Boxing Sports Drama: ఇంట్లో తండ్రి వేధింపులతో విసిగిపోయిన ఓ కుర్రాడు ఒకరోజు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడు. తన కోపాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని అతనికి ఓ ఆర్మీ హాస్టల్ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అక్కడే అతని జీవితాన్ని మార్చే బాక్సింగ్ రింగ్ కనిపిస్తుంది. మొదట కోపాన్ని బయట పెట్టడానికి మొదలైన పోరాటం… తర్వాత తన జీవితాన్ని తిరిగి నిలబెట్టుకునే లక్ష్యంగా మారుతుంది. తండ్రిపై ఉన్న ఆగ్రహాన్ని బలంగా మార్చుకుని రింగ్ లోకి దిగే యువకుడి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘మై లడేగా’ (Main Ladega). మరి తండ్రికొడుకుల సెంటిమెంట్ కు యాక్షన్ ను యాడ్ చేసి తీసిన ఈ హిందీ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? అంటే…
ఆకాశ్ చిన్నప్పటి నుంచి కుటుంబంలో తీవ్రమైన సమస్యలను చూస్తూ పెరుగుతాడు. ముఖ్యంగా తండ్రి ప్రవర్తన వల్ల ఇంట్లో ప్రశాంతత ఉండదు. తల్లిని ప్రేమించే ఆకాశ్ కు ఆమె ఎదుర్కొంటున్న బాధ మరింత కోపాన్ని తెప్పిస్తుంది. తన పరిస్థితిని మార్చుకోవాలని అనుకున్నా ఇంట్లో ఉండే వాతావరణం అతన్ని మరింత కుంగదీస్తుంది. చివరకు కుటుంబానికి దూరంగా ఆర్మీ హాస్టల్ కు వెళ్లే పరిస్థితి వస్తుంది. అక్కడ ఆకాశ్ జీవితంలోకి బాక్సింగ్ వస్తుంది. మొదట రింగ్ అతనికి కోపాన్ని బయట పెట్టుకునే స్థలంలా కనిపిస్తుంది. కానీ ట్రైనింగ్ మొదలైన తర్వాత బాక్సింగ్ కేవలం కొట్టుకోవడం కాదని అతనికి అర్థమవుతుంది.
బాక్సింగ్ కి క్రమశిక్షణ, ఓర్పు, శారీరక బలం, మానసిక ధైర్యం అవసరమని తెలుసుకుంటాడు. పాండే సర్ వంటి వ్యక్తులు అతని ప్రయాణంలో మార్గదర్శకులుగా నిలుస్తారు. ఆకాశ్ తన గతాన్ని మర్చిపోవడం కోసం కాకుండా, దానిని ఎదుర్కొనే బలాన్ని సంపాదించుకోవడం కోసం రింగ్ లో శ్రమిస్తాడు. అతని లక్ష్యం జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడం. కానీ కుటుంబం నుంచి పూర్తిగా బయటపడటం అంత సులభం కాదు. తండ్రిపై ఉన్న కోపం, తల్లిపై ఉన్న ప్రేమ, తన గతంలో ఎదుర్కొన్న అవమానాలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి.
ఈ నేపథ్యంలో రింగ్ లో గెలవడం కంటే తన జీవితంపై తిరిగి నియంత్రణ సాధించడమే అతనికి పెద్ద విజయం అవుతుంది. ప్రతి మ్యాచ్ తో ఆకాశ్ లో మార్పు వస్తుంది. ఒకప్పుడు భయంతో మౌనంగా ఉన్న కుర్రాడు క్రమంగా తన కోసం, తన తల్లి కోసం నిలబడే స్థాయికి చేరుకుంటాడు. బాక్సింగ్ అతనికి ప్రత్యర్థిని ఓడించే ఆయుధం మాత్రమే కాకుండా తన జీవితాన్ని మార్చుకునే మార్గంగా మారుతుంది. మరి ఆ బాక్సింగ్ వల్ల హీరో లైఫ్ లో ఎలాంటి మార్పు వచ్చింది ? తండ్రిపై రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు ? చివరికి ఏమైంది ? అన్నది కథ.
అక్షయ్ ప్రతాప్ సింగ్ (Akash Pratap Singh), వల్లరి విరాజ్ (Vallari Viraj), గంధర్వ్ దేవన్ (Gandharv Dewan), అశ్వత్ భట్ (Ashwath Bhatt) తదితరులు నటించిన ఈ సినిమాకు గౌరవ్ రాణా (Gaurav Rana) దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 30 నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ హిందీ మూవీ తెలుగు ఆడియో ఓటీటీలో అందుబాటులో లేదు.