వతి అన్న రమేష్ హత్యకు గురవుతాడు. ఆ హత్య కేసులో హరిని ఇరికిస్తూ సరస్వతి పోలీసులకు సాక్ష్యం చెబుతుంది. తాను అమాయకుడైనప్పటికీ, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే తనను మోసం చేయడంతో హరి జైలు పాలు అవుతాడు. 13 ఏళ్ల తరువాత జైలు గోడల నుంచి బయటకు వచ్చిన హరి ప్రియురాలిపై ఎలా పగ తీర్చుకున్నాడు ? అన్నది స్టోరీ.
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా తమ కెమిస్ట్రీతో మెప్పించారు. జగపతి బాబు, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, సునీల్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించారు. సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది.
Also Read : థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?
థియేటర్లలో 65 కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా భారతదేశంలో సుమారు 56 కోట్లు వసూళ్లు మాత్రమే సాధించింది. విదేశాల్లో కూడా ఆశించినంత వసూళ్లు రాలేదు. అయినా ఓటీటీలో మాత్రం ఈ చిత్రం బాగా రాణిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్‌లో నిలవడం దీనికి నిదర్శనం. దక్షిణ భారత భాషల్లో మంచి వీక్షణాదరణ పొందిన ఈ చిత్రం హిందీలో కూడా మంచి స్పందన అందుకుంటుందని భావిస్తున్నారు.
గ్రామీణ వాతావరణం, రొమాంటిక్ మూమెంట్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు ఈ సినిమాలో బాగున్నాయి. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు మంచి బ్యాకింగ్ ఇచ్చింది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి హిందీ ఓటీటీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.