OTT Movie : ఒక ఐటీ ఉద్యోగి అయిన మోహన్ గురక సమస్యతో, జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ప్రేమలో కూడా అమ్మాయిలు అతన్ని దూరం పెడతారు. దీనివల్ల అతనికి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఒకసారి అతని జీవితంలో అను అనే ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. వీరి వివాహం తర్వాత, మోహన్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని ఎలా మారుస్తుంది? ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా ? లేదా ఈ గురక కారణంగా వీళ్ళ బంధం ముగిసిపోతుందా? ఈ సినిమా వివరాలు ఏమిటి ? అనే విషయాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
మోహన్‌తో చెన్నైలోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక ఐటీ ఉద్యోగి. అతని తండ్రి మద్యపానం కారణంగా మరణించాడు. అతను తన తల్లి, అక్క మహా, చెల్లెలుతో కలిసి ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటాడు. మోహన్‌కు ఉన్న అతి పెద్ద సమస్య అతడు నిద్రలో పెట్టే గురక. ఇది అతని కుటుంబాన్ని, సహోద్యోగులను ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య కారణంగా అతని నుంచి ఒక అమ్మాయి దూరం అవుతుంది. దీని వల్ల అతనిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అయినప్పటికీ, అతని కుటుంబం అతన్ని సమర్థిస్తుంది. ఒక రోజు మోహన్, అను అనే అమ్మాయిని ఒక సమావేశంలో కలుస్తాడు. వీళ్ళ మధ్య సంబంధం బలపడి ప్రేమగా మారుతుంది. అను మోహన్ ను ఇష్టపడుతుంది. మోహన్ కూడా ఆమె ప్రవర్తనను ఇష్టపడతాడు. చివరికి వీళ్ళకి వివాహం కూడా జరిగిపోతుంది.
అయితే వివాహం తర్వాత మోహన్ గురక సమస్య అనుకి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇది ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మోహన్ తన గురక సమస్య కారణంగా గతంలో ఎన్నో అవమానాలు పడి ఉంటాడు. ఇప్పుడు అతను దీని వల్ల అను దూరం అవుతుందనే భయంతో ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడు. తన గురక సమస్య పరిష్కారమయ్యే వరకు అను పక్కన నిద్రపోకూడదని నిర్ణయించుకుంటాడు. ఈ నిర్ణయం వారి సంబంధంలో ఒత్తిడిని పెంచుతుంది. అను మోహన్ పరిస్థితి అర్థం చేసుకోలేక బాధపడుతుంది. ఈ విషయం వారి మధ్య గొడవలకు దారితీస్తుంది. చివరికి మోహన్ గురక సమస్య వారి వివాహాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అను పక్కన నిద్రపోకూడదని అతను తీసుకున్న నిర్ణయం వారి బంధాన్ని శాశ్వతంగా నాశనం చేస్తుందా ? మోహన్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తాడు. అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే
తమిళ మూవీ పేరు ‘గుడ్ నైట్’ (Good Night). 2023 లో వచ్చిన ఈ సినిమాకి వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, MRP ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించాయి. ఇందులో మణికందన్ (మోహన్), మీతా రఘునాథ్ (అను), రమేష్ తిలక్ (రమేష్), రైచల్ రెబెక్కా (మహా), బగవతి పెరుమాళ్, బాలాజీ శక్తివేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి IMDB లో 7.7/10 రేటింగ్ ఉంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.