OTT Movie : ఓటిటిలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు కామెడీ తో పాటు, ఫ్యామిలీ డ్రామా కూడా మంచి జోరు మీద సాగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ హనీమూన్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇందులో కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ కోసం పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. చివరివరకు సరదాగా సాగిపోయే ఈ సినిమా పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘హనీమూన్'(Honeymoon). 2022 లో రిలీజ్ అయిన ఈ పంజాబీ మూవీ అమర్ ప్రీత్ ఛబ్రా దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాలో గిప్పీ గ్రెవాల్, జాస్మిన్ భాసిన్, కరమ్‌జిత్ అన్మోల్, నసీర్ చిన్యోటి, నీర్మల్ రిషి వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఒక వినోదాత్మక కథనంతో, కుటుంబ సంబంధాలు, ప్రేమ, హాస్యం వంటి అంశాలతో సాగుతుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా పంజాబ్‌లోని ఒక గ్రామీణ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. దీప్, సుఖ్ కొత్తగా వివాహం చేసుకున్న జంట. అయితే ఆ ఇంట్లో హనీమూన్ జరుపుకోవడానికి ఈ జంటకు సమయం దొరకదు. ఎప్పుడు చూసినా కుటుంబ సభ్యులు ఎదురు పడుతూనే ఉంటారు. వీరు తమ హనీమూన్ కోసం లండన్‌కు వెళ్లాలని అనుకుంటారు. అందుకు తగ్గ డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు. అయితే వారి వివాహం తర్వాత వెంటనే ఒక శుభవార్త వస్తుంది. వారి కుటుంబ భూమిని ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణం కోసం, 25 లక్షల విలువైన ఆస్తిని 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయిస్తుంది. ఈ ఊహించని సంపద రావడానికి కారణం సుఖ్ ఇంట్లోకి అడుగుపెట్టడమే అనుకుంటారు. ఈ కుటుంబం ఆమెను తమ అదృష్ట దేవతగా భావించి తన కోరికను నెరవేర్చాలని అనుకుంటారు. సుఖ్ తన హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లాలని కోరుకుంటుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులకు హనీమూన్ అంటే ఏమిటో అర్థం కాదు. వారు దీనిని కేవలం ఒక సెలబ్రేషన్‌గా భావించి, ఈ వేడుకను జరుపుకోవడానికి అందరూ కలిసి వెళ్లాలని నిర్ణయిస్తారు.
దీప్, సుఖ్‌లతో పాటు 13 మంది కుటుంబ సభ్యులు వారి అమాయకత్వం, విచిత్రమైన ప్రవర్తనలతో ఈ హనీమూన్ యాత్రలో చేరతారు. లండన్‌లో వీరి ప్రయాణం హాస్యాస్పద సంఘటనలతో నిండి ఉంటుంది. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ఈ కుటుంబం విదేశీ సంస్కృతి, ఆధునిక జీవనశైలిని ఎదుర్కొన్నప్పుడు ఏర్పడే గందరగోళం, వారి అమాయకమైన తప్పిదాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే ఉన్నట్టుండి వీళ్ళ భూమిలో విమానాశ్రయం పడదని తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ కుటుంబ సభ్యులు డీలా పడిపోతారు. వీళ్ళంతా సుఖ్ మీద నిందలు వేయడం మొదలు పెడతారు. చివరికి ఈ జంటకు మొదటి రాత్రి జరుగుతుందా? అనే విషయం మీరు కూడా చూడాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ మూవీని చూడండి.