OTT Movie : ఒక కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ప్రేక్షకుల చూపును కూడా పక్కకి తిప్పుకోకుండా చేస్తోంది. ఈ సిరీస్ చోయ్ యీ-జే అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఇందులో కష్టాలను అధిగమించలేక ఇతను ఆత్మహత్య చేసుకుంటాడు. అయితే మృత్యు దేవత అతనికి 12 వేర్వేరు జీవితాలలో పునర్జన్మ పొంది, ప్రతి జీవితంలో మరణాన్ని అనుభవించాలని శిక్షిస్తుంది. అతను ఈ జీవితాలలో ఒక్కటైనా బతకగలిగితే, అతను ఆ జీవితాన్ని పూర్తిగా జీవించే అవకాశం పొందుతాడు. లేకపోతే అతను నరకానికి వెళ్తాడు. ఈ నేపథ్యంలో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఓటీటీలో ఈ సిరీస్ మంచి వ్యూస్ తో నడుస్తోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘డెత్స్ గేమ్’ (Death’s Game) అనేది దక్షిణ కొరియాకు చెందిన ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది హా బైంగ్-హూన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సిరీస్ లో సియో ఇన్-గుక్, సో-డామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2023 డిసెంబర్ 15 నుండి 2024 జనవరి 5 వరకు TVINGలో విడుదలైంది. 8 ఎపిసోడ్‌లతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో దక్షిణ కొరియా, చైనా మినహా అన్ని దేశాలలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
ఈ సిరీస్ కష్టాల్లో ఉన్న చోయ్ యీ-జే అనే వ్యక్తి జీవితంతో మొదలవుతుంది. అతను ఏడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అతనికి సరైన ఉద్యోగం ఎక్కడా లభించదు. దీంతో అతని ప్రేయసి కూడా అతన్ని విడిచి పెట్టి వెళ్ళిపోతుంది. బిట్‌కాయిన్ స్కామ్‌లో తన జీవితకాలం సంపాదించిన ఆదాయాన్ని కూడా కోల్పోతాడు. ఇక నిరాశలో ఉన్న అతను, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ మరణం తర్వాత, అతను మృత్యు దేవతని కలుస్తాడు. ఆమె అతని మరణం పట్ల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తుంది. అతన్ని డెత్ గేమ్ లోకి లాగుతుంది. అతను 12 వేర్వేరు శరీరాలలో పునర్జన్మ పొంది, ఆ జీవితాలలో మరణాన్ని అనుభవించాలి. అతను ఒక జీవితంలో బతకగలిగితే, అతను ఆ జీవితాన్ని జీవించే అవకాశం పొందుతాడు. లేకపోతే అతను నరకానికి వెళ్తాడు.
యీ-జే వేరే వాళ్ళ జీవితాలలో పునర్జన్మ పొందుతాడు. అయితే అతని ముందు అనేక సవాళ్ళు ఉంటాయి. ప్రతి జీవితంలో యీ-జే తన మరణాన్ని నివారించడానికి ప్రయత్నిస్తాడు. కానీ డెత్ అతని ప్రయత్నాలను అడ్డుకుంటూ, అతని నిర్ణయాలను పరీక్షిస్తుంది. ఇప్పుడు అతను తన మరణాలను నివారించడానికి ప్రయత్నిస్తూ, తన గత జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దడానికి, ఒక సీరియల్ కిల్లర్‌ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. యీ-జే ఈ జీవితాల ద్వారా జీవితం విలువను, సమాజంలోని ఒత్తిళ్లను అర్థం చేసుకుంటాడు. ఈ సమయంలో అతను తన మాజీ ప్రేయసిని మళ్లీ కలుస్తాడు.
క్లైమాక్స్‌లో యీ-జే తన పునర్జన్మలు అన్నీ పార్క్ తై-ఉ అనే ఒక సీరియల్ కిల్లర్ తో ముడిపడి ఉన్నాయని కనుగొంటాడు. ఆ కిల్లర్ ఇతని మరణాలకు కారణమవుతాడు. యీ-జే, తై-ఉను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ డెత్ అతన్ని హెచ్చరిస్తుంది. ఎందుకంటే యీ -జే ఎవరినైనా హత్య చేస్తే, ఆట నియమాలు మారతాయి. చివరి ఎపిసోడ్‌లో యీ-జే తన చివరి జీవితంలో తై-ఉను ఎదుర్కొంటాడు. తనను తాను బలిదానం చేస్తూ కిల్లర్‌ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అతని బలిదానం మృత్యు దేవతని కదిలిస్తుంది. ఆమె అతనికి ఒక చివరి అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు అతను తన పాత జీవితాన్ని తిరిగి పొందుతాడు. కానీ అతను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు.
Read Also : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ