Kannada Fantasy Comedy Drama: ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ బిజీగానే కన్పిస్తున్నారు. గంటలు, నిమిషాలు, సెకండ్లు లెక్కేసుకుంటూ ఈ డిజిటల్ యుగంలో పరుగులు తీయని వ్యక్తి లేడేమో. కానీ అప్పుడప్పుడూ ఈ బిజీ లైఫ్ పై విసుగు పుట్టి, కాలం ఆగిపోతే ఎంత బాగుండు అన్పిస్తుంది. మీకెప్పుడైనా అలా అన్పించిందా ? ఒకవేళ అన్పిస్తే ఈ మూవీ మీ కోసమే భయ్యా. సమయం విలువను హార్ట్ టచింగ్ స్టోరీతో చెప్పే కన్నడ ఫాంటసీ కామెడీ డ్రామా “Elra Kaaleliyatte Kaala”. “ఎల్రా కాలేలియట్టే కాలా” అంటే “ఓహ్ సమయం, నువ్వు ఎంత గొప్పవాడవో!” అని అర్థం. టైటిల్ కు తగ్గట్టే మన ఆధునిక జీవితాలను ప్రశ్నించే, నవ్వించే, ఆలోచింపజేసే ఒక అద్భుత ఫాంటసీ కామెడీ-డ్రామా ఇది. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
సినిమా స్టార్టింగ్ లో పురాతన కాలంలో ఒక ఋషి కాలం గురించి హెచ్చరిస్తాడు: “కాలం కోల్పోతే తిరిగి రాదు. దాన్ని గర్వంతో వ్యర్థం చేస్తే జీవితం ఖాళీ అవుతుంది”. కానీ ఒక యోధుడు ఆ మాటలను పట్టించుకోకుండా తన గర్వానికి తగిన గతి పాలవుతాడు. ఈ జానపద శైలి ఇంట్రో సినిమా మొత్తానికి ఒక లోతైన తాత్విక పునాది వేస్తుంది. స్టార్టింగ్ సీన్ తోనే సమయం ఎంత శక్తివంతమైనదో, ఎంత రహస్యమైనదో అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోతారు ప్రేక్షకులు.
ప్రస్తుత కాలంలోకి వచ్చేస్తే… మన కథానాయకుడు విజయ్ (చందన్ శెట్టి) బెంగళూరులో కాలేజీ ప్రొఫెసర్. ఆధునిక నగర జీవితం అతన్ని పూర్తిగా మార్చేసింది. ప్రతి సెకను గడియారం చూసుకుంటూ, ట్రాఫిక్, మీటింగ్స్, డెడ్‌లైన్స్ మధ్య పరుగులు పెడుతూ ఉంటాడు. ఒకరోజు ప్రయాణంలో ఆఖరి బస్సు మిస్ అవుతాడు. దారి మధ్యలో ఉన్న చిన్న గ్రామం “ఇద్నోడు”లో ఒక్క రాత్రి బస చేయాల్సి వస్తుంది. అక్కడ అతని పాత స్నేహితుడు పరమ్ (దర్శకుడు సుజయ్ శాస్త్రి) కూడా తారసపడతాడు.
ఇద్నోడులో జరిగే అద్భుతం… ఈ గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే విజయ్‌కు షాక్ తగులుతుంది. ఇక్కడ సమయం అనేదే లేదు. గడియారాలు తిరగవు, క్లాక్స్ పనిచేయవు. ప్రజలు సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆలయ గంటల శబ్దాల ఆధారంగా జీవితం సాగిస్తారు. ఎవరూ తొందరపడరు, ఒత్తిడి లేదు, ప్రశాంతంగా వ్యవసాయం చేస్తూ సంతోషంగా ఉంటారు. విజయ్ ఈ వాతావరణంలో చిక్కుకుపోతాడు. ఎలాగైనా త్వరగా బయటపడాలని ప్రయత్నిస్తాడు కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి అక్కడే ఉండిపోతాడు. మరి అక్కడి నుంచి హీరో ఎలా బయట పడ్డాడు ? ఆ ఊరు నుంచి అతను నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటి ? అన్నది కథ. సినిమా ముగిసేటప్పటికి ప్రేక్షకుల మనసులో కూడా ఒక ప్రశాంతత, ఆలోచన మిగులుతుంది.
సినిమా సమయం గురించి డీప్ మెసేజ్ ఇచ్చినా ఎక్కడా బోర్ కొట్టదు. ఆధునిక జీవితాల్లో మనం ఎంత తొందరపాటుతో ఉన్నామో గుర్తు చేసే ఒక మంచి మూవీ. Sun NXTలో కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. 2026 ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు సుజయ్ శాస్త్రి. చందన్ శెట్టి, అర్చన కొట్టిగే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా చూసిన తర్వాత మీ గడియారం కొంచెం నెమ్మదిగా తిరగాలని అనిపిస్తుంది.
Read Also : మంత్రగత్తె కావాలని కలలుగనే అమాయకపు అమ్మాయి… కట్ చేస్తే కేక పెట్టించే సీన్లు